శ్రీవారి ఆలయంలో ఘనంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

సహస్రశీర్ష పురుషునికి వేడుకగా స్నపనతిరుమంజనం

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే జ్యేష్టాభిషేకం ఆదివారంనాడు ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో ఉన్న కల్యాణమండపంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం ఋత్వికులు యాగశాలలో శాంతిహోమం నిర్వహించారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. పురుష సూక్తంలోని మంత్రాల్లో స్వామివారిని ”సహస్రశీర్ష పురుషుడు” అని స్తుతిస్తారు.

 

 

కాగా, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరిస్తారు. సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి ఉత్సవమూర్తులు వజ్రకవచంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇదిలా ఉండగా సోమవారం ముత్యాలకవచంతో, మంగళవారం స్వర్ణకవచంతో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు.ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో
ఏవి.ధర్మా రెడ్డి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ బాబు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

Tags:The solemn anointing begins at the Srivari Temple

Post Midle
Natyam ad