ప్రమాదాలకు నిలయంగా  కల్లు దుకాణం

నిజామాబాద్ ముచ్చట్లు:
 
నిబంధనలకు అనుగుణంగా బహిరంగ ప్రదేశాలకు, చెరువులకు, కుంటలకు, పాఠశాలలకు దూరంగా  ఉండాల్సిన కల్లు దుకాణాలు నిబంధనలు గాలికి వదిలేసి యదేచ్ఛగా వీటి పరిసరాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలు, మహిళలు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఇవేమీ పట్టించుకోకుండా ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌కు 3 కిలోమీటర్ల దూరంలో గల శాబ్దిపూర్ ఎడమ, కుడి తండాల పరిధిలో గల ప్రాథమిక పాఠశాల పక్కనే కల్లు దుకాణం ఉన్నది. అంతేకాకుండా శాబ్దిపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఈ కల్లు దుకాణం కలదు. అలాగే కల్లు దుకాణానికి ఎదురుగానే పెద్ద కుంట కూడా ఉన్నది. పాఠశాలకు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు పక్కనే గల కల్లు దుకాణంలో కల్లు సేవించే వారి హావభావాలు, మాటలు, తిట్లు విని వారిని అనుసరించి చెడిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ కల్లు తాగిన వారు పడవేసే ప్లాస్టిక్ కవర్లు గాలికి పాఠశాలలోకి కొట్టుకు వస్తున్నాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై పలుమార్లు దుకాణం యజమానులకు వివరించినా పట్టించుకునే వారే కరువయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కామారెడ్డి-గూడెం గ్రామానికి వెళ్లే రోడ్డుకు అనుకొని శాబ్దిపూర్ శివారులో గల కల్లు దుకాణంలో కల్లు తాగిన వారు మత్తులో రోడ్డుపై నుంచి వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఈ కల్లు దుకాణం వద్ద చిన్నపాటి ప్రమాదాలు సైతం జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఏదైనా భారీ రోడ్డు ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే బాధ్యులు ఎవరని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో కల్లు దుకాణం వాహనదారుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్లు దుకాణానికి ఎదురుగానే పెద్ద కుంట ఉండడంతో కల్లు ప్రియులు ప్రమాదవశాత్తు అందులో పడి మరణిస్తే బాధ్యులెవరని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 
Tags; The stone shop is home to accidents

Leave A Reply

Your email address will not be published.