ఈ పప్పులుడకవ్… (నెల్లూరు)

Date:23/10/2018
నెల్లూరు ముచ్చట్లు:
రేషన్ షాపుల్లో ఇచ్చే నాణ్యత లేని కందిపప్పు తీసుకోటానికి లబ్ధిదారులు ముందుకు రావటం లేదు. సబ్సిడీపై ప్రతి కార్డుదారునికి రెండు కిలోల పప్పు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కిలో రూ.40 వంతున ప్రభుత్వం అందిస్తోంది. ఈ లెక్కన జిల్లాలో ప్రతి నెలా సుమారు 16 వేల క్వింటాళ్ల కందిపప్పు సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో ఆశించిన స్థాయిలో విక్రయించలేని పరిస్థితి ఉంది. అప్పుగా మొదటి నెల ఇస్తామని చెబుతున్నా డీలర్లు కూడా ముందుకు రావటం లేదు. రేషన్‌ దుకాణం పరిధిలో ఉన్న కార్డుల్లో కనీసం 30 శాతం మంది కూడా పప్పు తీసుకోవటం లేదని డీలర్లు చెబుతున్నారు. నిర్దేశిత సరకులో కేవలం 30 శాతం మాత్రమే అతి కష్టం మీద విక్రయిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1,896 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. సుమారు 8.66 లక్షల తెల్ల రేషన్‌ కార్డులకు ప్రతి నెలా సబ్సిడీ ద్వారా రేషన్‌ అందిస్తున్నారు. ప్రధానంగా బియ్యం మాత్రమే తీసుకుంటున్నారు. కందిపప్పును ఒత్తిడి చేసి రేషన్‌ డీలర్లు కొనిపిస్తున్నా.. తర్వాతి నెల వచ్చేప్పటికి వద్దని తిరస్కరిస్తున్నారు.  ఇలా కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎలాగైనా కందిపప్పు కొనిపించాలని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వస్తోంది.
రేషన్‌ డీలర్లు నిర్దేశిత మొత్తాన్ని డీడీ రూపేణ చెల్లిస్తేనే సరకు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సరఫరా చేస్తారు. మిగిలిన వాటి విషయంలో పక్కాగా పాటిస్తున్నా.. కంది పప్పు దగ్గరకు వచ్చేప్పటికి అప్పుగా ఇవ్వటానికి కూడా అధికారులు సడలింపు ఇవ్వటం గమనార్హం. మొదటి నెల సరకు అప్పుగా ఇస్తే.. తర్వాతి నెలలో చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇలా చెబుతున్నా రేషన్‌ డీలర్లు ముందుకు రావటం లేదు. జిల్లాలో 16,548 క్వింటాళ్ల కంది పప్పు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో సిద్ధంగా ఉంచితే.. అందులో 650 క్వింటాళ్లను మాత్రమే డీలర్లు తీసుకుంటున్నారు. అంటే సుమారు 16 వేల క్వింటాళ్లు నిల్వ ఉంటున్నాయి. రేషన్‌ దుకాణాల ద్వారా ఇచ్చే కందిపప్పు నాణ్యత కూడా సరిగా లేదని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సరిగా ఉడకటం లేదని చెబుతున్నారు.
Tags:These pappadukkav … (Nellore)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *