లోక్‌సభ ఎన్నికలకు ముగిసిన మూడో దశ పోలింగ్

Date:23/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సామాజిక కార్యకర్త అన్నా హజారే, క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా సహా పలువురు నేతలు, ప్రముఖులు మూడో దశ పోలింగ్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయప్రద, సుప్రియా సూలె, శశిథరూర్‌, మల్లికార్జున్‌ ఖర్గే, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తదితరులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం (ఏప్రిల్ 23) 12 గంటల సమయానికి 23.84 శాతం పోలింగ్‌ నమోదైంది. దేశంలోని 13 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో 117 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,640 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం మూడో దశలో భాగంగా 116 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ, త్రిపురలోని త్రిపుర తూర్పు లోక్‌సభ స్థానానికి సంబంధించిన ఎన్నిక రెండో దశ నుంచి మూడో దశకు వాయిదాపడింది. దీంతో నియోజకవర్గాల సంఖ్య 117కు చేరింది. లోక్‌సభతో పాటు ఒడిశాలోని 42 శాసనసభ స్థానాలకు కూడా పోలింగ్‌ కొనసాగుతోంది. సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే.. మహారాష్ట్రంలో తన సొంత గ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో ఓటేశారు. ప్రతి పౌరుడు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మూడో దశ పోలింగ్‌లో భాగంగా మహారాష్ట్రలో 14 లోక్‌సభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతున్నాయి.బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. షాపూర్ హిందీ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఆయన ఓటేశారు.
Tags:The third phase of polling for the Lok Sabha elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *