తెలంగాణలో ఐదుగురు సీనియర్లు గల్లంతే

Date:13/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 సీనియ‌ర్ల‌కు టిక్కెట్లు లేవ‌ని రాహుల్ చేసిన వ్యాఖ్య‌ల‌తో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగానే సీనియ‌ర్ల‌లో గుబులు రేపుతున్నాయి. ఇక తెలంగాణ‌లో సుమారు 70 ఏళ్ల వ‌య‌స్సు దాటిన నేత‌లు ఐదారుగురు ఉన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌తో ఇక త‌మ‌కు టికెట్లు వ‌స్తాయో రావోన‌న్న గుబులుతో ఉన్నార‌ని ఆ పార్టీ శ్రేణులు గుస‌గులాడుకుంటున్నాయి. అయితే వారికి టికెట్లు రాని ప‌క్షంలో వార‌సుల‌కు లైన్ క్లియ‌ర్ అవుతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజంగానే రాహుల్ సీనియ‌ర్ల‌కు టికెట్లు ఇవ్వ‌నిప‌క్షంలో కీల‌క‌మార్పులు త‌ప్ప‌వ‌ని ప‌లువురు నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.తెలంగాణ‌లో ఐదారుగురు సీనియ‌ర్లు ఉన్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రులు, జానారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, గీతారెడ్డి, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ మాజీ చైర్మ‌న్‌ మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి వ‌య‌స్సు 70 ఏళ్ల‌కు పైబ‌డి ఉంటుంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరి టికెట్లు గ‌ల్లంతేన‌ని చ‌ర్చ గాంధీ భ‌వ‌న్‌లో హాట్‌హాట్‌గా న‌డుస్తోంది. అయితే ఈసారికి త‌న‌తోపాటు త‌న క‌మారుడికి సైతం టికెట్లు వ‌స్తాయ‌ని జానారెడ్డి త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తానే గెలుస్తాన‌న్న ధీమాతో పొన్నాల ల‌క్ష్మ‌య్య ఉన్నారు. ఇక గీతారెడ్డి త‌న కుమార్తెను రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నా.. ఈ సారికి మాత్రం తానే పోటీ చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.పార్టీ బ‌లోపేతం కావాలంటే యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాలి.. సీనియ‌ర్ల సేవ‌ల‌ను పార్టీకి మాత్ర‌మే వినియోగించుకోవాలి.. ఇవి ఇటీవ‌ల జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్య‌లు. దీంతో తెలంగాణ‌లోని ప‌లువురు సీనియ‌ర్ నేత‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు రావ‌నే దిగులు ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇటు తెలంగాణ‌లోనూ, అటు కేంద్రంలోనూ అధికారంలోకి రావ‌డం కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం. ఈ రెండు చోట్ల కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే కాంగ్రెస్ కోలుకోవ‌డం క‌ష్ట‌మే అవుతుంది. ఏ పార్టీ అయినా ప‌దేళ్ల పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండి పుంజు కోవాలంటే మామూలు విష‌యం కాదు.ఇక పొన్నాల త‌న‌తో పాటు త‌న కోడ‌లు వైశాలికి కూడా టిక్కెట్లు కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 70 ఏళ్లు దాటిన వారు పోటీ చేయ‌వ‌ద్ద‌ని రాహుల్‌గాంధీ క‌చ్చితంగా నిర్ణ‌యిస్తేమాత్రం వారి వార‌సుల‌కు లైన్ క్లియ‌ర్ అవుతుంద‌ని టీపీసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత అయిన జైపాల్‌రెడ్డికి రాజ‌కీయంగా వార‌సులు లేరు. జానారెడ్డికి టికెట్ రాకుంటే ఆయ‌న కుమారుడు ర‌ఘువీర్‌రెడ్డికి అవ‌కాశం వ‌స్తుంద‌ని అంటున్నారు. ఇక పొన్నాల ల‌క్ష్మ‌య్య కోడ‌లు వైశాలి, గీతారెడ్డి కుమార్తె మేఘ‌నారెడ్డి, శ‌శిధ‌ర్‌రెడ్డి కుమారుడు ఆదిత్య‌రెడ్డికి టికెట్లు వ‌స్తాయ‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Tags: There are five seniors in Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *