పాత బస్తీలో నిబంధనాలు బేఖాతర్

Date:11/10/2018
హైద్రాబాద్  ముచ్చట్లు:
 ముందస్తు ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్ల తొలగింపు ప్రక్రియ మొక్కుబడిగా సాగుతోంది. న్యూ సిటీలోని పలు ప్రాంతాల్లో కోడ్ అమల్లో ఉందంటూ కొద్దిరోజుల క్రితం ఎంతో హడావుడి చేస్తూ, ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించిన జీహెచ్‌ఎంసీ పాతబస్తీలో పలు పార్టీల ఫ్లెక్సీలను తొలగించటం లేదని, ఆ పార్టీలకు మినహాయింపు ఏమైనా ఇచ్చారా? అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేస్తామంటూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ ప్రకటించినా, నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఇంకా దర్శనమివ్వటం అధికారుల పనితీరుకు నిదర్శనం.
ప్రభుత్వ ఆస్తులపై ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేయరాదని, చేసిన వాటిని వెంటనే తొలగిస్తామని అధికారులు ప్రకటించినా, నగరంలోని పలు ప్రాంతాల్లోని మెట్రోరైలు పిల్లర్లపై ఇంకా అధికార పార్టీకి చెందిన ప్రచార సామాగ్రి కన్పిస్తోంది. ఇక పాతబస్తీలోనైతే అడుగడుగునా మజ్లిస్ ఫ్లెక్సీ, బ్యానర్లు కూడా దర్శనమిస్తున్నాయి. కమిషనర్ ఆదేశాలు జారీచేసిన తొలి రోజు కొన్ని ప్రాంతాల్లో అంతంతమాత్రంగా వీటిని తొలగించిన జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది పాతబస్తీలో వీటి జోలికెళ్లటం లేదు. మజ్లిస్ ‘ఓట్ ఫర్ కైట్’ అని రాసి ఉన్న తెల్లటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను తయారుచేసి కూరగాయలు, మటన్, చికెన్ షాపులతో పాటు ఇతర జనరల్ స్టోర్స్‌లకు పంచిపెట్టారు.
నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దటంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై ఇప్పటికే నిషేధం విధించి, మటన్ షాపులకు టిఫెన్ బాక్సుతో వెళ్దామని విస్తృతంగా ప్రచారం చేసిన జీహెచ్‌ఎంసీ ఈ ప్రచార సామాగ్రిని అడ్డుకోలేకపోతోంది.ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నందున మహానగరంలో నిర్వహిస్తున్న కంటివెలుగు శిబిరాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లను, డాక్టర్ స్లిప్‌లను సైతం తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కంటి వెలుగు శిబిరాల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేశారు. కంటి వెలుగుకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లు, డాక్టర్ స్లిప్‌లపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఫొటోలు ఉన్నందున, వాటిని తొలగించాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. కంటి వెలుగు పరీక్షా కేంద్రాలకు హాజరయ్యే వారికి తెల్లకాగితాలపై ప్రిస్కిప్షన్ రాయాలని వైద్యులు, సహాయ సిబ్బందికి జీహెచ్‌ఎంసీ సూచించింది.
Tags:The terms of old basti are basmatur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *