బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి

Date:16/03/2018
విజయవాడ ముచ్చట్లు:
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించిన తెలుగుదేశం పార్టీ బీజేపీపై తన విమర్శలకు మరింత పదును పెట్టింది. కేంద్రం వైఖరిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శాసనమండలిలో శుక్రవారం చంద్రబాబు ప్రసంగిస్తూ… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత నాలుగు బడ్జెట్లలోనూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. బీజేపీతో తాము కలిసి ఉండబోమని కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని బాబు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్న ఆయన, ఏపీ కష్టాలను కేంద్రం ఏనాడూ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన హామీలను నెరవేరుస్తామని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన బీజేపీ, అధికారంలోకి రాగానే మరిచిపోయిందని అన్నారు.సెంటిమెంట్‌తో నిధులు రావని జైట్లీ చేసిన వ్యాఖ్యలను మరోసారి ఉటంకించిన సీఎం, తెలంగాణను సెంటిమెంట్‌ ద్వారానే ఇచ్చిన సంగతి ఆయనకు తెలీదా? అని ప్రశ్నించారు. విభజన చట్టంతోపాటు రాజ్యసభలో ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని కోరుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోమని అడిగితే రక్షణ శాఖ బడ్జెట్‌ ప్రస్తావన తేవడం ఏంటని? మండిపడ్డారు. దేశ రక్షణను ఫణంగా పెట్టి మమ్మల్ని ఆదుకోమన్నామా?మాకు దేశభక్తి లేదా? అని చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీలు ఆందోళన చేస్తుంటే.. కనీసం ప్రధానమంత్రి స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలకు కట్టుబడి ఉన్నాం కాబట్టే ఎన్డీయే నుంచి వైదొలగిన తర్వాతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని, కేంద్రానికి మద్దతు ఇచ్చినా మంత్రి పదవులు అడగలేదని, వాళ్లు ఇస్తామంటేనే తీసుకున్నామని తెలిపారు.14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సూచించిందని గతంలో అన్నారు.. దీనికి విరుద్దంగా గురువారం రాజ్యసభలో కేంద్రమంత్రి మాట్లాడుతూ అలాంటిదేమీ లేదని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పరంగా అట్టడుగున ఉన్న ఏపీని ఆదుకోవాల్సిన అవసరం కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు పరిశ్రమలు ఇచ్చారు… అవి మాకూ కావాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఏపీ పట్ల ఎంతో సానుభూతి చూపించి మోదీ, దిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామన్నారు… ఆ హామీలన్నీ ఏమైపోయాయి. అమరావతి నగరం దేశానికే తలమానికం అవుతుంది… అలాంటి నగరాన్ని నిర్మించేందుకు కేంద్రం ఎందుకు సహకరించడం లేదని నిలదీశారు.రైల్వేజోన్ విషయంలోనూ కేంద్రం కుప్పిగంతలు వేస్తోందని, ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది.. ఇతర రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఇచ్చినప్పుడు మమ్మల్ని అడిగారా? అని మండిపడ్డారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం పూర్తయితే కరువు ఉండదని, దీనికి కూడా అడ్డంకులు సృష్టించి రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంలో ఏదో అవినీతి జరుగుతోందని దుష్ప్రచారం చేస్తున్నారు.. దీనిపై పవన్‌ కల్యాణ్‌ అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్న నిర్ణయాలపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
Tags: The spirit of the BJP should be criticized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *