జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాల
తిరుపతి ముచ్చట్లు:
సెప్టెంబర్ 9వ తేదీ జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సీనియర్ జడ్జి డాక్టర్ కరుణకుమార్ పిలుపునిచ్చారు.తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో జిల్లా సీనియర్ జడ్జి డాక్టర్ కరుణకుమార్, ఏఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో జిల్లాలోని డిఎస్పీ లు, సీఐలతో జాతీయ లోక్ అదాలత్ కార్యాచరణపై సమావేశమయ్యారు.లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయ పీఠం. ఇక్కడ బాధితులే న్యాయ నిర్ణేతలు. ప్రజలకు క్షమించే గుణం ఉన్నప్పుడే లోక్ అదాలత్ ప్రక్రియ విజయవంతం అవుతుంది.కేసులు పెట్టుకుని కోర్టులు చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకండి. ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి.సివిల్ లో క్రిమినల్ ఉన్న కేసులను పరిష్కరించుటకు CCCRT(civil criminal conflict resolution team committee) కమిటీలు అనే నూతన ప్రక్రియను ప్రవేశపెట్టాం.క్రిమినల్ కేసుల్లో సమాజానికి విఘాతం కలిగించే గ్రేవ్ కేసులకు లోక్ అదాలత్ నందు అనుమతి లేదు. రాజీ చేయడం కుదరదు.ప్రజలు కేసుల నుండి విముక్తి పొంది, జాతీయ లోక్ అదాలత్ ప్రక్రియను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

గురువారం నాడు తిరుపతి పోలీస్ అతిథి గృహం సమావేశ మందిరం నందు ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి & డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ డాక్టర్ శ్రీ కరుణ కుమార్ గారు జిల్లా అదనపు ఎస్పీ శ్రీ వెంకటరావు పరిపాలన గారితో కలసి రాబోయే మెగా లోక్ అదాలత్ నిర్వహణపై జిల్లా పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జడ్జి గారు మాట్లాడుతూ లోక్ అదాలత్ అనగా ప్రజా న్యాయ పీఠం ఇక్కడ ఫిర్యాదుదారులు కోరుకున్న విధంగా కేసు పరిష్కరించడం జరుగుతుంది. సి.ఆర్.పి.సి సెక్షన్ 320 ప్రకారం ప్రమాదవశాత్తు భావోద్వేగ సమయంలో అనుకోకుండా జరిగిన నేరాల కేసులు వాటికి అనుబంధమైన సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, చిన్న చిన్న గొడవల కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు మాత్రమే లోక్ అదాలత్ లో అనుమతించి, ఇరుపక్షాలను రాజీ చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
గ్రేవ్ కేసులైన హత్య, మహిళా సంబంధిత కేసులు, సమాజ శ్రేయస్సుకు విఘాతం కలిగించే కేసులకు ఎంత మాత్రమూ లోక్ అదాలత్ లో రాజీ చేయుటకు అనుమతి లేదు. రాజీ చేయుటకు అవకాశం ఉన్న అన్ని క్రిమినల్ కేసుల నుండి కక్షిదారులు విముక్తి చెందాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 9వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామన్నారు.గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రీ-లోక్ అదాలత్ ను ముందస్తుగా నిర్వహించి ఇరుపక్షాలను సమావేశపరిచి రాజీ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియలో చైతన్యవంతులైన తిరుపతి జిల్లా పోలీసు సోదరుల పాత్ర ఎంతైనా ఉంది, వారి సహాయ సహకారాలతోనే రాబోయే జాతీయ లోక్ అదాలత్ సఫలీకృతం కాబోతున్నదన్నారు.లోక్ అదాలత్ కు ఫిర్యాదుదారుడు ప్రత్యక్షంగా హాజరు కావాలి. ప్రత్యక్షంగా హాజరు కాలేనటువంటి సాక్షులు, ముద్దాయిలు వీడియో కాన్ఫరెన్స్(దృశ్య శ్రవణ విధానం) ద్వారా హాజరైనా కూడా ఇరుపక్షాలను రాజీ చేస్తామన్నారు.భార్యాభర్తల వివాదాల కేసులు చాలా జఠీలమైనవి. కావున ఒక కేసు పరిష్కారం అయితే దానికి అనుబంధమైన MC, DVC, HMOP కేసులు అన్నీ కూడా పరిష్కరించబడతాయి. దయచేసి భార్యాభర్తల కుటుంబ సభ్యులు భార్యాభర్తలకు సరైన ఉపదేశం ఇచ్చి వారు రాజీపడి, మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తూ సాఫల్యం చేసుకోవాలన్నారు.
క్రిమినల్ కేసులను రాజీ చేసే ప్రయత్నంలో సివిల్ కేసులు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయి. ఇలాంటి కేసుల పరిష్కారానికై జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు CCCRT(civil criminal conflict resolution team committee) కమిటీలను ఏర్పాటు చేశారు. ఇటువంటి కేసుల తాలూకు సమగ్ర సమాచారాన్ని సదరు SHOలు ఆయా కోర్టు వారికి నివేదిస్తే, వారు కేసు పూర్వ ఫలాలను పరిశీలించి క్రిమినల్ కేసులకు అనుబంధంగా ఉన్న సివిల్ కేసులను కూడా రాజీ చేసి పరిష్కరించబడుతుందన్నారు. ఈ ప్రక్రియను ప్రజలు వినియోగించుకుని దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల నుండి విముక్తి చెందాలని కోరారు.తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ పి. పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., గారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు సమిష్టిగా కృషిచేసి, ఈ జాతీయ లోక్ అదాలత్ నందు ఎక్కువ కేసులను రాజీ చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. వారి ప్రయత్నాలకు అనుగుణంగా న్యాయవ్యవస్థ కూడా పనిచేసి జాతీయ మెగా లోక్ అదాలత్ ను సఫలీకృతం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన వెంకట్రావు , జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, కోర్టు లైసన్ ఆఫీసర్లు, ఉమ్మడి చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Tags: The parties should take advantage of the National Lok Adalat
