Natyam ad

పరుగులు పెడుతున్న ‘తారకరామతీర్థ’ పనులు

విజయనగరం ముచ్చట్లు:


ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.150.24 కోట్లతో జలవనరుల శాఖ అధికారులు జ్యుడిషియల్‌ ప్రివ్యూకు ప్రతిపాదనలు పంపారు.జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించగానే టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి, ఎంపికైన కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పి, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది. ఆ గ్రామాల్లో తాగు నీటికి కూడా 0.162 టీఎంసీలు సరఫరా చేస్తారు. విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీటి కోసం 0.48 టీఎంసీలను సరఫరా చేస్తారు.వైఎస్‌  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామతీర్థ సాగరం ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజ్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్‌కు 2.7 టీఎంసీల నీటిని తరలిస్తారు.దీని ద్వారా కుమిలి చానల్‌ సిస్టమ్‌ పరిధిలోని 8,172 ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 16,538 ఎకరాలకు నీళ్లందిస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేస్తున్నారు.

 

 

 

ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజ్‌ నిర్మాణం దాదాపు పూర్తయింది. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కుమిలి రిజర్వాయర్‌ డైక్‌–2, డైక్‌–3లలో 2.2 కిలోమీటర్ల  మట్టికట్ట పనుల్లో రూ.150.24  కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్‌ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌ను తొలగించి, ఆ పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రతిపాదనలను జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపారుతారకరామతీర్థ సాగరం ప్రాజెక్టుకు అవసరమైన 3,446.97 ఎకరాల భూమికిగాను ఇప్పటికే 3,243.28 ఎకరాలను సేకరించారు. మిగతా 203.69 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. కుమిలి రిజర్వాయర్‌లో మూడు గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఇందులోని 2,219 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. భూసేకరణ, పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగు నీరు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

 

Tags; The works of ‘Tarakaramathirtha’ are running

Leave A Reply

Your email address will not be published.