ఇక రేషన్ దుకాణాలు కళకళ

Date:15/03/2018
ఏలూరు ముచ్చట్లు:
రేషన్‌ దుకాణాలు ఇక కళకళలాడనున్నాయి. పొగరహిత జిల్లాగా గుర్తింపు పొందడం, ఇప్పటికే ఇస్తున్న కిరోసిన్‌ పంపిణీ నిలిపివేయడంతో జిల్లాలో ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే చౌకధరల దుకాణాల ద్వారా అందతున్నాయి. దీనికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోంది. దశలవారీగా అన్ని దుకాణాల్లో వివిధ రకాల నిత్యావసరాలు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీనిలోభాగంగా జిల్లాలో ఇప్పటికే కొన్ని దుకాణాల్లో గోధుమపిండి, కందిపప్పు, ఉప్పు వంటివి అందజేస్తున్నారు. దశలవారీగా అన్ని దుకాణాలను మినీ షాపింగ్‌ మాల్స్‌గా నిర్వహించడం ద్వారా అటు దుకాణ నిర్వాహకులకు ఆదాయం పెంచడంతోపాటు, అదే సమయంలో కార్డుదారులు అన్ని వస్తువులను ఒకేచోట కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో 2 వేల రేషన్‌ దుకాణాలుండగా వీటిద్వారా ఏడాది కిందట వరకూ బియ్యం, కిరోసిన్‌, పామాయిల్‌, పంచదార కొన్ని సందర్భాల్లో కందిపప్పు పంపిణీ చేసేవారు. కొద్దినెలలుగా పంచదారను మాత్రం అరకిలో చొప్పున ఇస్తున్నారు. జిల్లా పొగరహితం కావడంతో కిరోసిన్‌ అవసరంలేదని లెక్కతేల్చడంతో కిరోసిన్‌ పంపిణీ జరగడంలేదు. పామాయిల్‌ను తీసివేయడంతో ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో పామాయిల్‌ పంపిణీ లేదు. ఇక ఉన్నదల్లా బియ్యం, పంచదార పంపిణీ మాత్రమే.బియ్యానికి నగదు బదిలీ జరిగితే… ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 17 లక్షల టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. కార్డులో ఉన్న    ప్రతీవ్యక్తికి 5 కిలోలు చొప్పున అందిస్తున్నారు. ఇలా ఇస్తున్న బియ్యాన్ని అధికశాతం మంది బయట   అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కిలోకు రూ. 10 నుంచి రూ.15 వరకూ బయట విక్రయాలు జరుగుతున్నాయి. నగదు కోసం ఈవిధంగా చేస్తున్నారు కాబట్టి ఆ నగదును ప్రభుత్వమే ఇస్తే ఏలా ఉంటుందని కేంద్రప్రభుత్వం ఆలోచన చేసింది. కిలోకు రూ. 20 చొప్పున ఇచ్చే ప్రతిపాదన ఒకటి ప్రస్తుతం ఉంది. ఇది అమలు జరిగితే బియ్యం ఇచ్చే అవకాశం కూడా పోతుంది. తమకు బియ్యం కచ్చితంగా అవసరమని అడిగేవారు కార్డుదారుల్లో 20 శాతం మించి ఉండరని అంచనా. ప్రస్తుతం అన్నీ తీసివేసి బియ్యానికి కూడా నగదు బదిలీ జరిగితే తమ పరిస్థితి ఏమిటని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.ప్రస్తుతానికి కొన్ని పప్పుదినుసులు… ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో పప్పు దినసులు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలోభాగంగా తొలిదశలో  కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఉప్పులను విక్రయించనున్నారు. వీటి ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయించనుంది. తర్వాత దశలో మిగిలిన సరుకులను కూడా ఇవ్వనున్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీలేకుండా సరుకులు కొనుగోలు చేసి విక్రయించాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఉన్న దుకాణాల్లో వీటిని అమ్ముతూనే ఆయా దుకాణాలకు సాంకేతిక హంగులు అద్దితే ఇవి మినీ సూపర్‌బజార్లుగా కనిపించి కార్డుదారులను, సాధారణ ప్రజలను ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. దీనివల్ల ఇక్కడ కొనుగోళ్లు పెరుగుతాయని, దుకాణదారుడు కూడా ఇబ్బందిలేకుండా అమ్మకాలు సాగించి ఆర్థికభారం లేకుండా ముందుకు వెళతాడని అనుకుంటున్నారు. అయితే దీనిని ఆచరణ సాధ్యం చేయడంలో ప్రకటన స్థాయినుంచి ముందుకు వెళ్లడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని వేగవంతం చేసి తద్వారా ప్రభుత్వ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొత్తంగా రేషన్‌ దుకాణాలు అతితక్కువ కాలంలోనే మినీ సూపర్‌బజార్లుగా మార్పు చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags: The ration shops are art

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *