సోలార్ వినయోగంలో తెలుగు రాష్ట్రాలే టాప్

Date:14/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
దేశంలో పునర్‌ వినియోగ ఇంధన (ఆర్‌ఇ) సామర్థ్యాలు పెంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయని కెపిఎంజి డైరెక్టర్‌  ఉదయ్‌ కిరణ్‌ ఆలమూరు తెలిపారు.  రెన్యూఎక్స్‌ పేరిట ప్రారంభమైన రెండు రోజుల ప్రదర్శనలో ప్రారంభోపన్యాసం ఇస్తూ దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో దక్షిణ రాష్ట్రాల వాటా 30 శాతం కాగా అందులో సౌర, పవన విద్యుత్‌ వాటా 50 శాతం మేరకు ఉన్నదని ఆయన చెప్పారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానంలో ఉండగా రెండో స్థానంలో ఉన్నదని ఆయన అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద సౌర విద్యుత్‌ ప్లాంట్లలో ఒకటి ఏపీలోని కర్నూలులో ఉన్నదని, దాని సామర్థ్యం వెయ్యి మెగావాట్లని ఆయన చెప్పారు. సౌరవిద్యుత్‌ వల్ల పర్యావరణం స్వచ్ఛంగా ఉండడంతో పాటు తక్కువ ధరకే విద్యుత్‌ అందించే అవకాశం ఉండడం వల్ల రాష్ట్రాలు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రప్రభుత్వాలు కూడా ఈ రంగంలోకి పెట్టుబ‌డిదార్లను ఆకర్షించేందుకు పలు ప్రోత్సాహకాలు, రాయుతీలు ప్రకటించాయని ఆయన అన్నారు. 2030 నాటికి దేశంలో విద్యుత్‌ ఉత్పత్తిలో 40 శాతం ఆర్‌ఇ ద్వారానే సాధిస్తామని పారిస్‌ సదస్సులో ఇచ్చిన హామీకి అనుగుణంగా గత నాలుగు సంవత్సరాల కాలంలో భారత ఇంధన ఉత్పత్తిలో పున‌రుత్పాద‌క ఇంధ‌న(ఆర్ ఇ) వాటా గణనీయంగా పెరిగిందని, ప్రస్తుతం దేశంలోని విద్యుత్‌ స్థాపిత సామర్థ్యంలో 20 శాతం ఈ విభాగం నుంచే అందుతున్నదని ఆయన చెప్పారు. 2022 నాటికి మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో ఆర్‌ఇ వాటా 30 శాతానికి పెరుగుతుందని, అదే జోరులో ముందుకు సాగినట్టయితే పారిస్‌ కట్టుబాటు కన్నా ముందుగానే లక్ష్యాన్ని చేరగలరని ఆయన అన్నారు. 2010 సంవత్సరంలో మన సౌర ఇంధన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఒక గిగావాట్‌ ఉంటే 2017-18నాటికి 20 గిగావాట్లకు పెరగడమే ఆ రంగంలో మనం సాధిస్తున్న పురోగతికి సంకేతమని ఆయన చెప్పారు. ఉత్పత్తి పెరగడం వల్ల ఆర్‌ఇ ధరలు తగ్గడం కూడా వివిధ రాష్ట్రాలు ఈ దిశగా ఆకర్షితులవుతున్నాయని కిరణ్‌ అన్నారు.దేశంలో మొత్తం విద్యుత్‌ ఉత్పత్తిలో దక్షిణ రాష్ట్రాల వాటా 30 శాతంతెలంగాణ ప్రభుత్వం రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టులకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నదని తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ చైర్మన్‌, ఎండి రఘుమారెడ్డి చెప్పారు. ఆర్‌ఇకి ప్రోత్సాహకాలు ప్రకటించడంతో తెలంగాణ ఏర్పాటైన నాలుగేళ్ల కాలంలోనే 3336 మెగావాట్ల సౌర విద్యుత్‌ను గ్రిడ్‌కు జత చేశామని, 2018నాటికి మరో 473 మెగావాట్లు జత అవుతుందని ఆయన అన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో ఐదు వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా తాము కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు. మొత్తం సౌర విద్యుత్తులో రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్రాజెక్టుల వాటా ప్రస్తుతం 33 మెగావాట్లున్నదని, మరో 48 మెగావాట్ల ప్రాజెక్టులకు తాము సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అందించామని ఆయన చెప్పారు. సౌరశక్తి 24 గంటలూ అందుబాటులో లేకపోవడం సౌరవిద్యుత్‌ సామర్థ్యాల విస్తరణకు ప్రధాన అవరోధమని తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ ఇస్మాయిల్‌ అలీ ఖాన్‌ అన్నారు. రాత్రి వేళల్లో సూర్యకాంతి లేకపోవడం, మేఘాలు ఆవరించిన సమయాల్లో, వర్షాకాలంలో సౌర విద్యుత్‌ సామర్థ్యాలు పడిపోవడం కూడా పెద్ద అవరోధమని ఆయన చెప్పారు. ఇలాంటి సమయాల్లో సాంప్రదాయిక ప్రాజెక్టుల నుంచి మద్దతు ఇవ్వాల్సిఉంటుందని ఆయన అన్నారు. ఆర్‌ఇ, సాంప్రదాయిక విద్యుత్‌ సరఫరాలో వ్యత్యాసం ఐదు శాతం దాటిందంటే గ్రిడ్‌ ఫెయిల్‌ అయ్యే ప్రమాదం ఉంటుందంటూ దీన్ని నివారించాలంటే ఆ వ్యత్యాసాన్ని తగ్గించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో సౌర విద్యుత్‌ ధరలు ఒకప్పుడు యూనిట్‌కు 17 రూపాయలుంటే ఇప్పుడవి 4 నుంచి 7 రూపాయలకు తగ్గాయని, దాన్ని 1.70 రూపాయలకు తగ్గించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
Tags:The Telugu states are the only ones in the solar calamity

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *