ప్రారంభమైన ఉప రాష్ట్రపతి ఎన్నిక రాత్రికల్లా ఫలితం.
దిల్లీ ముచ్చట్లు:
దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలవ్వగా.. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
ఈ పదవికి ఎన్డీయే కూటమి తరఫున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా పోటీలో ఉన్నారు.
లోక్‌సభకు చెందిన 543, రాజ్యసభకు చెందిన 245 మంది ఈ ఎన్నికలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో జమ్మూకశ్మీర్ నుంచి 4, త్రిపుర నుంచి 1, నామినేటెడ్ సభ్యుల నుంచి 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే నికరంగా 780 మందికి ఓటు వేసే హక్కు ఉంది. ఇందులో లోక్‌సభలో 23, రాజ్యసభలో 13 మంది సభ్యుల సంఖ్యాబలం ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన 36 మంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాలు కన్పించట్లేదు. సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలుపెట్టి రాత్రికల్లా ఫలితం వెల్లడిస్తారు.

ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్ ధన్‌కఢ్ గెలుపు దాదాపు లాంఛనమే. అధికార భాజపాకు లోక్‌సభలో 303, రాజ్యసభలో 91 కలిపి 394 ఓట్లున్నాయి. అభ్యర్థి గెలుపునకు కావాల్సిన 372+1కి మించిన ఓట్లు భాజపా ఒక్కదాని చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఆపార్టీకి అదనంగా శివసేన, జనతాదళ్ (యూ), బీఎస్పీ, బీజేడీ, ఏఐఏడీఎంకె, వైకాపా, తెదేపా, శిరోమణి అకాళీదళ్, ఎల్‌జేపీ, ఏజీపీ, ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, ఎంఎన్‌ఎఫ్, ఎస్‌కేఎం, ఎన్‌డీపీపీ, ఆర్‌పీఐ-ఎ, పీఎంకె, అప్నాదళ్, ఏజేఎస్‌యు, టీఎంసీ-ఎం మద్దతిస్తున్నాయి. ప్రస్తుత లెక్కల ప్రకారం ఎన్డీయే కూటమికి 544 ఓట్లు లభించే సూచనలున్నాయి. అంటే ఎలక్టోరల్ కాలేజీలో 73% ఓట్లు ధన్‌ఖడ్‌కు దక్కే అవకాశం ఉంది.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి 11వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 12వ తేదీవరకు పార్లమెంటు జరుగనున్నందున చివరి రోజు కొత్త ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో సభను నిర్వహించే అవకాశం ఉంది.
Tags: The Vice President election that started was an overnight result.
