నాన్ మేజర్ పోర్టు దిశగా అడుగులు…

Date:14/09/2018
నెల్లూరు ముచ్చట్లు:
రామాయపట్నం వద్ద భారీ ఓడరేవుకు బదులుగా నాన్‌మేజర్ అంటే చిన్న లేదా మధ్యతరహా ఓడరేవు నిర్మించనున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం జరగనుంది. తూర్పుతీరం వెంబడి రాష్ట్ర పరిధిలో రెండవ భారీ ఓడరేవు నిర్మించేందుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం చిన్న ఓడరేవుకు ఎందుకు మొగ్గు చూపుతుందో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం దేశం మొత్తంమీద పశ్చిమతీరం వెంబడి ఆరు, తూర్పు తీరంలో మరో ఆరు, అండమాన్ నికోబర్ వద్ద ఒకటి చొప్పున భారీ ఓడరేవులు ఉన్నాయి. 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉన్న రాష్ట్రంలో కేవలం ఒక్కటే మేజర్ పోర్టు విశాఖపట్నం వద్ద ఉంది. నాన్ మేజర్ పోర్టులు దేశంలో 200 ఉండగా రాష్ట్రంలో 14 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఉన్న కృష్ణపట్నం పోర్టు కూడా నాన్ మేజర్ పోర్టు కిందకే వస్తుంది.
జల రవాణా పెంచే ఉద్దేశంతో 2011వ సంవత్సరంలో కేంద్రం మన రాష్ట్రంలో భారీ ఓడరేవు నిర్మాణానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించేందుకు నియమించిన కమిటీ నక్కపల్లి, రామాయపట్నం, దుగ్గరాజపట్నం తీరప్రాంతాలు అనువైనవిగా గుర్తించి నివేదిక అందజేసింది.
2012లో అప్పటి రాష్ట్రప్రభుత్వం రామాయపట్నం వద్ద భారీ ఓడరేవు నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. కానీ అనూహ్యంగా 2014లో రాష్ట్ర విభజన సమయంలో  దుగ్గరాజపట్నం వద్ద భారీ ఓడరేవును కేంద్రమే నిర్మించేలా అప్పటి కేంద్రప్రభుత్వం పునర్విభజన చట్టంలో చేర్చింది. అయితే దుగ్గరాజపట్నానికి సమీపంలో ఉన్న అంతరిక్ష ప్రయోగ కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో 2011వ సంవత్సరంలో కేంద్ర కమిటీ సూచించిన మిగిలిన రెండు ప్రాంతాలైన నక్కపల్లి, రామాయపట్నంలలో ఒకదాన్ని సూచించాలని ప్రస్తుత కేంద్రప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది.
ఈ నేపథ్యంలో 2015వ సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి ఉన్న సానుకూలతలపై నివేదిక అందజేయాలని రైట్స్ అనే సంస్థను పురమాయించడం, ఆ సంస్థ 2017 సెప్టెంబర్‌లో నివేదిక సమర్పించడం జరిగాయి.
దీంతో రాష్ట్రప్రభుత్వం రామాయపట్నం వద్ద భారీ ఓడరేవు నిర్మాణాన్ని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడమే తరువాయి అనుకుంటున్న నేపథ్యంలో అనూహ్యంగా మంగళవారం కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గిస్తూ రాష్ట్రప్రభుత్వం జీవో నెంబర్ 28 ద్వారా రామాయపట్నం వద్ద నాన్ మేజర్ పోర్టును నిర్మిస్తున్నట్లు ప్రకటించింది.
అయితే 2015వ సంవత్సరంలో రాష్ట్రప్రభుత్వం రైట్స్ కమిటీకి చేసిన సూచనలలో గాని, 2017లో ఈ కమిటీ ఇచ్చిన నివేదికలో గాని రామాయపట్నం వద్ద నాన్‌మేజర్ పోర్టు నిర్మించనున్నట్లు ఉన్న విషయం వెలుగులోకి రాలేదు. అందరూ రామాయపట్నం వద్ద భారీ ఓడరేవు నిర్మాణం జరుగుతుందనే భావించారు.
అందరి ఆశలపై నీళ్లుచల్లుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నాన్‌మేజర్ పోర్టు వైపు మొగ్గు చూపడం పట్ల ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని యువత అసహనానికి గురవుతోంది. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా దుగ్గరాజపట్నం వద్ద ఓడరేవు నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ముందుకు రాకపోయినప్పటికి రామాయపట్నం వద్ద నాన్‌మేజర్ పోర్టు నిర్మాణాన్ని రాష్టస్థ్రాయిలో నిర్మించుకుంటున్నామనే రాజకీయ ఆరోపణలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పలువురు భావిస్తున్నారు.
ఏదిఏమైనా రామాయపట్నం వద్ద భారీ ఓడరేవు స్థానంలో చిన్న లేదా మధ్యతరహా ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు మరోసారి ఉద్యమాన్ని చేపట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Tags: The steps toward the non-major port …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *