The poor and the poor

పేదల పాలిట రాబంధులు ….

– వడ్డీ దాహానికి నిండు జీవితాలు బలి
– కుటుంబ పెద్దలను కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలు
– ఆపై అక్రమ కేసులతో వేదింపులు, బెదిరింపులు

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న వడ్డీ వ్యాపారులు చివరిదాక జలగళ్ల దోచుకుని తింటున్నారు. అంతటితో వడ్డీ దాహం తీరక అక్రమ కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అవమానాలకు గురౌతున్న బాదితులు చివరకు జీవితాలనే అంతమోందించుకుంటున్నారు. వడ్డీ వ్యాపారులు దర్జాగా లక్షలు గడిస్తుండగా ఆ వడ్డీలకు చెల్లించలేని బాదితులు ఆత్మహత్యల దారిలో వెళ్తున్నారు. వేదింపులు భరించలేక చనిపోతున్న కుటుంబ పెద్దలతో ఆ కుటుంబాలు చిన్నాబిన్నమౌతున్నాయి. కుటుంబాల్లో చీకట్లు అలుముకుని, కుటుంబ పోషణ జరగని దయనీయ్యమైన పరిస్థితులు ఎన్నో…. ఇలాంటి సంఘటనలకు పుంగనూరు కేరాఫ్‌గా మారింది. వడ్డీ వ్యాపారుల వేదింపులపై బాదితులను కదిలిస్తే కన్నీటీపర్యంతమైయ్యే కథలెన్నో వెలుగు చూస్తున్నాయి.

వడ్డీల వ్యాపారం వర్థిల్లుతోంది…..

పట్టణం కర్నాటక సరిహద్దు ప్రాంతం కావడంతో పుంగనూరు , మదనపల్లె, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది ఇక్కడ ఆవులు, చింతపండు, టమోటా వ్యాపారాలు చేసి జీవిస్తుంటారు. అలాగే రైతులు పంటలు పండించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. దీనిని ఆసరా చేసుకుని కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు , దనవంతులు వడ్డీలు, చీటీల నిర్వహణ, బంగారు, వస్తువులను, ఇండ్లను , ఖాళీ స్థలాలను తాకట్టుపెట్టుకుని కోట్లాది రూపాయల వడ్డీవ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి వ్యాపారులు పట్టణంలో అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు రుణ గ్రహితకు డబ్బు అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయిస్తారు. పెళ్లిళ్ళకు, వ్యాపారాలకు రూ.5లు వడ్డీకి ఎంత డబ్బులైన ఇస్తారు. అలాగే ఆసుపత్రికి వెళ్లేందుకు అవసరమైన డబ్బుకు రూ.10 నుంచి రూ.20 వరకు వడ్డీ వసూలు చేస్తారు. అలాగే కొంత మంది వడ్డీ వ్యాపారులు ప్రతి రోజు వడ్డీ, అసలు కలిపి కంతుల వారిగా రుణగ్రహితల వద్దకు వెళ్లి వసూలు చేసుకుని చిన్నపాకెట్‌ బుక్కులో రాసి ఇస్తారు. మరి కొంత మంది వ్యాపారులు వారం వడ్డీ క్రింద ప్రతి వారం వడ్డీ చెల్లించేలా అప్పు ఇస్తారు. సక్రమంగా చెల్లించకపోతే వడ్డీని అప్పుకు జమ చేసి చక్ర వడ్డీ వసూలు చేస్తారు. మరి కొంత మంది వ్యాపారులు ఇండ్లు, ఖాళీ స్థలాలు పూర్తిగా రుణదాత పేరుతో రిజిస్ట్రర్లు చేసుకుని వడ్డీ వసూలు చేస్తారు. రుణగ్రహిత డబ్బులు చెల్లించకపోతే ఆస్తులు వడ్డీ వ్యాపారులపరమౌతుంది. అప్పు ఇచ్చే సమయంలో రుణగ్రహితల వద్ద ఖాళీ చెక్కులు, బాండ్లు తీసుకుంటారు. రుణగ్రహిత లక్షరూపాయలు బకాయి పడినా రూ.10 లక్షలు బకాయిలు ఉన్నట్లు తప్పుడు కేసులు పెట్టి రుణగ్రహితలను వేదించడంతో రుణ గ్రహిత వీధినపడటం రుణదాతలు దర్జాగా జీవితాలను గడపటం జరుగుతోంది.

బాదితుల గోడుగోడు…

పుంగనూరు మండలంలోని యల్లారుబైలు గ్రామంలో మునిరత్నం, లీలావతి రైతు దంపతులు రూ.10 లక్షలు అప్పులు తీర్చలేక వడ్డీ వ్యాపారుల వేదింపులు తాళలేక జూలై 6న సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనతో వారి ఇద్దరి పిల్లలు , మౌనిక(16) , సంతోష్‌(7) ఆనాధలైయ్యారు. అలాగే పట్టణంలోని చింతలవీధిలో నివాసం ఉన్న శంకర మే రూ.10 లక్షలు అప్పులు తీర్చలేక ఇంటిలో మే 11న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఆకుటుంబం వీధిన పడింది. అలాగే ఎన్‌ఎస్‌.పేటలో నినివాసం ఉన్న ధనశేఖర్‌ స్వీట్‌షాపు నిర్వహిస్తూ వేదింపులు తట్టుకోలేక గత ఏడాది పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే పట్టణంలోని గోకుల్‌వీధికి చెందిన జ్యోతి అనే మహిళ వడ్డీ వ్యాపారుల వేదింపులు తట్టుకోలేక గత ఏడాది ఆత్మహత్య చేసుకుంది. అలాగే పట్టణనికి చెందిన నయాజ్‌, నీలకంఠేశ్వర, కె.రెడ్డిప్రసాద్‌ వడ్డీవ్యాపారుల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారు. ఆస్తులు విక్రయించి, అప్పులు కట్టిన ఇంకను అప్పులు మిగిలిపోయాయని తప్పుడు కేసులు వేయడంతో బెంబేలెత్తిపోతున్నారు.

పట్టించుకోని అధికారులు….

అక్రమ వడ్డీ వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అలాగే ఇలాంటి వ్యాపారాలపై కేసులు నమోదు చేయాలని డిజిపి పోలీసులకు ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలు అమలు కాకపోవడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది. వేదిస్తున్న అక్రమ వడ్డీ వ్యాపారులపై ఎలాంటి కేసులు లేకపోవడంతో అక్రమ వడ్డీ వ్యాపారానికి పరోక్షంగా అధికార యంత్రాంగం వత్తాసు పలుకుతున్నట్లు తేటతెల్లమౌతోంది. గురువారం మృతి చెందిన వెంకట్రమణకు సంబంధించి కూడ ఎలాంటి కేసులు నమోదుకాకపోవడంతో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు హద్దు,అదుపులేకపోతోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని అక్రమ వడ్డీ వ్యాపారాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది.

కీచక ప్రిన్సిపాల్ పై విద్యార్ధిని ఫిర్యాదు

Tags: The poor and the poor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *