డిసెంబర్ నాటికి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తేవాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:

టీటీడీ నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని డిసెంబర్ నాటికి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులకు సూచించారు.
టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం ఇతర అధికారులతో కలిసి ఆదివారం ఆయన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు.
అంతకుముందు టీటీడీ గోశాలలోని ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, అగర బత్తీల తయారీ రెండవ యూనిట్ ను పరిశీలించారు.ఈ సందర్భంగా డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణం వల్ల గోశాలలోని గోమాతలు, ఇతర పశువులకు బలవర్ధకమైన సమగ్ర దాణా అందించే అవకాశం కలిగిందన్నారు. తద్వారా పాల ఉత్పత్తి పెరగడంతో పాటు, పాలలో ప్రోటీన్ శాతం కూడా గణనీయంగా వృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పువ్వులతో తయారు చేస్తున్న అగర బత్తీలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఇందుకు అనుగుణంగా టీటీడీ రెండవ యూనిట్ ను ప్రారంభించడాన్ని ఆయన అభినందించారు.
శ్రీ పద్మావతి హృదయాలయం లో 1300 కు పైగా చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు నిర్వహించడం అభినందనీయమన్నారు.
ఈ ఆస్పత్రిలో ఇటీవల రెండు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ నాథ్ రెడ్డి, ఆయన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం డాక్టర్ జవహర్ రెడ్డి పద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, స్విమ్స్ క్యాన్సర్ ఆస్పత్రి, తిరుమలలో అంజనాద్రి అభివృద్ధిపై సమీక్ష జరిపారు. అలాగే తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ బృందావనం పనులు, లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ప్రగతి, ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఈహెచ్ ఎస్ ట్రస్ట్, బర్డ్ ఆస్పత్రిలో కాక్లియర్ ఇంప్లాంట్, గ్రహణ మొర్రి సర్జరీలు నిర్వహిస్తున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ విద్యా సంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పైచర్చించారు. తిరుపతిలోని అన్ని కాలేజీల హాస్టళ్లకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసే అంశంపై సమీక్షించారు.
ఈ కార్యక్రమాల్లో రైతు సాధికార సంస్థ సిఈవో విజయ కుమార్, జిల్లా కలెక్టర్
వెంకటరమణారెడ్డి, జాయింట్ కలెక్టర్ బాలాజి, టీటీడీ చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ, శ్రీ పద్మావతి హృదయాలయం డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, పశు వైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ రవి, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, గో సంరక్షణ ట్రస్ట్ సభ్యుడు రామ సునీల్ రెడ్డి పాల్గొన్నారు.
Tags:The services of a super specialty hospital for children should be made available by December
