ముందస్తు ఎన్నికలపై సుప్రీంలో పిటీషన్

The petition in the Supreme Court on early elections

The petition in the Supreme Court on early elections

Date:19/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు :
తెలంగాణలో ముందస్తు ఎన్నికలను రద్దు చేసి, గవర్నర్ పాలన విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. గడువు కంటే ముందే ఎన్నికలు నిర్వహించడం వల్ల పౌరులకు నష్టమని పేర్కొంటూ సిద్దిపేటకు చెందిన పి. శశాంక్‌ రెడ్డి బుధవారం భారత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. తెలంగాణలో సాధారణ ఎన్నికల సమయానికి దాదాపు 20 లక్షల మందికి పైగా యువతకు ఓటుహక్కు పొందేందుకు వెసులుబాటు ఉందని, ముందస్తు ఎన్నికల వల్ల వారంతా ఓటు హక్కు వినియోగించుకోలేరని పిటిషనర్ పేర్కొన్నారు.
ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాసే విధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంక్షోభం లేకపోయినా, అత్యవసర పరిస్థితి లాంటివి లేకపోయినా ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న ప్రభుత్వమే అధికారంలో ఉందని, ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
‘ఎన్నికల సంఘంతో మాట్లాడిన తర్వాతే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. ఫలానా సమయంలో ఎన్నికలు జరుగుతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశాలను దృష్టిలోకి తీసుకుని సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు.
అప్పటివరకు రాష్ట్రంలో గవర్నర్‌ పాలన విధించాలని కోరారు. గవర్నర్‌ పాలన అమల్లో ఉండటం వల్ల ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందని తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కుదిస్తూ తెలంగాణ ఛీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారి జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈసీ, తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారి ఈ నిర్ణయం తీసుకున్నారని కోర్టు పేర్కొంది.
ఈసీ తన పని తాను చేసుకుపోతోందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఓటర్ల సవరణకు 2019 జనవరి వరకు గడువు ఉండగా.. దాన్ని 2018 జనవరికి కుదిస్తూ తెలంగాణ చీఫ్‌ ఎలక్ట్రోరల్‌ అధికారి రజత్ కుమార్ సెప్టెంబర్ 8న జారీ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ న్యాయవాది కొమ్మిరెడ్డి కృష్ణవిజయ్‌ ఆజాద్‌ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.
బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లకు తలొగ్గి గడువు కుదించారని పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గడువు కుదింపు వల్ల సుమారు 25 లక్షల మంది ఓటర్లకు జాబితాలో స్థానం దక్కే అవకాశం లేకుండాపోతుందన్నారు. వాదనలపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. అసెంబ్లీ రద్దయినందువల్ల రాజ్యాంగం ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత భారత ఎన్నికల కమిషన్‌‌పై ఉందని గుర్తుచేసింది.
ఆలోపు ఎన్నికలు పెట్టకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఓటర్ల సవరణ జాబితా కుదించడం వల్ల ఎన్నికల నిర్వహణ నిష్పాక్షికంగా జరగదని చెప్పడానికి మీవద్ద సరైన ఆధారాలు లేవని పిటిషనర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోడానికి నిరాకరించి దాన్ని కొట్టేసింది.
Tags:The petition in the Supreme Court on early elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *