భారతీయ సమాజానికి మూలం వేదం – ఆచార్య క్రిష్ణమూర్తి
తిరుమల ముచ్చట్లు:
వేద విజ్ఞానం వేలాది సంవత్సరాలుగా భారతీయ సమాజానికి దశ- దిశ నిర్ధేశం చేస్తుందని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య క్రిష్ణమూర్తి తెలిపారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల నానీరాజనం వేదికపై జరుగుతున్న శ్రీనివాస వేద విద్వత్ సదస్సులో శనివారం ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందని, వేదం లేని భారతీయ సమాజాన్ని ఊహించలేమన్నారు. వేద ప్రామాణికంగా నడుచుకుంటే నైతిక విలువలతో కూడిన జీవనం అలవడుతుందని చెప్పారు.వేదం అజ్ఞానంలో ఉండే మానవుడిని విజ్ఞానం వైపు నడిపించడంతో పాటు సంస్కారం అందించి, సర్వోన్నతుడైన మహోన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుందన్నారు. సమాజ ధర్మాలు, గృహస్థ ధర్మాలు, విజ్ఞానం, ఆధునిక సమాజానికి వేదాలు ఏ విధంగా ఉపయోగ పడుతుందో వివరించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:The source of Indian society is Veda – Acharya Krishnamurthy
