మహిళల ప్రవేశంపై పునఃసమీక్షకు సుప్రీంకోర్టు నిరాకరణ

The Supreme Court refuses to review the entry of women

The Supreme Court refuses to review the entry of women

Date:09/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును తక్షణమే పునఃసమీక్షించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు విచారణ జరిపే ధర్మాసనం ఆ పిటిషన్‌ సమయం వచ్చినప్పుడే విచారణ జరుపుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆ తీర్పును అత్యవసరంగా తిరిగి సమీక్షించాల్సిన అవసరం లేదని తెలిపింది.. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలూ ప్రవేశించ వచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ తీర్పును కొందరు ఆహ్వానిస్తుండగా, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
తీర్పును సవాల్‌ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.సుప్రీం తీర్పును సవాలు చేస్తూ జాతీయ అయ్యప్పస్వామి భక్తుల సంఘం అధ్యక్షులు శైలజా విజయన్‌ దానిని తక్షణమే పునః సమీక్షించాలని దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పునః సమీక్ష తక్షణమే అవసరం లేదని గొగొయ్‌ తెలిపారు.
దసరా సెలవుల ముందు ఈ పిటిషన్‌ విచారణకు రాదని, దసరా సెలవుల అనంతరం అక్టోబరు 22న కోర్టు తిరిగి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రజల అభిప్రాయం, కోర్టు తీర్పు వేర్వేరుగా ఉన్నాయని, తీర్పును పునఃసమీక్షించాలని నాయర్‌ సర్వీస్‌ సొసైటీ కూడా సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేసింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశంపై నిషేధం ఎత్తేస్తూ తీర్పు ఇచ్చిన అనంతరం శబరిమల ఆలయాన్ని నెలవారీ పూజల కోసం తొలిసారిగా అక్టోబరు 16న తెరవనున్నారు. కోర్టు తీర్పును అంగీకరిస్తామని కేరళ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. అయితే ఓ భక్తుల బృందం మాత్రం మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తోంది.
Tags: The Supreme Court refuses to review the entry of women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *