పంచాయితీలకు అధికారులొచ్చారోచ్….

Date:17/09/2018
కాకినాడ ముచ్చట్లు :
పంచాయతీల్లో సర్పంచుల పాలన ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక అధికారుల నియామకాలపై ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. ఆగస్టులో సర్పంచుల పాలన పూర్తయిన వెంటనే పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచించింది. తక్షణమే 672 మందినే నియమించి వారికి మూడు నుంచి నాలుగు పంచాయతీలను అప్పగించారు.
దాదాపు మూడుసార్లు నిబంధనలు మార్చిన ప్రభుత్వం ఎట్టకేలకు అన్ని పంచాయతీల్లోనూ ప్రత్యేక అధికారులను నియమించింది.పంచాయతీల పాలన మరో ఆరు నెలల్లో ముగుస్తుందని భావించిన కొంత మంది సర్పంచులు పంచాయతీల అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారు. దీంతో దాదాపు ఏడు నెలల నుంచి పంచాయతీల్లో అభివృద్ధి మందగించింది. కనీసం పారిశుద్ధ్య చర్యలు కూడా చేపట్టని పరిస్థితి ఎదురైంది.
దానికి తోడు ఇన్‌ఛార్జి డీపీవో ఉండటం వల్ల  ఆయనకు కూడా ఈ శాఖపై అజమాయిషీ తక్కువగా ఉండేది. దీంతో ఎక్కడ చూసినా అపారిశుద్ధ్యం నెలకొని పల్లెల్లో వ్యాధులు విజృంభించే పరిస్థితి. ప్రత్యేక అధికారుల నియామకం వల్ల పరిస్థితి మెరుగుపడనుంది. నిధులు ఖర్చు చేసే అధికారం ప్రత్యేక అధికారులకు ఉంటుంది. దీంతో అభివృద్ధి కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. జిల్లాలోని 1,066 పంచాయతీల్లో ఆయా శాఖలకు చెందిన అధికారులను ఏర్పాటు చేసింది.
వీరికి ఈ నెల 18, 19, 25, 26 తేదీల్లో పంచాయతీ పాలన, నిధుల వినియోగం వంటి వాటిపై పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ దాదాపు పూర్తవగా జిల్లాలో మాత్రం ఈ నెలాఖరు నాటికి పూర్తికానుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఎన్నికలు జరిగే వరకూ వీరు కొనసాగే అవకాశం ఉంది. అధికారి ఏ పంచాయతీకీ న్యాయం చేయలేని పరిస్థితి వస్తుందనే నేపథ్యంలో దీనిపై కొంత వ్యతిరేకత వచ్చింది.
మళ్లీ పునారాలోచించిన ప్రభుత్వం అత్యవసర సేవలు అందించే శాఖల వారిని కూడా ప్రత్యేక అధికారులుగా నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ శాఖల కార్యదర్శుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈ నిర్ణయం కూడా వెనక్కుతీసుకుని అత్యవసర సేవల అధికారులను పక్కనపెట్టి ఎంపీడీవో, ఈవోపీఆర్డీ, తహసీల్దారు, ఉప తహసీల్దారు, ఎంఈవో, ఇతర శాఖల గెజిటెడ్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో కసరత్తు చేసిన యంత్రాంగం ఎట్టకేలకు 1066 మందితో జాబితాను తయారు చేసింది.
Tags:The panchayataiyarkalarkalarrocholach ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *