నాగార్జునసాగర్ పనులపై ప్రపంచ బ్యాంకు సంతృప్తి.

-కాళేశ్వరం సందర్శనకు ప్రపంచబ్యాంకు బృందం ఆసక్తి
Date:13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం  సంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది.అనంతరం శుక్రవారం ఇక్కడ జలసౌధలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం సమావేశమైంది.చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది. ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని,సాగునీటి వసతి వల్ల రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నదని బృందం సభ్యులు తెలిపారు.సాగునీటి పంపిణీ సమర్ధంగా జరుగుతున్నట్టుగా తాము గమనించామని వారు చెప్పారు.ఆధునీకరణ పనుల్లో తెలంగాణ రాష్ట్రం చేయాల్సిన పనుల్లో 98 శాతం పూర్తవగా, మిగతా పనులు  జూలై నాటికి పూర్తి అవుతాయని మంత్రి హరీశ్ రావు చెప్పారు.ప్రస్తుతం పూర్తయిన ఆధునీకరణ పనులతో ప్రాజెక్టు కింద గ్యాప్ ఆయకట్టు 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్టు మంత్రి తెలిపారు. సాగర్ ఆధునీకరణ పనులకు 2008 లో శ్రీకారం చుట్టారని చెప్పారు. కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలను ఆధునీకరించడం ద్వారా సాగునీటి పంపిణీ వ్యవస్థను  మెరుగు పరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, వ్యవస్థాగత సామర్థ్యాన్ని పటిష్టపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. తెలంగాణ పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల మేరకు  ఆయకట్టు ఉండగా, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల మేరకు  ఉందని హరీశ్ రావు అన్నారు. ఈ పనులతో సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్కు నీరు చేరుకునేందుకు పట్టే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గిందని చెప్పారు. ఇక 31.5 కిలోమీటర్ల మధిర బ్రాంచి కాల్వ పరిధిలో 14.5 కిలోమీటర్ల మేర లైనింగ్ చేయడంతో ఆ కాల్వ కింద 58,895 ఎకరాలకు సాగునీరు అందుతున్నట్టు మంత్రి తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,జగదీశ్ రెడ్డితో  కలిసి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెంట విస్తృతంగా పర్యటించిన విషయాన్ని హరీశ్ రావు ప్రపంచబ్యాంకు బృందానికి తెలిపారు.రెండు రోజుల పాటు చివరి ఆయకట్టు ప్రాంతం దాకా వెళ్లామని తెలిపారు.ఇరిగేషన్,రెవెన్యూ,వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నట్టు ఇరిగేషన్ మంత్రి చెప్పారు.రైతాంగం తమ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత అని అన్నారు.భారతదేశంలో కొత్త చరిత్ర ను లిఖించబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను మంత్రి హరీశ్ రావు కోరారు.కాళేశ్వరంద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరివ్వనున్నట్టు ఆయన వివరించారు.ఈ ప్రాజెక్టు గురించి తాము ఇప్పటికే తెలుసుకున్నామని త్వరలోనే కాళేశ్వరం సందర్శిస్తామని వారు తెలియజేశారు.ఈ సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఇ.ఎన్.సి.మురళీధర్ రావు, ‘కాడా’ కమిషనర్ డాక్టర్ మల్సూర్, ప్రపంచబ్యాంకు ప్రతినిధులు పి.శ్రీనివాస్, ఫెరిహ జాన్, చారియట్ కౌర్, జాన్  పాల్గొన్నారు.
Tags: The World Bank is satisfied with Nagarjuna Sagar works

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *