Natyam ad

మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేపుతున్న చంద్రయాన్-3 విజయం

-Chandrayaan-3 : మాతృభాషలో చదివినంత మాత్రానికి వెనుకబడిపోరని నిరూపించిన ఇస్రో శాస్త్రవేత్తలు

 

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

Post Midle

అందాల చందమామను భారతీయులకు చేరువ చేసిన చంద్రయాన్-3 విజయం మధ్య తరగతి ప్రజలకు స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తోంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించినవారు అత్యంత సామాన్య కుటుంబాల నుంచి వచ్చినవారు కావడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో, మాతృభాషలో చదువుకున్నవారు కావడం సామాన్యులకు ప్రోత్సాహకరంగా కనిపిస్తోంది.సంప్రదాయబద్ధమైన వస్త్రధారణతో సాధారణంగా కనిపిస్తూనే, ప్రపంచం గర్వించే విజయాన్ని సాధించినవారు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.భారత దేశ అభివృద్ధి, సౌభాగ్యాల వెనుక ఉన్న అతి పెద్ద శక్తి మధ్య తరగతి ప్రజలేనని గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయం ద్వారా ఆ మాటలను నిజం చేసి చూపించారు. ఆడంబరాలు లేకుండా పురుషులు సాధారణ చొక్కా, ప్యాంటు ధరించగా, మహిళలు నూలు చీరలు ధరించారు. ప్రపంచమంతా వీక్షించే గొప్ప సన్నివేశం జరిగే సమయంలో తళతళలాడే డిజైనర్ దుస్తుల జోలికి వీరెవరూ పోలేదు.ఎక్స్ సామాజిక వేదిక యూజర్లు ఈ విషయాన్ని బాహాటంగా చెప్తున్నారు.

 

 

 

‘‘చీర తిరోగామి వస్త్రమని ఈసారి ఎవరైనా అంటే, వారి ముఖం మీద ఇస్రో శాస్త్రవేత్తల ఫొటోను కొట్టండి’’ అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. నేటి బాలికలు ఈ శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని మరో యూజర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తల్లో కొందరి గురించి తెలుసుకుందాం.ఇస్రో మాజీ చైర్‌పర్సన్ కైలాసవడివూ శివన్ ఓ రైతు బిడ్డ. ఆయన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తమిళ మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. ఆయన ఎన్నడూ ట్యూషన్లు, కోచింగ్ క్లాసులకు వెళ్లలేదు.ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తండ్రి హిందీ ఉపాధ్యాయుడని తెలుస్తోంది. ఇంగ్లిష్, మలయాళం భాషల్లో ప్రచురించిన సైన్స్ సంబంధిత పుస్తకాలను ఎస్ సోమనాథ్‌కు ఆయన తండ్రి ఇచ్చేవారు. సైన్స్ రంగంలో రాణించాలని ప్రోత్సహించేవారు. వీరు కేరళలోని అలపుజకు చెందినవారు.

 

 

 

పీ వీరముత్తువేల్ చంద్రయాన్-3లో ప్రాజెక్టు డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్‌లో చదివారు.చంద్రయాన్-3లో ఎల్‌వీఎం3-ఎం4 డైరెక్టర్ మోహన కుమార్ కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారే. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్‌గా పని చేశారు.విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డైరెక్టర్‌గా పని చేసిన ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్ వివిధ కీలక బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేశారు.యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ ఎం శంకరన్ కూడా సాధారణ కుటుంబం నుంచి వచ్చినవారే. ఆయన ప్రస్తుతం కమ్యూనికేషన్, నేవిగేషన్, రిమోట్ సెన్సింగ్, మెటియరాలజీ, ఇంటర్ ప్లానెటరీ ఎక్స్‌ప్లొరేషన్ రంగాల్లో దేశ అవసరాలను తీర్చడం కోసం విశేషంగా కృషి చేస్తున్నారు.

 

 

 

లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ చీఫ్ ఏ రాజరాజన్ అత్యంత ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.చంద్రయాన్-3 మిషన్ అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కే కల్పన గతంలో చంద్రయాన్-2, మంగళ్‌యాన్ మిషన్స్ కోసం కూడా కృషి చేశారు.చంద్రయాన్-3 కోసం సుమారు 50 మంది మహిళా ఇంజినీర్లు/శాస్త్రవేత్తలు కృషి చేశారు.మానవుడే మహనీయుడు అన్నట్లుగా ఈ శాస్త్రవేత్తలు సామాన్య కుటుంబాల నుంచి వచ్చి ప్రపంచ ప్రసిద్ధి పొందడంతో, మధ్య తరగతి ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. వీరి జీవితాల నుంచి స్ఫూర్తిని పొంది, తమ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నారు. మాతృభాషలో చదివినంత మాత్రానికి వెనుకబడిపోరని వీరి జీవితాలు చాటి చెప్తున్న విషయాన్ని గుర్తిస్తున్నారు.

 

Tags:The success of Chandrayaan-3 is raising hopes among the middle class people

Post Midle