Natyam ad

బీటి పత్తి విత్తనాల కథ కంచికేనా

అనంతపురం ముచ్చట్లు:


వినాశకర తెగుళ్లు, పురుగుల నుంచి పత్తి పంటను రక్షించే ఉద్దేశంతో రెండు దశాబ్దాల క్రితం దేశంలోకి ప్రవేశించిన బిటి విత్తనాల పని ఇక అయిపోయిందని చెబుతున్నారు. బాసిల్లస్‌ తురింజన్సిస్‌ (బిటి)తో జన్యుపరంగా మార్పిడి చేసే టెక్నాలజీని అమెరికాకు చెందిన మోన్‌శాంటో సంస్థ ప్రపంచం మీదికి వదిలింది. భారీ మొత్తంలో రాయల్టీలను, ట్రేట్‌ వాల్యూలను ముక్కుపిండి వసూలు చేసింది. కాగా ఆ విత్తనాలు తెగుళ్లు, పురుగు నుంచి పంటను రక్షించడం మాట అటుంచి, కొత్త కొత్త తెగుళ్లకు, పురుగుకు, వైరస్‌కు కారణమవుతోంది. పంటకు అంతుబట్టని తెగుళ్లు వ్యాపించడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీనికితోడు కల్తీ, నకిలీ, నాసిరకం సీడ్‌ మూలంగా విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తినా పూత, పిందె లేక, పంట ఎదగక నష్టాలు చవి చూస్తున్నారు.

 

 

 

బిటిలో బిటి-1, బిటి-2.. రెండు రకాల విత్తనాలకు అనుమతులున్నాయి. ఇప్పుడు బిటి-2 విత్తనాలే నూటికి నూరు శాతం చెలామణిలో ఉన్నాయి. బిటి టెక్నాలజీ వచ్చిన మొదట్లో పత్తికి ఆశించే అన్ని రకాల తెగుళ్లనూ ఎదుర్కొంటాయని ప్రచారం చేశారు. అనంతరం ఒక్క శనగపచ్చ పురుగును మాత్రమే ఎదుర్కొంటుందన్నారు. ఎకరానికి 450 గ్రాముల బిటి, 120 గ్రాముల నాన్‌-బిటి విత్తనాలను వేయాలన్నారు. రెండు రకాల విత్తనాలనూ రైతులకు ఇవ్వాలి. బిటి పంటను పురుగు ఆశించకుండా రిఫ్యూజ్‌ క్రాప్‌ కింద నాన్‌-బిటి వేయాలని సిఫారసు చేశారు. ముందుగా నాన్‌-బిటికి పురుగులు వ్యాపిస్తాయి. అది బిటి విత్తనాల్లో కొంత కాలం వ్యాధి నిరోధక శక్తి (రెసిస్టెన్స్‌)కి తోడ్పడుతుంది. కానీ విత్తనాలు అమ్ముకోవడమే తప్ప రిఫ్యూజ్‌ క్రాప్‌ వేయమని రైతులకు కంపెనీలు చెప్పలేదు. వ్యవసాయశాఖ సైతం రైతులకు తగిన సూచనలు ఇవ్వలేదు. అధిక దిగుబడి పేరిట ఎకరాకు రెండు మూడు బిటి సీడ్‌ ప్యాకెట్లను రైతులు వేశారు. దాంతో కొన్నేళ్లకే తెగుళ్లు పత్తిని ఆశిస్తున్నాయి. గులాబీ కాయతొలుచు పురుగు, పొగాకు లద్దె పురుగు, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, తామర వంటివి వ్యాపించి పంటను సర్వనాశనం చేస్తున్నాయి. రిఫ్యూజ్‌ క్రాప్‌ వేయకపోవడం వలన దుష్పరిణామాలు తలెత్తుతున్నాయంటూ కేంద్రం 450 గ్రాముల బిటి సీడ్‌లోనే కనీసం 5 శాతానికి తగ్గకుండా, గరిష్టంగా 10 శాతానికి మిెంచకుండా నాన్‌-బిటి సీడ్‌ను కలిపి అమ్మాలంది. ఇది విత్తన కంపెనీల అక్రమాలకు అనూకూలంగా తయారైందని ఆరోపణలొస్తున్నాయి. నాన్‌-బిటి విత్తనాలను ఎక్కువ మోతాదులో కలిపి అమ్మారని, అందుకే మొక్కలు రాలేదని, విత్తనాలు ఫెయిల్‌ అయ్యాయని రైతుల నుంచి ఫిర్యాదులందుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ రైతుల్లో అనుమానాలు రేకెత్తాయి.

 

 

 

Post Midle

బిటి విత్తనాలు మొలకెత్తకపోవడానికి, పంట ఎదగపోవడానికి, తెగుళ్లు వ్యాపించడానికి వర్షాభావం, అధిక వర్షాలు, డ్రై-స్పెల్స్‌ కారణమని సీడ్‌ కంపెనీలు తప్పించుకుంటున్నాయి. ప్రభుత్వమూ వంత పాడుతోంది. గతేడాది ఖరీఫ్‌లో ‘కావేరి’ విత్తనాలు ఫెయిల్‌ కాగా ఇప్పటి వరకు ఆ సంస్థపై ఎలాంటి చర్యలూ లేవు. ఇప్పుడు ‘అకిర’ విత్తనాలు ఎక్కువగా ఫెయిల్‌ అయ్యాయని ఫిర్యాదులొస్తున్నాయి. ఇదిలా ఉండగా అనుమతుల్లేని బిటి-3 విత్తనాల అమ్మకాలూ సాగుతున్నాయి. పత్తి పండే ప్రాంతాల్లో కొన్ని చోట్ల 70 శాతం వరకు ఈ విత్తనాలే వేశారు. కలుపు మందు కొట్టినా మొక్కలు బతుకుతాయని, కూలీల ఖర్చు మిగులుతుందని, అధిక దిగుబడి వస్తుందని ప్రచారం చేసి రైతులను ఆకట్టుకుంటున్నారు. గుంటూరు లాం ఫాం కాటన్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్టు ఎం సుధారాణిని సంప్రదించగా, బిటి టెక్నాలజీ ఫెయిల్‌ అయినట్లు గుర్తించలేదన్నారు. గులాబీ, ఇత్యాది పురుగు విషయంలో మాత్రం వైఫల్యం ఉందని తెలిపారు. వంద రోజులు మాత్రమే మొక్కలో ‘బిటి’ సామర్ధ్యం ఉంటుందన్నారు. సీజన్‌ను సరిగ్గా పాటించట్లేదని చెప్పారు. పంట తీశాక పొలాలను కొన్ని నెలలు ఖాళీగా ఉంచడమో లేదంటే ఇతర పంటలు వేయడమో చేయాలన్నారు. ఈ పద్ధతి పాటించకపోవడం వల్లనే అనర్ధాలొస్తున్నాయని వివరించారు. బిటి విత్తనాల్లో నాన్‌-బిటి విత్తనాలు కలపాలన్న కేంద్ర ఆదేశాలు విధాన నిర్ణయమన్నారు.

 

Tags: The story of Bt cotton seeds is Kanchikena

Post Midle

Leave A Reply

Your email address will not be published.