ప్రతిపక్ష నేతలందరితో సత్సంబంధాలున్నాయి

There are good relations with the opposition leaders
Date:24/04/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా చాలా మంది ప్రతిపక్ష నేతలతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం చెప్పారు. తన అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో జరిగిన ముఖాముఖిలో ప్రధాన మంత్రి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఇప్పటికీ ఏడాదికి ఒకటి లేదా రెండు సార్లు కుర్తాలు, బెంగాలీ స్వీట్లు పంపుతారని తెలిపారు.ప్రతిపక్ష పార్టీల్లో నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు.. మమత దీదీ ఇప్పటికీ నా కోసం ఏడాదికి ఒకటి లేదా రెండు కుర్తాలను తానే స్వయంగా ఎంపికచేసి పంపిస్తారు’ అని మోదీ వెల్లడించారు. అలాగే, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా తనకు బెంగాలీ స్వీట్లు పంపేవారని, ఇప్పుడు మమత కూడా పంపిస్తున్నారని చెప్పారు. ‘షేక్ హసీనా బెంగాలీ స్వీట్లు నాకు పంపుతున్నారని మమత దీదీ తెలుసుకున్నారు. ఆమె కూడా నాకు ఈ స్వీట్లు పంపడం మొదలుపెట్టారు’ అని మోదీ తెలిపారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌తో తనకు మంచి స్నేహం ఉందని మోదీ వెల్లడించారు.నేను సీఎం కాక ముందు ఒకసారి పార్లమెంటుకు వెళ్లాను. అక్కడ నేను, గులాం నబీ ఆజాద్ కలిసి వస్తుంటే.. నువ్వు కరుడుగట్టిన ఆర్ఎస్ఎస్ వాదివి ఆయనతో స్నేహం ఎలా అని ఒకరు అడిగారు. దానికి ఆజాదే సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో మేం ప్రత్యర్థులు కావచ్చు, కానీ ఇద్దరం మంచి స్నేహితులం, ఒక కుటుంబంలా కలిసి మెలిసి ఉంటాం అని ఆజాద్ చెప్పారు’ అని అప్పటి సంఘటనను మోదీ గుర్తుచేసుకున్నారు. ఇక ప్రధాని అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో కుటుంబంతో కాకుండా కేవలం నరేంద్ర మోదీ ఒక్కరే ఉండటం గురించి అక్షయ్ కుమార్ ప్రశ్నించారు. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘చిన్న వయసులోనే నేను కుటుంబం నుంచి బయటికి వచ్చేశాను. అప్పటి నుంచి ఒంటరిగానే జీవించడం అలవాటైపోయింది. ఒకవేళ నేను ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి కుటుంబంతో కలిసి ఉండుంటే వారిని ఇక్కడకు తీసుకొచ్చేవాడినేమో. ఇప్పుడైనా అమ్మను ఇక్కడికి తీసుకురావచ్చు. కానీ, ఆమె ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. నేను బయటికి వెళ్లి ఎప్పుడో వస్తుంటాను. నేను గడపడం చూసి అమ్మ బాధపడుతుంది. అందుకే అప్పుడప్పుడు నేనే అమ్మ దగ్గరకు వెళ్లి కనిపిస్తుంటాను’ అని వివరణ ఇచ్చారు. తాను రోజుకు నాలుగు గంటలు మాత్రమే పడుకుంటానని ప్రధాని మోదీ చెప్పారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి కలిసినప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారని అన్నారు. ఆ తర్వాత తామిద్దరం ఎప్పుడు కలిసినా… ఇంకా అన్ని గంటలు మాత్రమే పడుకుంటున్నారా? లేక నిద్ర సమయాన్ని పెంచారా? అని అడుగుతుంటారని చెప్పారు.తాను దేశంలోనే అత్యున్నత స్థాయి (ప్రధాని)కి చేరుకుంటానని కలలో కూడా అనుకోలేదని మోదీ అన్నారు. సాధారణ ప్రజలెవరూ ఈ ఆలోచన చేయలేరని చెప్పారు.   అందుకు తగ్గా నేపథ్యం ఉన్నవారే ప్రధాని కావాలనే ఆలోచన చేస్తారని అన్నారు. తనకు చిన్న ఉద్యోగం వచ్చినా ఎంతో సంతోషంతో చుట్టుపక్కల వారికి మా అమ్మ బెల్లం పంచే స్థాయి మాత్రమే ఉన్న కుటుంబం తమదని… ఎందుకంటే అంతకు మించి కనీసం ఆలోచన కూడా చేయలేని పరిస్థితి తమదని చెప్పారు. తమ గ్రామానికి వెలుపల ఏముందో కూడా తమకు తెలియదని అన్నారు.తాను ప్రధాని కావడం ఒక అసాధారణమైన విషయమని మోదీ చెప్పారు. దేశం తనను ఆదరించిందని… కీలకమైన బాధ్యతలు వాటంతట అవే వచ్చాయని అన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణానికి తన కుటుంబం ఏ విధంగా కూడా ఫిట్ కాదని చెప్పారు. దేశమంతా తనను ఎందుకు అభిమానించిందో, ఎందుకు ఇంత ఇచ్చిందో తనకు ఇప్పటికీ అర్థం కాదని అన్నారు. వాస్తవానికి తాను సన్యాసిని లేదా సైనికుడిని అవ్వాలనుకున్నానని చెప్పారు.
Tags:There are good relations with the opposition leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *