తండా వాసుల బాధలు వర్ణనాతీతం 

Date:18/09/2018
పాలమూరు ముచ్చట్లు:
తండాలకు రోడ్డు వసతి లేదు. చినుకు పడితే చాలు తండాకు రాకపోకలు నిలిచిపోతాయి.  తండాలో పిల్లలకు పెళ్లిళ్లు కూడా కావడం లేదు.ఇది తండా వాసుల రోదన..వేదన ఏళ్లు గడుస్తున్నా నారాయణఖేడ్, మనూరు, కంగ్టి, సిర్గాపూర్ మండలాల్లో అనేక తండాలు ఇప్పటికీ కనీస వసతులు లేక నానా వెతలు అనుభవిస్తున్నారు.
పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా తండాల్లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా ఉన్న తండాల్లో నిత్యం సమస్యలతో గిరిజనం సతమతం అవుతూనే ఉన్నారు.సంగారెడ్డి జిల్లాలో మొత్తం గ్రామ పంచాయతీలు 475 వుండగా, 294 గిరిజన ఆవాసాలు ఉన్నాయి.
మొత్తం గిరిజనుల జనాభా 77480, రోడ్డు సౌకర్యం లేని తండాలు 180 ఉన్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన నారాయణఖేడ్ నియోజకవర్గంలో తండాలు ఎక్కువగా ఉన్నాయి. మనూరు, కంగ్టి, నాగిల్‌గిద్ద, సిర్గాపూర్, అల్లాదుర్గం, వట్‌పల్లి, రేగోడ్ మండలాల్లోని తండాలకు కంకర తేలిన, మట్టి రహదారులే ఉన్నాయి.
నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో పాలకులు అనేక హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని తండాల పరిస్థితి మాత్రమే మెరుగుపడగా అనేక తండాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి.ముఖ్యంగా తాండాలకు రోడ్డు వసతి లేక గిరిజనుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆయా రోడ్లలో కనీసం ద్విచక్ర వాహనం కూడా వెళ్లలేని విధంగా ఉన్నాయి.
పక్కనే ఉన్న గ్రామాలకు గానీ, పట్టణాలకు గానీ వెళ్లాలంటే ఎడ్ల బండ్లపైగానీ లేదా నడిచిగానీ వెళ్లాల్సిందే. ప్రతినిత్యం పట్టణాలకు వెళ్లే గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాత్రి సమయాల్లో గానీ, అత్యవసర సమయాల్లో గానీ పట్టణాలకు వెళ్లాలంటే గిరిజనులకు నరకమే కనిపిస్తోంది. ఇక పాఠశాలలకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులు పక్క గ్రామాల్లో ఉన్న పాఠశాలకు వెళ్లేందుకు నడక ప్రయాణమే దిక్కవుతోంది. ప్రతినిత్యం గంటల తరబడి కిలోమీటర్ల కొద్దీ నడిచి విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవాల్సివస్తోంది.
కంగ్టి మండలంలోని తండాల్లో పాముకాటుకు గురైన సందర్భాల్లో గిరిజనులు వైద్య చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌కు చేరుకొనేందుకు సరైన రోడ్డు వసతులు లేకపోవడం వల్ల సకాలంలో ఆసుపత్రులకు చేరుకోలేక ప్రాణాలను పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎన్నికల సమయంలో తండాలకు వచ్చే పాలకులు ఎన్నికల తర్వాత తండాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని గిరిజనులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, జిల్లా యంత్రాంగం స్పందించి కనీస వసతి అయిన రోడ్డు సౌకర్యం, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఆయా తండాల్లోని గిరిజనులు కోరుతున్నారు.
Tags: The tortures of tannara are not characterized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *