కశ్మీర్ లో ఆ రెండు కుటుంబాలకు కష్టకాలమే

Date:19/08/2019

శ్రీనగర్ ముచ్చట్లు:

జమ్మూకాశ్మీర్.. ఈ పేరు చెప్పగానే ముందుగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, రాజకీయ గుత్తాధిపత్యం వంటి మాటలు వినపడేవి. మారిన పరిస్థితుల్లో ఇవి చరిత్రగా మిగిలిపోనున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కేంద్రం సమాయత్తం కానుంది. వేర్పాటువాద శక్తుల పీచమణిచేందుకు కూడా సిద్ధం కానుంది. ఇక అన్నింటికీ మించి కొన్ని రాజకీయ కుటుంబాల గుత్తాధిపత్యానికి తెరపడే అవకాశాలు ప్రస్ఫుటంగా కన్పిస్తున్నాయి.

 

 

 

 

ఏడు దశాబ్దాలుగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర రాజకీయమంతా అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాల చుట్టూనే తిరిగింది. ఆ కుటుంబాల వారే ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. మధ్యలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మీర్ ఖాసిం, గులాం మహ్మద్ షా, గులాం నబీ ఆజాద్ వంటి వారు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ వారి ప్రభావం పరిమితమే. మారిన పరిస్థితుల్లో ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ రాజకీయ గుత్తాధిపత్యానికి తెరపడే అవకాశాలున్నాయి.

 

 

 

 

రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది అబ్దుల్లా కుటుంబమే. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు అయిన షేక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, మనవడు ఒమర్ అబ్దుల్లా వరసగా ముఖ్యమంత్రులుగా చక్రం తిప్పారు. తద్వారా రాష్ట్ర రాజకీయాలను గుప్పిట పట్టారు. షేక్ అబ్దుల్లా ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మరణానంతరం ఫరూక్ అబ్దుల్లా మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.

 

 

 

ఫరూక్ అనంతరం ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా అధికార పగ్గాలు అందుకున్నారు. ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడైన దివంగత ముఫ్తీ మహ్మద్ సయీద్ ఆ పార్టీని వీడి సొంతంగా పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) ని స్థాపించారు. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో అబ్దుల్లా కుటుంబానికి గట్టి పోటీ ఇచ్చారు. ఆయన రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 90వ దశకంలో కాంగ్రెస్ మద్దతుతో, 2014లో బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. అంతకు ముందు 1989లో వీపీ సింగ్ హయాంలో కేంద్ర హోంమంత్రిగా నియమితులయ్యారు.

 

 

 

దేశ తొలి ముస్లిం హోంమంత్రి ఆయనే కావడం విశేషం. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడే కూతురు రుబియాను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ముఫ్తీ మరణానంతరం ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా జమ్మూ కాశ్మీర్ రాజకీయం రెండు కుటుంబాల చుట్టూ తిరుగుతూ వస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానానికి పరిమితమై ప్రేక్షక పాత్రను పోషించాయి.తాజా పరిణామాల నేపథ్యంలో అబ్దుల్లా, ముఫ్తీ రాజీయ గుత్తాధిపత్యానికి జమ్మూకాశ్మీర్ లో తెరపడనుందన్నది .

 

 

 

 

విశ్లేషకుల అంచనా. జాతీయ పార్టీలు ముఖ్యంగా హిందుత్వానికి ప్రతినిధిగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ది పైచేయిగా మారనుంది. అసెంబ్లీలో మొత్తం 87 స్థానాలున్నాయి. ఇందులో కాశ్మీర్ లోయలో 46, జమ్మూలో 37, లడఖ్ లో నాలుగు స్థానాలున్నాయి. లోయలో అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్, మెహబూబా ముఫ్తీ పీడీపీలకు గట్టి పట్టుంది. బీజేపీ, కాంగ్రెస్ బలం తక్కువే. లోయలో అత్యధిక సీట్లను గెలుచుకోవడం ద్వారా ఇప్పటి వరకూ ఎన్సీపీ, పీడీపీలు పెత్తనం చేస్తున్నాయి.

 

 

 

 

 

ఇక్కడ ఏదో ఒక ముస్లిం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలు లేనే లేవు. ఉదాహరణకు గత ఎన్నికల్లో (2014) పీడీపీ 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సహజంగానే ఆ పార్టీ అధినేత ముఫ్తీ మహ్మద్ సయాద్ ముఖ్యమంత్రి అయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు గెలిస్తే ఆ పార్టీకి సీఎం పదవి దక్కుతుంది. జాతీయ పార్టీలకు 37 స్థానాలున్న జమ్మూలోనే బలం ఉంది. వీటిని మళ్లీ బీజేపీ, కాంగ్రెస్ పంచుకుంటాయి. జమ్మూలోని ఎక్కువ స్థానాలను గెలుచుకున్న పార్టీకే డిప్యూటీ సీఎం పదవి దక్కుతుంది.

 

 

 

 

మొన్నటి ఎన్నికల్లో 25 స్థానాలను గెలుచుకున్న బీజేపీకి ఈ పదవి లభించింది. ఆ పార్టీ నాయకుడు నిర్మల్ సింగ్ డిప్యూటీ సీఎం అయ్యారు.నియోజకవర్గాల పరంగా కాశ్మీర్ లోయ పెద్దది అయినప్పటికీ ఇక్కడ జనాభా తక్కువే. నియోజకవర్గాల పరంగా జమ్మూ చిన్నదైనప్పటికీ ఇక్కడ జనాభా ఎక్కువ. ఈ ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ వ్యూహం. జమ్మూలో సీట్లను పెంచి, కాశ్మీర్ లోయలో తగ్గించడం ద్వారా సమతూకం పాటించాలన్నది ఆలోచన.

 

 

 

 

 

లోయలో సీట్లను తగ్గించడం ద్వారా అక్కడ పట్టున్న నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ లను దెబ్బతీసి అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలను రాజకీయంగా బలహీన పర్చవచ్చన్నది బీజేపీ అంచనా. అదే సమయంలో హిందువులు ఎక్కువగా ఉన్న జమ్మూలో సీట్లను పెంచడం ద్వారా మెజారిటీ సీట్లను గెలుచుకుని చక్రం తిప్పవచ్చన్నది కమలనాధుల ఆలోచన. 2014లో బీజేపీకి వచ్చిన 25 సీట్లలో సింహభాగం జమ్మూలోనివే కావడం గమనార్హం.

 

 

 

 

హిందువుల ఓట్లను చీల్చుకునే కాంగ్రెస్ ఇప్పుడు బలహీనంగా ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని మొత్తం హిందువుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టవచ్చన్నది వ్యూహం. మొత్తానికి అబ్దుల్లా, ముఫ్తీ రాజకీయ ఆధిపత్యం అంతం చేసే విధంగా కమలం పార్టీ పావులు కదుపుతోంది.

ఏపీలో జోరుగా వరద  రాజకీయాలు

 

Tags: The two families had a difficult time in Kashmir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *