రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు

Date:21/03/2019
అనంతపురం ముచ్చట్లు:
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది సామెత. ఇది నిరూపితమైన సత్యం. తాజా ఎన్నికల్లోనూ అదే విషయాన్ని నిర్ద్వంద్వంగా చాటిచెబుతున్నారు నాయకులు. ప్రధాన పార్టీల్లో అటు ఇటు జంప్ అవుతున్నవారిని చూసి ఏదో జరిగిపోతోందని భ్రమ పడాల్సిన అవసరం లేదు. అదంతా సర్వసాధారణ తతంగమే. వ్యక్తులే కాదు, పార్టీలు సైతం ఎప్పుడు ఎవరితో జట్టుకడతారో చెప్పలేని దురవస్థ. జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రాంతీయంగానూ అదే తంతు నెలకొంటోంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరంలో ఎవరు ఏ కూటమిలో ఉంటారు? ఎవరికి ఎవరు మద్దతిచ్చే అవకాశం ఉందనే విషయాలపై కొంతమేరకు స్పష్టత వస్తోంది. పోటీ తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అధికారంలో భాగస్వాములయ్యే పార్టీలపై సస్పెన్స్ ఆసక్తి గొలుపుతోంది. టీడీపీ, వైసీపీలతోపాటు జనసేన కూడా ఏడు శాతం మేరకు ఓట్లతో పాటు పదిలోపు సీట్లను గెలుచుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. పోటాపోటీ కాంపిటీషన్ లో ఈ సీట్లు పవర్ పాలిటిక్స్ లో కీలకంగా మారుతాయి. దానిని ఎవరు అడ్వాంటేజ్ గా మలచుకోగలుగుతారనే చర్చ మొదలైంది. ఇప్పటి ఎన్నికల్లో నెలకొన్న విచిత్ర సమీకరణల్లో ఎన్నికల తర్వాత ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడాలు తప్పవంటున్నారు పరిశీలకులు.రాయలసీమలో ముఠాలు, వర్గాలు చాలా తీవ్రంగా ఉంటూ వస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ముఠాలు కట్టి వేర్వేరుగా ఉంటున్న నాయకులు ఈసారి ఎన్నికల్లో ఒకే గూట్లో కనిపించడం అసాధారణ పరిణామంగా కనిపిస్తోంది.
పాత కక్షలు, వైరాలు వదిలిపెట్టకపోతే రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని నాయకులు గ్రహించడాన్ని ప్రాప్తకాలజ్ణతగానే చెప్పుకోవాలి. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో దశాబ్దాల గొడవలను పక్కనపెట్టి వైరి నాయకులు ఒకే ప్లాట్ పారంనుంచి ప్రచారం చేయడం ముచ్చట గొలుపుతోంది. ఇందులో ఎక్కువ మంది అధికారపార్టీతో కలిసి నడవడం గమనార్హం. ముఠాలవారీ కోటాలు తెచ్చుకోవడానికే చేతులు కలిపారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే అధికారం కోసం వ్యక్తిగత శత్రుత్వాలను పక్కనపెట్టేస్తున్నారని అర్థమవుతోంది. ఇదొక అనూహ్యమైన మార్పు. కర్నూలు లో కోట్ల, కేఈ కుటుంబాలు, అనంతపురంలో పరిటాల, జేసీ కుటుంబాలు, కడపలో ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాలు, చిత్తూరులో చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాలు కలవడాన్ని కొన్ని సంవత్సరాల క్రితమైతే ఎవరూ ఊహించలేరు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఆర్థిక వనరుల సమీకరణల వంటి తాయిలాలతో వీరందరినీ తన పార్టీలోనే కట్టేసుకుని చంద్రబాబు చాణక్యం నడుపుతున్నారు. ముఠా కోటాల సభ్యులు టీడీపీ అధికారంలోకి వస్తే సరి. లేకపోతే మళ్లీ పక్క చూపులు చూసేందుకూ వెనకాడకపోవచ్చు.పోటీలో ప్రధానపార్టీలైన వైసీపీ, టీడీపీలు 85 సీట్లలోపునకు పరిమితమైతే మూడోపార్టీగా బరిలోదిగిన జనసేన సహకారాన్ని తీసుకోక తప్పని అనివార్యత ఏర్పడుతుంది. కాంగ్రెసు, బీజేపీ వంటి పార్టీలు బరిలో ఉన్నప్పటికీ ఒక్కసీటు కూడా గెలుచుకుంటాయనే నమ్మకం లేదు. దీంతో వామపక్ష, బీఎస్పీతో కూడిన జనసేన కింగ్ మేకర్ గా చక్రం తిప్పే అవకాశం లభిస్తుందనే ఆశాభావంతో ఉంది. ఉభయగోదావరి జిల్లాలు ఎటు తీర్పు చెబితే అటువైపు మొగ్గు కనిపిస్తుంది.
ఈ జిల్లాల్లో జనసేన ఎఫెక్టు ఎక్కువగా పడుతోంది. దానివల్ల టీడీపీ, వైసీపీలు రెండూ కొంతమేరకు దెబ్బతింటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో జనసేనపై పెద్దగా విమర్శలు ఎక్కుపెట్టకుండా జాగ్రత్త పడాలని రెండు పార్టీలు చూస్తున్నాయి. పవన్ కల్యాణ్ టీడీపీతో కొంతమేరకు దోస్తీ చేస్తున్నారనే అనుమానాలు వైసీపీలో ఉన్నాయి. కానీ కార్మిక కర్షక ప్రతినిధులుగా తమను తాము భావించుకునే వామపక్షాలు, ఎస్సీ వర్గాల ప్రతినిధిగా భాసించే బహుజనసమాజ్ పార్టీలు జనసేన వెంట ఉన్నాయి. అనవసర విమర్శలకు దిగితే ఆ వర్గాల నుంచి రావాల్సిన ఓటు బ్యాంకుకు గండి పడుతుందేమోననే సందేహం వైసీపీని వెనక్కి లాగుతోంది. అందుకే తాజాగా పవన్ పై విమర్శల దాడిని తగ్గించేసింది.చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిప్ట్ ఇస్తామంటూ హడావిడి చేసిన కేసీఆర్ గతకొంతకాలంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా 21 పార్టీలతో సంప్రతింపులు జరిపానని చెప్పిన కేసీఆర్ పొరుగున ఉన్న జగన్ తనతో కలుస్తున్నాడని స్వయంగా ప్రకటించలేకపోతున్నారు. కేటీఆర్ గతంలో జగన్ తో చర్చలు జరిపారు. ఒక అవగాహనకు వచ్చారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు అభయమిచ్చారు. కానీ ఏపీలో యాంటిసెంటిమెంటును చంద్రబాబునాయుడు ప్రయోగిస్తున్నారు.
అనుకున్నదొకటి అన్నట్లుగా సీన్ రివర్స్ అవుతుందేమోననే సంశయంతో జగన్ తో దూరం పాటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో తమకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని కూడా ప్రకటించారు. ఇది వ్యూహాత్మక వైముఖ్యమే తప్ప నిజమైన ఎడబాటు కాదు. జగన్ పార్టీ గెలిస్తే కేంద్రంలో టీఆర్ఎస్ బలానికి వైసీపీ బలాన్ని అదనంగా జోడించుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వీలుంటే మిగిలిన కొన్నిపార్టీలను సైతం ఒకే వేదిక మీదకు తెచ్చి కేంద్రప్రభుత్వాన్ని శాసించాలనే ఆలోచన కేసీఆర్ కు ఉంది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడం కారణంగానే ప్రస్తుతానికి తన కార్యక్షేత్రాన్ని తెలంగాణకే పరిమితం చేసుకుంటున్నారు. భవిష్యత్తు పొత్తుల ఎత్తుల్లో ఆయన కూడా కీలకం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. అందులోనూ జగన్ తోపాటు పవన్ తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
Tags:There are no permanent friends and enemies in politics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *