Babu is corrupt

బాబుకు చుట్టుకుంటున్న షెల్  ఉచ్చు

Date:15/02/2020

గుంటూరు ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ అధికారపక్షానికి మరో అస్త్రం దొరికింది తెలుగుదేశం పార్టీని, అధినేత చంద్రబాబు నాయుడిని గురి పెట్టి విమర్శలు చేసేందుకు బలమైన రాజకీయ ఆయుధం అయాచితంగా లభించింది. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిపై చేసిన ఆదాయ పన్ను శాఖ దాడులు అనేక విషయాలను బట్టబయలు చేశాయి. మౌలిక వసతుల కంపెనీల రూపంలో రాజకీయ పార్టీలకు నిధులు దారి మళ్లుతున్న విధానంపై కొన్ని ఆధారాలు లభించాయి.

 

మూడు కంపెనీలు అక్రమ లావాదేవీలు జరిపాయన్న విషయాన్ని ఆదాయపన్ను శాఖ వెలికి తీసింది. అయితే ఈ వ్యవహారాల్లో కొన్ని చంద్రబాబు నాయుడి వ్యక్తిగత కార్యదర్శి తో ముడిపడి ఉండటమే కీలకంగా మారింది. అంతిమంగా దీని ఫలితం ఎటు దారి తీస్తుందన్న అంశాన్ని పక్కనపెడితే ప్రత్యర్థి పార్టీలుగా వైసీపీ, టీడీపీ పరస్పరం విమర్శల బాణాలు గుప్పించుకునేందుకు, ఆరోపణలు చేసుకునేందుకు ఇదో కొత్త ముడిసరుకు.ధనస్వామ్యంలో రాజకీయపార్టీలతో పాటు ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులు బాధితులుగా మిగిలిపోతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రధాన పార్టీ తరఫున తలపడే వ్యక్తి కనీసం పది కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది.

 

 

 

 

ఎంపీ అభ్యర్థి ఖర్చు అయితే 50 కోట్ల రూపాయల పైచిలుకే. అంత మొత్తం వ్యక్తిగతంగా అభ్యర్థులు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి పార్టీలు సగం వరకూ సర్దుబాటు చేస్తున్నాయి. ఈ సర్దుబాటు క్రమంలో భాగంగానే పార్టీలు అక్రమ మార్గాలకు ద్వారాలు తెరుస్తున్నాయి. అధికారిక విరాళాల రూపంలో కాకుండా బ్లాక్ మనీని తరలించేందుకు మౌలిక వసతుల కంపెనీలను సులభమార్గంగా ఆయాపార్టీలు ఎంచుకుంటున్నాయి. వేల కోట్ల రూపాయల్లో టర్నోవర్ చేసే ఆయా కంపెనీలు పార్టీల అవసరాలు తీరుస్తున్నాయి. నల్లధనాన్ని చాలా చాకచక్యంగా పార్టీలు సూచించిన వ్యక్తులకు చేరవేస్తున్నాయి. షెల్ కంపెనీలు ఇతర రూపాల్లో చిన్నాచితక సబ్ కాంట్రాక్టుల పేరిట నగదును మళ్లిస్తున్నాయి. నిధులు నేరుగా పార్టీల తరఫున పోటీ చేస్తున్న వ్యక్తులకు చేరుతున్నాయి.

 

 

 

 

నోట్ల రద్దు తర్వాత అనధికారికంగా నగదును పెద్ద మొత్తాల్లో రవాణా చేయడం కష్టసాధ్యమవుతోంది. రెండు కోట్ల రూపాయల వరకూ పెద్దగా ఆడిట్ ఉండదు కాబట్టి నల్లధనాన్ని తెలుపు చేసేందుకు గొలుసు కంపెనీలు పెట్టి వాడుకుంటున్నారు.తాజాగా దొరికిన మూడు ఇన్ ఫ్రా కంపెనీల వ్యవహారంలో అన్ని వేళ్లూ టీడీపీనే చూపిస్తున్నాయి. పెద్ద కంపెనీలు రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవహారాలు నడపటం పెద్ద విషయమేమీ కాదు. జాతీయ రహదారులు, నీటిపారుదల ప్రాజెక్టులు సాధించిన అనేక కంపెనీలు వేల కోట్లలోనే పనులు చేస్తున్నాయి. అయినప్పటికీ తాజాగా మూడు కంపెనీలపైనే వివాదం రగలింది. ఆయా కంపెనీల వ్యవహారాలు రాజకీయంతో ముడిపడ్డాయి. పైపెచ్చు గొలుసు కంపెనీలకు సంబంధించి ఆదాయపన్ను రిటర్నులు సహా మొత్తం వ్యవహారాలను ప్రధాన కంపెనీయే నిర్వహించింది.

 

 

 

ఆయా ఆధారాలే ఇప్పుడు సమస్యాత్మకంగా పరిణమించాయి. ఇందులో పెద్ద చేపలు పడతాయా? తెలుగుదేశం పార్టీ పూర్తిగా దొరికిపోతుందా? అంటే చెప్పలేని స్థితి. ఎందుకంటే పార్టీకి నేరుగా చెల్లించినట్లు కనిపెట్టడం కష్టం. అంతేకాకుండా చిన్న కంపెనీల రూపంలో పెద్ద కంపెనీ నుంచి నిధులు ప్రవహించాయి. ఆయా గొలుసు కంపెనీలు ఒక్కొక్కటి రెండు కోట్ల రూపాయల మేరకు నగదు రూపంలో వ్యవహారాలు నడిపినట్లు ప్రాథమిక అంచనా. ఇందుకుగాను వారు చూపించిన ఇన్ వాయిస్ లు, బిల్లులు అన్నీ బోగస్ గా తేలుతున్నాయి. ఆదాయపన్ను శాఖ చాలా కీలకమైన వివరాలనే బయటపెట్టింది. దీంతో తెలుగుదేశం పార్టీ ఖండించలేకపోతోంది. ఇంకా ఎంత లోతుగా ఆ శాఖ మదిస్తుందోననే ఆందోళన కూడా వెన్నాడుతోంది.

 

 

 

 

ఈ పరిస్థితినే వైసీపీ ఆసరాగా చేసుకుంటూ ఈ రెండువేల కోట్ల రూపాయల కుంభకోణం చంద్రబాబు నాయుడి కోసమే జరిగిందంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. రాజధాని భూముల కొనుగోళ్లలో ఇన్ సైడర్ ట్రేడింగులో వ్యక్తిగతంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఆధారాలేమీ ఇంతవరకూ రాష్ట్రప్రభుత్వానికి దొరకలేదు. తాజా ఆదాయపన్ను దాడులు మాత్రం ఆరోపణలు గుప్పించేందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి.సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టు టాక్సెస్ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలను స్థూలంగా అమలు చేస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా కేంద్రంలో పెద్దల అభీష్టాలకు అనుగుణంగానే పనిచేస్తుందని చెప్పలేం. కనీస ఆధారాలు, ఫిర్యాదులు లేకుండా చర్యలకు దిగదు. సర్వేరూపంలో, సోదాల రూపంలో సెర్చ్ లు నిర్వహిస్తూ ఉంటుంది.

 

 

 

దీనికి ఆయా కంపెనీలు, వ్యక్తుల ట్రాక్ రికార్డును పరిగణనలోకి తీసుకుంటుంది. చాలా కేసుల్లో వివరాలను బయటపెట్టకుండా గోప్యత పాటిస్తుంది. పన్ను చెల్లింపుదారుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించకూడదనే నియమమే ఇందుకు కారణం. పన్ను ఎగవేతదారులు, చెల్లింపుల్లో లోపాలకు పాల్పడిన వారికి చాలా వరకూ జరిమానాల రూపంలో అధిక పన్నును రాబడుతుంటారు. తాజాగా జరిగిన రెండువేల కోట్ల రూపాయల కుంభకోణం విషయంలోనూ అదే జరుగుతుందనేది సాంకేతికంగా ఆదాయపన్ను శాఖ పనితీరు తెలిసినవారు చెబుతున్న విషయం.

 

 

 

 

అయితే రాజకీయ పరమైన ఒత్తిడులు దాగి ఉన్న నేపథ్యంలోనే సమాచారాన్ని అధికారికంగా వెల్లడించారు. తీగ లాగారు. సమాచారం సేకరించారు. ఈవిషయంలో మరింత ముందుకు దర్యాప్తు సాగుతుందా? లేకపోతే ఇంతటితో సరిపుచ్చుతారా? అన్న విషయంలో సందేహాలు కొనసాగుతున్నాయి. రాజకీయంగా మాత్రం కొన్ని నెలల పాటు ఈవివాదం చర్చల్లో నలుగుతూనే ఉంటుంది.

కమలం లో కరువైన జోష్

Tags: The shell trap that surrounds Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *