ఆక్రమణల పర్వం (కృష్ణాజిల్లా)

date:08/10/2018
మచిలీపట్నం  ముచ్చట్లు:
జిల్లాలో జడ్పీకి చెందిన పలు స్థలాలు అక్రమార్కుల పరమవుతున్నాయి. చాలా చోట్ల విలువైన భూములు ఆక్రమణల చెరలో మగ్గుతున్నాయి. చాలా వాటికి కనీసం దస్త్రాలు కూడా లేకపోవడంతో అక్రమార్కులకు వరంగా మారింది. చాలా వరకు పాఠశాలల ఆటస్థలాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల స్వాధీనం, పరిరక్షణపై జిల్లా పరిషత్త్ దృష్టి సారించింది. రెవెన్యూ అధికారుల సాయంతో రికార్డులను పరిశీలించి.. మార్పు, చేర్పులు చేస్తున్నారు. ఈ కసరత్తుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
విజయవాడ, బందరు, గుడివాడ, నూజివీడు డివిజన్లలో కలిపి మొత్తం జిల్లాలో 1145.13 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా జడ్పీ ఉన్నత పాఠశాలలకు సంబంధించి 396.02 ఎకరాలు, ఇతర పాఠశాలల భూములు 34.40 ఎకరాలు ఉన్నాయి.
ఆ తర్వాత ఇతర జడ్పీ స్థలాలు 296.58 ఎకరాలు ఉన్నాయి. స్థానిక సంస్థలకు చెందిన చెరువులు, బావులు, సత్రాలు, కార్యాలయ భవనాలు, క్వారీ భూములు, అతిథి గృహాలు, ఆసుపత్రులు ఇందులో తదితరాలు ఉన్నాయి. జగ్గయ్యపేట, గన్నవరం, చిల్లకల్లు, కంచికచర్లలో ఖాళీ భూములు ఉన్నాయి. గత పాలకవర్గాలు వీటి పరిరక్షణపై దృష్టి సారించకపోవడంతో అక్రమార్కులు ఆడిందే ఆటగా మారింది. పలు చోట్ల భూములు అన్యాక్రాంతమయ్యాయి. దాతలు అప్పట్లో ఇచ్చిన స్థలాలను జడ్పీ పేరున కొన్నిచోట్ల మార్చలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పాక్షికంగా ఆక్రమించేశారు. ఇందులో పాఠశాలల స్థలాలే ఎక్కువగా ఉన్నాయి.
స్థలాల పరిరక్షణ విషయంలో ప్రజాప్రతినిధులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఏళ్ల తరబడి సమస్య అపరిష్కృతంగా మిగిలిపోతోంది. చాలా వాటి విషయంలో కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. రెవెన్యూ అధికారులు కూడా స్పందించడం లేదు. చాలా మంది ప్రజాప్రతినిధులు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారు. వారి చెరలో ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని జిల్లా పరిషత్తుపై ఒత్తిడి తెస్తున్నారు. నందిగామలోని సర్వే నెం. 471/2, 472/3లో క్వారీ ప్రాంతం ఉంది. దీన్ని పలువురు ఆక్రమించి నివాసం ఉంటున్నారు. ఈ స్థలాన్ని వారి పేరిట క్రమబద్ధీకరించాలని ప్రజాప్రతినిధి ఒకరు గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు.
కైకలూరు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. కలిదిండి మండలం కోరుకొల్లు చెరువు ఆక్రమణకు గురై 17 మంది అనుభవంలో ఉంది. ఈ స్థలాన్ని ఆక్రమించుకున్నవారి పేరిట పట్టాలు ఇప్పించాలని ప్రజాప్రతినిధి ఒకరు ఎప్పటి నుంచో కోరుతున్నారు.ఖాళీ స్థలాలను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు జడ్పీ దృష్టి సారించినా నిబంధనలే అడ్డంకిగా మారాయి. ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రతిపాదనలకు త్వరగా మోక్షం కలగడం లేదు. నేరుగా తమ స్థలాలను ఇతరులకు ఇచ్చే అధికారం జడ్పీకి లేదు. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం తెలపాలి. కేవలం 50 శాతం ప్రభుత్వ వాటా ఉన్న సంస్థలకే బదలాయించే అవకాశం ఉంది.
Tags:The Poem of Aggression (Krishna Ganesha)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *