The pounding gold was struck

కొట్టుకొస్తున్న బంగారాన్ని కొట్టేశారు

-నలుగురు నిందితుల అరెస్టు
-రూ.కోటి వజ్రాభరణాలు స్వాధీనం

Date:23/10/2020

హైదరాబాద్ ముచ్చట్లు:

వరద నీటిలో కొట్టుకొస్తున్న బంగారు వజ్రాభరణాల సంచిని పట్టేసి సొంతం చేసుకుందామనుకున్న నలుగురు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.కోటి విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ గురువారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వివరాల్లోకి వెళితే జూబ్లీహిల్స్‌లోని కృష్ణ జ్యువెలర్స్‌లో పనిచేస్తున్న ప్రదీప్‌ కుమార్‌ ఈ నెల 9వ తేదీ సాయంత్రం 143 గ్రాముల వజ్రాభరణాల సంచిని తీసుకుని ద్విచక్ర వాహనంపై బషీర్‌బాగ్‌కు బయలుదేరాడు. మార్గమధ్యంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం.3 వద్ద కిందపడటంతో వరద ప్రవాహంలో ఆ సంచి కొట్టుకుపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా ప్రదీప్‌పైనే అనుమానంతో మూడు రోజుల పాటు విచారించారు. అతను తీసుకోలేదని నిర్ధారించుకున్న తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కల విచారణ జరిపారు. స్థానికంగా ఉన్న సెల్‌ఫోన్‌ టవర్‌ ఆధారంగా నంబర్లపై దృష్టి సారించారు. అంతకు ముందు వరకు సందేశాలు వెళ్లిన ఓ నంబరు ఆ తర్వాత స్విచ్ఛాఫ్‌ రావడంతో అనుమానం కలిగింది. ఆ నంబరు ఆధారంగా అక్కడే గుడిసెల్లో ఉంటున్న నాగర్‌ కర్నూల్‌ వాసులు కొట్టేసి ఉంటారని అనుమానించారు. ఘటన జరిగిన మరుసటి రోజే వారంతా ఉరెళ్లారని తెలియడంతో అనుమానం మరింత బలపడింది. ఈ నెల 21న నాగర్‌ కర్నూల్‌ జిల్లాలోని తుర్కపల్లి గ్రామానికి వెళ్లి నిరంజన్‌ను విచారించగా తానే సంచిని తీసుకున్నట్లు అంగీకరించాడు. బాలపీర్‌, రంజిత్‌, వెంకటయ్యలతో కలిసి వాటాలను పంచుకున్నట్లు వివరించాడు. కొంత సొత్తును బంధువుల ఇళ్లల్లో దాచామని, 18 గ్రాముల ఆభరణాలను కుమార్‌ రాజన్‌ అనే వ్యాపారికి విక్రయించామని తెలిపాడు. ఈమేరకు నిరంజన్‌ సహా నలుగురినీ అరెస్ట్‌ చేశారు. పారిపోయిన కుమార్‌ రాజన్‌ కోసం గాలిస్తున్నారు.

అత్యాచారం కేసు పెట్టించిన కేసులో కీలక నిందితుడు డాలర్‌ బాయ్‌ అరెస్ట్

Tags; The pounding gold was struck

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *