The Tirumala Shreevari Temple is ready to get rathasapthami in the temple

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమికి స‌ర్వం సిద్ధం

Date:11/02/2019

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 12న మంగళవారం రథసప్తమి పర్వదినం నిర్వ‌హ‌ణ‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. శ్రీ‌వారి ఆల‌యంతోపాటు అన్న‌ప్ర‌సాదం, నిఘా మ‌రియు భ‌ద్ర‌త‌, ఇంజినీరింగ్, ఉద్యాన‌వ‌న త‌దిత‌ర విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. స‌ప్త వాహనాలపై స్వామివారి వైభ‌వాన్ని తిల‌కించేందుకు పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేయ‌నుండ‌డంతో అందుకు త‌గ్గ‌ట్టు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. శ్రీ‌వారి ఆల‌యంలో తెల్ల‌వారుజామున కైంక‌ర్యాలు పూర్త‌యిన త‌రువాత ఉద‌యం 4.30 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఆలయం నుండి వాహనమండపానికి వేంచేపు చేస్తారు. అక్క‌డ విశేష స‌మ‌ర్ప‌ణ చేప‌డ‌తారు.

సూర్య‌ప్ర‌భ‌ వాహనం(ఉదయం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు)

ఉద‌యం 5.30 గంట‌ల‌కు సూర్యప్రభ వాహన‌సేవ మొద‌ల‌వుతుంది. అక్కడినుండి ఆలయ వాయువ్య దిక్కుకు చేరుకోగానే సూర్యోద‌యాన భానుడి తొలికిర‌ణాలు శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి పాదాల‌ను స్ప‌ర్శిస్తాయి. ఈ ఘ‌ట్టం భ‌క్తుల‌కు క‌నువిందు చేస్తుంది. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయి.

చిన్నశేషవాహనం(ఉదయం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు)

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకిగా భావిస్తారు. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

గ‌రుడ వాహనం(ఉదయం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు)

శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన‌ది గ‌రుడ వాహ‌నం. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు.

హనుమంత వాహనం(మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు)

శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. గురుశిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వవివేచన తెలిసిన మహనీయులు కావున ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

చక్రస్నానం(మ‌ధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు)

శ్రీ‌వ‌రాహ‌స్వామివారి ఆలయం వ‌ద్ద గ‌ల స్వామిపుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.

కల్పవృక్ష వాహనం(సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు)

శ్రీమలయప్పస్వామివారు ఉభయదేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడన చేరిన వారికి ఆకలిదప్పులుండవు. పూర్వజన్మస్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలాకాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం.

సర్వభూపాల వాహనం(సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు)

సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని స్వామివారు అందిస్తున్నారు.

చంద్రప్రభ వాహనం(రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు)

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్లు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుండి అనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.

వివిధ కారణాలతో ఇద్దరు ఆత్మహత్య

Tags:The Tirumala Shreevari Temple is ready to get rathasapthami in the temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *