ముప్పేట దాడి చేస్తున్న నిపా వైరస్

Date:22/05/2018
తిరువనంతపురం ముచ్చట్లు:
నిపా వైర్‌స కేరళపై ముప్పేట దాడి చేస్తోంది. అంతుచిక్కని ఈ వైరస్‌ బారిన పడి కేరళలో ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇదే కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులందరికీ ఐసీయూల్లో చికిత్సలు అందిస్తున్నారు. కేరళలో మొదలైన  నిపా కలవరం చూసి దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  అయితే నిపా వైరస్‌ కొత్తదేం కాదు. కానీ ఒకరి నుంచి మరొకరికి ఇది చాలా వేగంగా విస్తరిస్తుంది, పైగా సోకితే మరణావకాశాలు చాలా ఎక్కువ. కేరళలో కూడా ఉన్నట్టుండి ముగ్గురు దీని కారణంగా మృత్యువాత పడటం, వీరిలో ఒక నర్సు కూడా ఉండటంతో ప్రజల్లో భయాందోళనలు రేగుతున్నాయి. నిపా వైరస్‌ కొంత అరుదైనదేగానీ మరీ అంత కొత్తదేం కాదు. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది. జంతువులకూ, మనుషులకు కూడా జబ్బు తెచ్చిపెడుతుంది. మనుషుల్లోనైతే ప్రాణాంతకమనే చెప్పుకోవాలి. అందుకే కేరళ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది.నిపా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడంతో ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళలోని కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో 23 మంది నిపా వైరస్‌ బాధితులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల కిందట వీరంతా జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధమైన సమస్యలతో ఆస్పత్రులకు వచ్చారు. కొందరిలో మెదడువాపు లక్షణాలు కనిపించాయి. వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు.తొలిసారిగా నిపా వైర్‌సను 1998లో మలేసియాలో కనుగొన్నారు. అప్పట్లో మలేసియాలో 105 మంది ఈ వ్యాధితో మృతి చెందారు. ఆ తర్వాత సింగపూర్‌లోనూ ఈ వైర్‌సను కనుగొన్నారు. పందులను పెంచే పశుపోషకులు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందారు. మలేసియాలోని నిపా ప్రాంతానికి చెందిన రోగుల నుంచి తొలిసారిగా ఈ వైర్‌సను కనుగొనడంతో దీన్ని నిపా వైర్‌సగా నామకరణం చేశారు. 2004లో బంగ్లాదేశ్‌లో కూడా ఈ వైరస్‌ ప్రబలి, మరణాలు సంభవించాయి. పశ్చిమ బెంగాల్‌లోని రెండు జిల్లాల్లో ఈ వైరస్‌ వెలుగుచూసింది. నిపా వైరస్‌ బారిన పడిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. వ్యాధి లక్షణాలు 3-14 రోజుల వరకు ఉంటాయి. జ్వరం, తలనొప్పి, మగత, మానసిక సంతులనం తగ్గడం, శ్వాసకోశ ఇబ్బందులు, ఎన్‌సెఫలైటిస్‌, మయోకార్డైటిస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. దీని నివారణకు వ్యాక్సిన్‌ లేదు. గబ్బిలం, పందులు, కోతి, పిల్లి వంటివి ఈ వైర్‌సకు వాహకాలుగా పనిచేస్తాయి.ఈ ప్రాణాంతక వైరస్‌ ఆందోళన కలిగించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే కేరళకు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ట్వీట్‌ చేశారు. అధికారులను అప్రమత్తం చేసినట్టు కేరళ సీఎం కార్యాలయం తెలిపింది.దక్షిణ భారతదేశంలో ఎప్పుడూ వెలుగులోకి రాని నిపా వైరస్‌ కేరళలో విజృంభిస్తుండటంతో పొరుగు రాష్ర్టాలైన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అప్రమత్తమయ్యాయి. కేరళలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. నిపా వైరస్‌ దాదాపు స్వైన్‌ఫ్లూ లక్షణాలను పోలి ఉంటుంది. వేసవిలో తెలుగు రాష్ర్టాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవడం సాధారణంగా మారింది. దీంతో నిపా వైరస్‌ పరీక్షల ఆవశ్యకతపై అవి దృష్టి సారించాయి.
Tags; Thirty attack virus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *