212 రోజులు సముద్రంలో ఈ ఒక్కడు

This is one of the 212 days in the sea
 Date:30/01/2019
ముంబై ముచ్చట్లు:
సముద్రంలో ప్రయాణమంటే సాధారణ విషయం కాదు.. అక్కడ భూమి మీద కంటే విభిన్న వాతావరణం ఉంటుంది. ఎప్పుడు సుడిగాలులు చుట్టుముడతాయో.. ఎప్పుడు తుఫాన్లు వెంటాడతాయో చెప్పలేని పరిస్థితి. అంతేకాదు, నడి నెత్తిన సూరీడు ఒక పక్క పొడుస్తుంటే.. మరోపక్క ఉప్పుగాలి ముప్పు తిప్పలు పెడుతుంది. అలాంటి సముద్రంలో 200 రోజులు.. ఒంటరిగా ప్రయాణమంటే జీవితంపై ఆశలు వదిలేసుకోవల్సిందే. పైగా, ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా ప్రయాణించడమంటే సవాళ్లతో కూడుకున్నది. అయితే, ఫ్రాన్స్‌కు చెందిన జీన్ లుక్‌ వాన్ డెన్ హీడి అనే 73 ఏళ్ల నావికుడు ఆ సాహసాన్ని విజయవంతంగా పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రౌండ్ ద వరల్డ్ రేస్’లో భాగంగా జులై 2018న 19 మంది నావికులు ఒంటరిగా సముద్రయానానికి బయల్దేరారు. ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం షార్ట్ వేవ్ రేడియో, పేపర్ మ్యాప్‌తో మాత్రమే ప్రయాణించాలనేది ఈ పోటీ నియమం. అంటే దాదాపు కళ్లు మూసుకుని ప్రయాణించడం కిందే లెక్క. పైగా షార్ట్ వేవ్ రేడియో అప్పుడప్పుడు మాత్రమే పనిచేస్తుంది. నావిగేషన్ వ్యవస్థ లేకుండా పేపర్ మ్యాప్ ద్వారా తీరానికి చేరడం మరింత కష్టం. హీడి ఈ ప్రతికూల పరిస్థితులన్నీ ఎదుర్కొని 212 రోజుల్లోనే ప్రపంచాన్ని చుట్టి గమ్యానికి చేరుకున్నాడు. మంగళవారం పశ్చిమ ఫ్రాన్స్‌లోని లెస్ సబ్లెస్ డివోలొన్నె ప్రాంతానికి చేరుకుని ఈ పోటీలో విజేతగా నిలిచాడు. మొత్తం 48,280 కిలోమీటర్లు ప్రయాణించాడు.
ఈ పోటీలో 19 మంది నావికులు పాల్గొగా.. హీడితో కలిపి ఐదుగురు మాత్రమే గమ్యానికి చేరారు. మరో 14 మంది ఇంకా సముద్రంలోనే ప్రయాణిస్తున్నారు. ‘‘నవంబరు నెలలో సముద్రంలో తీవ్ర తుఫాన్‌లో చిక్కుకున్నా. దీనివల్ల బోటు తెరచాపకు ఉండే పైభాగం (మాస్ట్) తీవ్రంగా దెబ్బతింది. దీంతో నేను పోటీలో గెలవడం కష్టమనుకున్నా. ఎంతో కష్టం మీద పైకెక్కి దాన్ని బాగుచేసి, రేసు కొనసాగించా. ఈ వయస్సులో తెరచాప కర్రను పట్టుకుని పైకి ఎక్కడం చాలా కష్టమైన పని. దాదాపు ఏడుసార్లు ప్రయత్నించా. చివరి ప్రయత్నంలో పైవరకు చేరి తెరచాపను సరిచేయగలిగాను’’ అని తనకు ఎదురైన అనుభవాన్ని హిడీ గుర్తుచేసుకున్నాడు. ఏది ఏమైనా.. అంత లేటు వయస్సులో తెరచాప బోటులో ప్రపంచాన్ని చుట్టిరావడం నిజంగా గ్రేటే కదూ!!
Tags:This is one of the 212 days in the sea

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *