చనిపోయినోళ్ల పెన్షన్లు నొక్కేసిన పంచాయతీ కార్యదర్శి
వరంగల్ ముచ్చట్లు:
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలోని పంచాయతీ కార్యదర్శి కక్కుర్తి బయటపడింది. ఏకంగా 30 మంది చనిపోయిన వాళ్ల పేర్ల మీద ఆసరా పెన్షన్లను యథేచ్ఛగా నొక్కేస్తూ జేబులో వేసుకుంటున్నట్టు బయటపడింది. గ్రామంలో పెన్షన్లు తీసుకునే 30 మంది చనిపోగా.. వాళ్లకు వచ్చే పెన్షన్ ఇంకా ఆగిపోలేదు. అయితే.. నెల నెలా వస్తున్న పెన్షన్‌ను తన వేలి ముద్రలు పెట్టి సైలెంటుగా నొక్కేస్తున్నట్టు తేలింది.ఎలాంటి ఆధారం లేని వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు చేయూతనిస్తూ.. సర్కారు ఆసరా పెన్షన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఆసరా పెన్షన్లు బతికున్న వాళ్లకే ఇవ్వాలి కదా.. ఇక్కడో సారు మాత్రం చచ్చిపోయినవాళ్లకు కూడా ఇస్తున్నాడు. ఎంత గొప్ప మనసో కదా.. గొప్ప మనసా పాడా.. వాళ్ల పేరు మీద వచ్చిన పెన్షన్ డబ్బులను తానే సంతకం పెట్టి జేబులో వేసుకుంటున్నాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30 మంది చనిపోయిన వాళ్ల పేరు మీద పెన్షన్లను సైలెంటుగా నొక్కేశాడు. జనాలకు డౌటనుమానం రావటంతో.. అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘనకార్యం చేసింది.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలోని పంచాయతీ కార్యదర్శిఅయితే.. పంచాయతీ కార్యదర్శి కక్కుర్తిని కనిపెట్టిన గ్రామస్థులు.. పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో చనిపోయిన వాళ్ల పేరు మీద ఆసరా పింఛన్ సొమ్మును కాజేశారoటూ ఆరోపించారు. గ్రామస్థుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. గున్నేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మండల పంచాయతీ అధికారి అప్సర్ పాషా గ్రామస్థులందరి ముందే బహిరంగ విచారణ నిర్వహించారు. మృతుల కుటుంబ సభ్యులను, పంచాయతీ కార్యదర్శిని విచారించి వివరాలు సేకరించారు.గ్రామంలో 2019 నవంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు 30 మంది వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు పొందే లబ్ధిదారులు వివిధ కారణాలతో మృతి చెందారు. పింఛన్ల జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించకుండా పంచాయతీ కార్యదర్శి తన వేలిముద్రలతో డబ్బులు డ్రా చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విచారణకు పింఛన్లు పంపిణీ చేసిన తపాలా శాఖ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ హాజరు కాకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.ఈ విచారణలో మృతి చెందిన 30 మంది పింఛన్లపై ఆరా తీయగా మృతి చెందిన 13 మంది పింఛన్లను రూ.2,86,176 వేలి ముద్రల ద్వారా డబ్బులు డ్రా చేసినట్లు తేలిoదని ఎంపీవో తెలిపారు. ఇద్దరు దివ్యాంగులు, మరో 15 మంది కి సంబందించిన వివరాలు పరిశీలించాల్సి ఉందన్నారు. ఈ విచారణకు సంబందించిన నివేదికను చర్యల నిమిత్తం డీపీవోకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags: The panchayat secretary pressed the pensions of the deceased
