ఏపీలో ప‌ర్యాట‌కుల సంఖ్య 40 శాతం పెరుగుద‌ల‌

-రూ.183 కోట్ల‌తో అర‌కు అభివృద్ధి: మ‌ంత్రి భూమా అఖిల ప్రియ‌
Date:17/03/2018
అమ‌రావ‌తి ముచ్చట్లు:
ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌ర్యాట‌క స్థలాల అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌ని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఇటీవ‌ల కాలంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్యాట‌కుల సంఖ్య 40 శాతం పెరిగింద‌ని పేర్కొన్నారు. 183 కోట్ల రూపాయ‌ల‌తో అర‌కు అభివృద్ధికి కేంద్రానికి ప్ర‌తిపాదించామ‌ని, దీనికి కేంద్రం ఆమోదం తెలిపింద‌న్నారు. ఇందులో 159 కోట్లు కేంద్రం అందిస్తుంద‌ని, మిగిలిన 24 కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయిస్తుంద‌ని వివ‌రించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వాసుప‌ల్లి గ‌ణేష్, ఆనంద‌రావులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌ర్యాట‌క శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ స‌మాధాన‌మిస్తూ, గిరిజన ప్రాంతాల్లో ప‌ర్యాట‌క అభివృద్ధికి కొన్ని అడ్డంకులు ఏర్ప‌డుతున్నా, వాటిని అధిగ‌మించి ప‌నులు చేస్తున్నామ‌ని తెలిపారు.  స్వ‌దేశీ ద‌ర్శిని ప‌థ‌కం కింద అర‌కు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశామ‌న్నారు. లంబ‌సింగి ప్రాంతం అభివృద్ధికి ప‌ర్యాట‌క శాఖ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి వివ‌రించారు. లంబ‌సింగిని భూత‌ల స్వ‌ర్గంగా అభివ‌ర్ణిస్తూ, గ‌త ప్ర‌భుత్వాలు ఇక్క‌డి ప‌ర్యాట‌కాన్ని నిర్ల‌క్ష్యం చేశాయ‌ని, ఇపుడు వాటిని తీర్చిదిద్దే ప‌ని తాము ప్రారంభించామ‌న్నారు. ఇది దేవుడి సృష్టి, దానికి మాన‌వ ప్ర‌తిభ జోడిస్తే, అద్భుత ప‌ర్యాట‌కంగా తీర్చిదిద్ద‌వ‌చ్చ‌ని ఎమ్మెల్యే వాసుప‌ల్లి గ‌ణేష్ చెప్పారు. అమ‌లాపురం ఎమ్మెల్యే ఆనంద‌రావు మాట్లాడుతూ, త‌న నియోజ‌క‌వ‌ర్గంలో నిర్మించిన రిసార్ట్ ప‌నులు నిల‌చిపోయాయ‌య‌న్నారు. దీనికి మంత్రి భూమా అఖిల ప్రియ స‌మాధానం ఇస్తూ, గ‌త ప్ర‌భుత్వాలు ప‌ర్యాట‌క‌శాఖ‌ను పూర్తిగా నిర్ల‌క్ష్యం చేశాయ‌ని, తాము వ‌చ్చాక అన్ని ప్రాంతాల‌పై దృష్టి పెట్టామ‌న్నారు. లంబ‌సింగి గిరిజ‌న ప్రాంతంలో ఉండ‌టం వ‌ల్ల అక్క‌డి నిర్మాణ ప‌నుల‌ను ప్ర‌భుత్వ‌మే  ద‌గ్గ‌రుండి చేయిస్తోంద‌ని, దీని వ‌ల్ల కొంత ఆల‌స్యం జ‌రుగుతోంద‌న్నారు.
Tags: The number of tourists in the AP is 40 percent

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *