The Watchtower

కావలిలోతెలుగుదేశం కోటకు బీటలు!

Date:28/05/2020

నేడు 28 వతేది ఎన్ఠీఆర్ జన్మదినం సందర్భంగా కావలి నియోజకవర్గంలో 1983 లో కాంక్రీట్ పునాదులతో, కాంక్రీట్ గోడలతో ఎంతో పటుత్వంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కోట – ఇప్పుడు పూర్తిగా బీటలు వారింది. మరమ్మత్తులు చేసే నాధులు లేక కూలిపోవడానికి సిద్ధంగా వుంది.ఈ నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా ఉండేది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నడుమ పోటీ తీవ్రంగా వుండేది. నువ్వా నేనా అన్నరీతిలో యుద్దవాతావరణంలో ఎన్నికలు జరిగేవి. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎంతో ఆదరించారు. 2019 ఎన్నికల ముందువరకూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాలు రెపరేపలాడుతూ కనిపించేవి. కావలి పట్టణం అంతా పసుపు మయంగా అగుపించేది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైస్సార్సీపీ ని విడిచిపెట్టి కాటంరెడ్డి విష్ణువర్ధన రెడ్డి చివరిక్షణంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినా – ఆయన ఓటమి చవిచూసింది 12 వేల పైచిలుకు ఓట్లతోనే. ఆ ఓటమి ఎందుకు జరిగింది ? ఎలా జరిగింది ?? అన్న ప్రశ్నలు ప్రక్కనుంచితే పోటీ మాత్రం తీవ్రంగానే జరిగిందని చెప్పుకోవాలి.

 

ఏడాది క్రితం వరకూ కావలి నియోజకవర్గంలో ఎంతో పటిష్టంగా వున్న తెలుగుదేశం పార్టీ – ఇప్పుడు ఒక్కసారిగా కూలిపోయే పరిస్థితికి రావడానికి నాయకత్వ లేమి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్టంలో అధికారం కోల్పోవడంతో రాష్ట్రమంతా ఆ పార్టీలో నైరాశ్యం ఆవరించిన మాట వాస్తవమైనా – కావలిలో పార్టీ కనుమరుగై పోయే పరిస్థితి తలెత్తడానికి ముమ్మాటికీ నాయకులే కారణం.ఎన్నికల అనంతరం కావలిలో వైస్సార్సీపీ ప్రవేశపెట్టిన ఆకర్ష్ కు – ఎక్కువమంది తెలుగుదేశం ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు ఆకర్షితులు కావడం వెనుక కనిపించింది వారిలో తలెత్తిన అభద్రతా భావమే. ఏదైనా జరిగితే తమకోసం ఎదురొడ్డి పోరాడే నాయకుడు లేడన్న అభద్రతతోనే చాలామంది క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు వైస్సార్సీపీ కండువాలు కప్పుకున్నారు. కొందరు వారివారి స్వార్ధ ప్రయోజనాలకు వెళ్ళివుండవచ్చు కూడా. తమను కాపాడే నాయకుడు లేడని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే వారంతా వైస్సార్సీపీ జెండాలు మోయడానికి సిద్ధపడ్డారన్నది మాత్రం వాస్తవం.

 

 

 

కావలి నియోజకవర్గంలో ఎన్నికల ముందు వరకూ తెలుగుదేశం పార్టీలో ఎదురు తిరుగు లేని నాయకుడిగా వున్న మాజీశాసనసభ్యుడు బీదా మస్తానరావు – ఆపార్టీ అధినేత మాటకు కట్టుబడి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చవిచూడడంతో ఆయన నియోజవర్గం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. దాంతో తెలుగుదేశం క్యాడర్ ను నైరాశ్యం చుట్టు ముట్టింది. కావలి నియోజకవర్గం తెలుగుదేశం ఇంఛార్జి గా వున్న మాజీశాసనసభ్యుడు కాటంరెడ్డి విష్ణువర్ధన రెడ్డి తెలుగుదేశం క్యాడర్ ను తనవైపు తిప్పుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. పూర్తిగా క్రియాశీలరాజకీయాల్లో పాల్గొనడంలోనూ ఆయన విఫలం అయ్యారు.ఇది ఇలావుంటే అధికారపార్టీకి చెందిన నాయకులు సామదాన భేద దండోపాయాల్ని ప్రయోగించి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లొంగదీసుకోవడం మొదలు పెట్టారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఇలావుండగానే బీదా మస్తానరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై పలికి వైస్సార్సీపీ గూటికి చేరిపోవడం ఆపార్టీకి పెద్ద షాక్ అయ్యింది. ఆయన వెంట కొంత తెలుగుదేశం క్యాడర్ వైస్సార్సీపీలోకి వెళ్లి పోయింది. ఇలా రకరకాల కారణాలతో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో బాగా దెబ్బతిని పోయింది.

 

 

 

ఇలా ఒకవైపు ఆపార్టీ ఇక్కడ దయనీయ పరిస్థితి ఎదుర్కొంటుంటే – మరోవైపు పార్టీ రెండువర్గాలుగా చీలిపోయి వుండడం విస్తుగొల్పుతుంది. జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర వర్గం ఒకటి – విష్ణువర్ధన రెడ్డి వర్గం గా మరొకటి కనిపిస్తున్నాయి.స్థానిక ఎన్నికల నగారా ఎప్పుడైనా మోగే పరిస్థితి కనిపిస్తున్న ఈ తరుణంలో – రెండు వర్గాలు ఇలాగే అనైక్యతా రాగం ఆలాపిస్తుంటే మాత్రం స్థానిక ఎన్నికల్లో ఆపార్టీ ఘోరంగా నష్టపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.ఎన్ఠీఆర్ జన్మదినంరోజు నాయకులంతా కావలి పట్టణంలో ఎన్ఠీఆర్ విగ్రహం వద్దకు వస్తున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. అక్కడకూడా వర్గాల బల ప్రదర్శనలు కనిపోయిస్తాయో లేక పార్టీని బలోపేతం చేస్తూ ఒకే త్రాటిపై ముందుకు పోయే ఆలోచనలు చేస్తారో వేచి చూడాలి.

-ప్రభాకర్ జలదంకి. ✍🏻
సీనియర్ జర్నలిస్టు
కావలి
ఎస్ పి ఎస్ ఆర్ నెల్లూరు జిల్లా

హలో… ప్రభాకర్బాగున్నావా 

Tags: The Watchtower

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *