మంత్రులు మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్

Date:10/11/2018
విశాఖపట్టణం ముచ్చట్లు:
విశాఖ జిల్లాలో టీడీపీకి ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇద్దరూ కీలకమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావడమే కాదు, చంద్రబాబుకు నమ్మిన బంట్లుగా ఉంటున్నారు. అందువల్లనే చంద్రబాబు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూనే ఇద్దరినీ మంత్రులుగా తీసుకున్నారు. ఒకరికి రూరల్ జిల్లా, మరోకరికి అర్బన్ జిల్లా బాధ్యతలు అప్పగించి పార్టీని బలోపేతం చేయమని కోరారు.
అయితే నాలుగున్నరేళ్ళ కాలంలో బాబు ముచ్చట ఏ రోజూ తీరలేదు.విలువైన కాలమంతా ఇద్దరు మంత్రులు వివాదాలు, విభేదాలతోనే గడిపారు. ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగానే ఉంటూ వచ్చారు. తమ మధ్యన గొడవలు లేవంటూనే కలసి పనిచేయడానికి మాత్రం ససేమిరా అనేశారు. బాబు సైతం ఇద్దరికీ తలంటినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపధ్యంలో అవకాశం దొరికితే చాలు ఒకరిపైన ఒకరు బాహాటంగాగనే ఆరోపణలూ గుప్పించుకునే వారు.
విశాఖ భూ కుంభకోణం వెనక మంత్రి గంటా ఉన్నారంటూ అయ్యన్న అప్పట్లో చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. అలాగే ఏజెన్సీలో అక్రమ గంజాయి రవాణా వెనక అయ్యన్న హస్తం ఉందని గంటా ప్రత్యారోపణలు చేసే పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిలో గంటా పార్టీలోనూ, బాబు వద్ద కూడా తన బలాన్ని ఇటీవల కాలంలో పెంచుకున్నారు. ఆయన అతి ముఖ్యుడిగా బాబుకు మారిపోయారు.
మరో వైపు అయ్యన్న తన నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పడ్డారు. కుటుంబంలో తమ్ముడు, కొడుకు మధ్య విభేదాలు సైతం పరిష్కరించలేక ఇరకాటంలో పడ్డారు. అదే సమయంలో టీడీపీపైనా, బాబు పైనా వీలు దొరికినపుడల్లా ఆరోపణలు చేస్తూ చికాకు కలిగించారు. ఇవన్నీ ఎన్నికల వేళ అయ్యన్నకు మైనస్ గా మారుతున్నాయి.ఇక భూ కుంభకోణాలపై దర్యాప్తు చేసిన సిట్ తనకు క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన గంటా మంత్రి అయ్యన్న పై పరోక్షంగా కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
తనను ఎదుర్కోలేక కొంతమంది గతంలో ఆధారం లేని ఆరోపణలు చేస్తూ వచ్చారని, అవి తప్పు అని సిట్ విచారణ తేల్చిందని గంటా అన్నారు. తాను నిర్దోషినని, నిజాయతీపరుడినని చెప్పుకున్నారు. తన డిమాండ్ మీదనే ముఖ్యమంత్రి సిట్ విచారణకు ఆదేశించారని కూడా గంటా చెప్పారు.
ఈ కామెంట్స్ ద్వార అయ్యన్నతో తన వైరం సమసిపోలేదని మంత్రి గంటా గుర్తుచేసినట్లైంది. రానున్న రోజుల్లో కూడా గంటా దూకుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే టైంలో పార్టీలో అయ్యన్న ఎలా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాలి. ఎన్నికల వేళ ఈ ఇద్దరూ మళ్ళీ పరోక్ష యుధ్ధానికి సిధ్ధపడితే పార్టీకి చేటు తెస్తుందని కూడా అంతా భావిస్తున్నారు.
Tags: The ongoing cold war between ministers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *