గిరిజనుల హక్కల కన్నీటి వ్యధ

నల్గొండ ముచ్చట్లు:


యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రాంత గిరిజనుల భూ హక్కుల కన్నీటి వ్యథ. అటవీశాఖకు సంబంధించిన భూములను పంపిణీ చేసిన నాయకులు, పాలకులు మళ్లీ మళ్లీ ఓట్లేయించుకున్నారు. కానీ వారికిచ్చిన పట్టా కాగితాలు చిత్తు కాగితాలుగా చూస్తారని వారు ఊహించలేదు. నారాయణపురం తహశీల్దార్, చౌటుప్పల్ ఆర్డీఓ, యాదాద్రి జిల్లా కలెక్టర్ చుట్టూ తిరిగి తిరిగి వేసారారు. చివరకు కొందరు విద్యావంతుల ద్వారా వారి సమస్యను పలుమార్లు మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌లకు ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా మొర పెట్టుకున్నారు. పలుమార్లు ట్విట్టర్ ద్వారా తమ సమస్యను పరిష్కరించాలని కోరినా ఎవరూ స్పందించడం లేదంటున్నారు.అది పక్కాగా అటవీ భూమి. రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ పరిధిలో సర్వే నం.192, 273 ల్లో ఏడెనిమిది వేల ఎకరాల భూమి ఉంది. అదంతా అడవిగానే పేర్కొన్నారు. ఐతే కొంత వక్ఫ్ భూమిగానూ నమోదు చేశారు. అదెట్లా సాధ్యమైందో రెవెన్యూ, వక్ఫ్ బోర్డు అధికారులకే తెలియాలి. ఐతే ఈ రెండు సర్వే నంబర్లలో సుమారు 6 వేల ఎకరాలు గిరిజనులకు పంచి పెట్టారు. 2 వేల మంది భూమి లేని గిరిజనులకు ఇచ్చారు. పట్టాలు పంపిణీ చేశారు. రెవెన్యూ రికార్డుల్లోకి నమోదు చేశారు. పాత పట్టాదారు పుస్తకాలు కూడా జారీ చేశారు. కానీ భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత వారికిచ్చిన పట్టాలు చెల్లవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అందుకే కొత్త పాసు పుస్తకాలు జారీ చేయడం లేదు. రైతుబంధు, రైతుబీమా పథకాలకు దూరం చేశారు. మూడేండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించకుండా అడవీ భూములను పంపిణీ చేశారు.

 

 

 

ఓట్లేయించుకొని బయట పడ్డారు. కానీ ఇప్పుడు వారిచ్చిన పట్టాలే చెల్లవని అధికారులు చెబుతుంటే ఎవరూ ప్రశ్నించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పట్టాలు జారీ చేసిన ప్రభుత్వాలదే తప్పు. అది అటవీ శాఖ భూమి అని అప్పటి అధికారులకు, పాలకులకు తెలియదా? అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.ధరణి పోర్టల్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకు మధ్య వ్యత్యాసం కనిపిస్తోంది. సర్వే నం.192, 273ల్లోని కొంత భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేదిత భూముల జాబితాలో పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌లో కొన్ని మాత్రమే పీఓబీ జాబితాలో ఉన్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్‌లో మాత్రం సర్వే నెంబర్‌ 192‌లో సబ్ డివిజన్లు 1, 1/57, 2, 57, సర్వే నెంబర్ 273లో సబ్ డివిజన్లు 1,6 మాత్రమే రిజిస్ట్రేషన్ నిషేదిత జాబితాలో ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో మాత్రం సర్వే నెంబర్ 192, 273 లోని అన్ని సబ్ డివిజన్లను రిజిస్ట్రేషన్ల నిషేదిత జాబితా(పీఓబీ)లో పేర్కొన్నారు. దాంట్లో సర్వే నం.192/1-1లో 534 ఎకరాలు, 192/2-2 లో 2673 ఎకరాలు అటవీ భూమిగా నమోదు చేశారు. అలాగే సర్వే నం.273/1లో 5,481, 273/2 లో 213.26 ఎకరాలు కూడా అటవీ భూమిగా పేర్కొన్నారు. సర్వే నం.273/1/6/అ/2లో 2.09 ఎకరాలు వక్ఫ్ భూమిగా నమోదు చేశారు. తహశీల్దార్ రెఫరెన్స్ ప్రకారం ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. కనీసం ఎంత విస్తీర్ణం అనేది కూడా పేర్కొనలేదు. రెవెన్యూ,

 

 

 

Post Midle

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖల మధ్య పొంతనే లేదు.రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను రైతులకు అనుసంధానం చేసి ధైర్యమిచ్చారు. రైతుబీమా, రైతుబంధు పథకాలకు గిరిజనులను దూరం చేశారు. పార్ట్-బీలో పెట్టి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కలెక్టర్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాచకొండ ప్రాంతంలో భూ పట్టాలు పొంది తరతరాలుగా సాగుచేసుకొంటున్న వారికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐ దొనల్‌తండా, కడిలబాయి తండా, తుంబాయితండా, పల్లగట్టు తండా, రాచకొండ తండాలకు చెందిన అనేక మంది నిరుపేద రైతులు కలెక్టర్‌ను కలిసి గోడు చెప్పుకోవాడనికి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. సమాచారం ముందే తెలుసుకొని పెద్ద సంఖ్యలో పోలీసులతో బందోబస్తు పెట్టారు. పోలీసులకు, గిరిజన రైతులకు తోపులాట, వాగ్వాదాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్విట్వర్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రి కేటీఆర్‌లకు ఫిర్యాదు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులకు కూడా మొర పెట్టుకున్నారు. ఇటీవల మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి భూములకు హక్కులు లభించడం లేదు.

 

Tags: The tearful anguish of tribal rights

Post Midle