మౌనం వెనుక  వ్యూహాం

మెదక్ ముచ్చట్లు:


కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి రాజకీయ మౌనంపై ఆసక్తి నెలకొన్నది. జూల్ 1 నుంచి అక్టోబరు 30 వరకు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు చేయనని చెప్పి మౌన జపం చేస్తున్నారు. ఈ మౌనం వెనుక వ్యూహం ఏమై ఉంటుందని రాజకీయంగా చర్చ జరుగుతున్నది. తన నియోజకవర్గమైన సంగారెడ్డికే పరిమితం అవుతున్నారు. పండుగలు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆయా ప్రదేశాల్లో మీడియా అడిగినప్పటికీ రాజకీయంగా మాత్రం స్పందించడం లేదు. నో కామెంట్ అంటూ మౌనంగా వెళ్లిపోతున్నారు. నాలుగు నెలల పాటు చేపట్టిన ఈ మౌనం వెనక వ్యూహమేమిటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.పార్టీ పరంగా హాట్ హాట్‌గా ప్రకటనలు చేస్తూ ఎప్పుడూ మీడియాలో ఉండే జగ్గారెడ్డి గత నెల రోజులుగా రాజకీయ వాఖ్యాలు చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికైన తరువాత నుంచి పార్టీలో జగ్గారెడ్డి వ్యాఖ్యలు దూమారం లేపిన విషయం తెలిసిందే. పార్టీకి దూరం కానున్నట్లు కూడా ప్రచారం జరగడం, కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తరువాత పార్టీని వీడే ప్రసక్తే లేదని ప్రకటించిన విషయం కూడా విదితమే.

 

 

 

ఇదిలా ఉండగా కొద్ది రోజులు రాజకీయ ప్రకటనలకు దూరంగా ఉంటానని జగ్గారెడ్డి కీలక ప్రకటన చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. జూలై 1 నుంచి అక్టోబర్ 30 వరకు పార్టీ పరంగా, ఇతర అంశాల విషయంలో కూడా ఎలాంటి రాజకీయ ప్రకటనలు, వ్యాఖ్యలు చేయబోనని ప్రకటించారు. అందులో భాగంగానే గత నెల రోజులుగా మౌనంగానే ఉంటున్నారు. తన సన్నిహితులతో మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారు.జగ్గారెడ్డి నాలుగు నెలల మౌనం వీడిన తరువాత నవంబరు 5న గాంధీ భవన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజున మీడియా ముందు మాట్లాడతానని చెబుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో ఘనంగా నిర్వహించే విజయదశమి ఉత్సవాల్లో రాజకీయ ప్రకటన చేస్తానని కూడా జగ్గారెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఆ ప్రకటన ఏమై ఉంటుంది..? గాంధీ భవన్ సమావేశంలో ఏం చెబుతారు..? అనే అంశాలపై రాజకీయ పార్టీలతో పాటు కాంగ్రెస్‌లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీ చేరుతున్నట్లు ప్రకటించగా కాంగ్రెస్‌లో నేతలంతా అయోమయం చెందుతున్నారు. జగ్గారెడ్డి మాత్రం ఏ విషయంతో తనకు సంబంధం లేదన్నట్లుగాఉంటున్నారు.

 

 

 

సంగారెడ్డి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తల కూడా జగ్గారెడ్డి మౌనంపై ఎవరికి తోచింది వారు మాట్లాడుకుంటున్నారు. ఏదో బలమైన వ్యూహంతోనే జగ్గారెడ్డి మౌనంగా ఉంటున్నారని ఆయన సన్నిహితుడు ఒకరు చెప్పుకొచ్చారు.రాజకీయంగా మౌనంగా ఉంటున్న జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గంలో పండుగలు, విందులు, వినోధాలకు ఉత్సాహంగా హాజరవుతున్నారు. పండుగలకు హాజరైన సందర్భంలో పార్టీ శ్రేణులతో కలిసి డప్పు చప్పుళ్లకు స్టెప్పులు వేస్తూ జోష్ నింపుతున్నారు. జగ్గారెడ్డి ఏ కార్యక్రమానికి హాజరైన యువత కేరింతలు కొడుతున్నారు. అంతే కాకుండా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాలు, దీక్షలకు మద్దతు ప్రకటిస్తున్నారు. గురువారం సదాశివపేటలో ఓ కంపెనీ ప్రతినిధులు కార్మికులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలుసుకుని ఫోన్లు చేసి కంపెనీ ప్రతినిధులపై విరుచుపడ్డారు. ఖబర్దార్ పేదొళ్లను ఇబ్బంది పెడితే ఊరుకోనని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఈ ఘటనతో జగ్గారెడ్డి లోకల్‌గా హల్‌చల్ సష్టించారు. సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్ ఇలా లోకల్‌గానే పర్యటిస్తున్నారు. ఎప్పుడూ హైదరాబాద్, గాంధీ భవన్‌లో ఉండే జగ్గారెడ్డి అటు వైపుకు కూడా వెళ్లడం లేదు. అయితే జగ్గారెడ్డి వ్యూహం ఏమై ఉంటుందా అనేది మాత్రం తన సన్నిహితులతో పాటు, రాజకీయంగా, జనంలో ఆసక్తికరమైన చర్చ జరగుతున్నది. ఈ చర్చకు తెరపడాలంటే జగ్గారెడ్డి మౌనం వీడాల్సి ఉన్నది.

 

Tags: The strategy behind the silence

Leave A Reply

Your email address will not be published.