తిరుమలలో ఘనంగా కార్తీక వనభోజన మహోత్సవం

Date:17/11/2019

తిరుపతి ముచ్చట్లు:

పవిత్ర కార్తీకమాసంలో నిర్వహించే కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారంనాడు తిరుమల పార్వేట మండపంలో అత్యంత వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేటి మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేటి మండపంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం పార్వేట మండపం వ‌ద్ద‌ మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో ఆదివారంనాడు కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో వేలాదిమంది భక్తులు పాల్గొని రుచికరమైన అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు పలు అన్నమయ్య సంకీర్తనలను వీనులవిందుగా ఆలపించారు. అనంత‌రం హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, డెప్యూటీ ఈవో నాగ‌ర‌త్న‌, విజివో  మ‌నోహ‌ర్‌, ఇత‌ర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం

 

Tags:Thirumala is a glorious kartika banana extravaganza

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *