ఊపందుకొన్న పోలవరం పునరావాస పనులు 

Pollavaram rehabilitation work

Date:11/02/2019

రాజమండ్రి ముచ్చట్లు:
పోలవరం పునరావాస పునర్నిర్మాణ పథకం, భూ సేకరణ ప్రక్రియ పుంజుకుంది. బిల్లులు ఎంత వేగంగా సమర్పిస్తే అంత వేగంగా రియంబర్స్‌మెంట్ చేస్తామని పీపీఏ స్పష్టం చేస్తున్న క్రమంలో ఎటువంటి ఆలస్యం లేకుండా బిల్లులను ఎప్పటికపుడు సమర్పిస్తున్నారు. ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులో అవసరమైన భూసేకరణ, ముంపు, పునరావాస కల్పన, గృహ నిర్మాణం తదితర అంశాలన్నీ ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అవసరమైన 39,033 ఎకరాల భూమిని సేకరణ, అందుకు అవసరమైన నష్టపరిహారం చెల్లింపు జరిగింది. ఇందుకు సంబంధించిన బిల్లులు పీపీఏకు సమర్పించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి ఈ జిల్లా పరిధిలో మొత్తం 13048 మందికి 2630.35 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు ఇటు భూసేకరణకు, ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి ఇప్పటి వరకు రూ.3018.06 కోట్లు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన మొత్తానికి బిల్లులు సమర్పించారు. ఇంకా ఈ జిల్లాలో రూ.2213.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో భూసేకరణ, ఆర్ అండ్ ఆర్‌కు సంబంధించి మొత్తం రూ.1774.91 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ.967.17 కోట్లు చెల్లించారు. ఇంకా రూ. 807.74 కోట్లు చెల్లించాల్సి ఉంది. చెల్లించిన మొత్తానికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో బిల్లులు సమర్పించలేదని తెలుస్తోంది. విశాఖ జిల్లా పరిధిలో మొత్తం 4110.15 ఎకరాల భూమికిగాను రూ.84.15 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.80.13 కోట్లు చెల్లించారు. ఇంకా రూ.4.02 కోట్లు బ్యాలెన్స్ ఉంది. బిల్లులు మొత్తం సమర్పించినట్టు తెలుస్తోంది. ఇక కృష్ణా జిల్లా పరిధిలో మొత్తం 3331.59 ఎకరాల భూమిని సేకరించారు. ఈ జిల్లాలో నిర్వాసితులు లేరు. విశాఖ, కృష్ణా జిల్లాల్లో కేవలం భూములు మాత్రమే సేకరణ జరిగింది. కృష్ణా జిల్లా పరిధిలో సేకరించిన భూమికి సంబంధించి అవసరమైన రూ.666.37 కోట్లు చెల్లింపు ప్రక్రియ పూర్తయింది. ఈ నాలుగు జిల్లాల్లో ఇటు ఆర్ అండ్ ఆర్, అటు భూసేకరణకు సంబంధించి మొత్తం రూ.7757.08 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ.4731.73 కోట్లు చెల్లించారు.
ఇంకా రూ.3025.35 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చెల్లించిన ఈ బిల్లులు కాకుండా ఇప్పటికే ఇంకా పీపీఎ నుంచి రూ.3818.53 కోట్లు రియంబర్స్ చేయాల్సి ఉంది. మొదటి విడత ముంపు గ్రామాల్లో పోలవరం మండలంలో ఎనిమిది గ్రామాలు, రెండో విడతలో 22 గ్రామాలు నష్టపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో మొదటి గ్రామాలు ఏడు ఖాళీ చేయించాల్సి ఉంది. ఇందులో అంగుళూరు, నేలకోట, పరగసానిపాడు, నాగళ్ళపల్లి, పి గొందూరు, జి బోడిగూడెం, డి రావిలంక గ్రామాలు ఉన్నాయి. రెండో విడతలో మొత్తం 25 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఇందులో వీరవరం లంక, మూలమెట్ట, మెట్టవీధి, పెనికిలపాడు, మంటూరు, సిహెచ్ రమణయ్యపేట, దండంగి, అగ్రహారం, మూలపాడు, మడిపల్లి, కచ్చులూరు, కొండమొదలు, మెట్టగూడెం, తాటివసడ, ఎ వీరవరం, కె గొందూరు, గంగంపాలెం, గుబ్బలంపాడు, సీతారం, ఏనుగులగూడెం, దేవీపట్నం, తొయ్యేరు, గానుగులగొంది, సుద్దకొండ, గండికోట గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది.
Tags:Pollavaram rehabilitation work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *