ఇది దళారీ పథకం (మహబూబ్ నగర్)

This is the scheme of Dalit (Mahabubnagar)

This is the scheme of Dalit (Mahabubnagar)

Date:15/09/2018
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ప్రభుత్వం గొల్లకురుమల స్వయం ఉపాధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పథకానికి దళారుల చీడ పట్టుకుంది. వీరి ధందాకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులే అక్రమాలకు వంత పాడుతుండటంతో లబ్ధిదారులు, దళారుల పని సులువు అవుతోంది. జిల్లాలో గొల్లకురుమల ఉపాధి సంగతి దేవుడెరుగు.. పథకం అమల్లో భాగస్వాములవుతున్న కొందరు అధికారులు మాత్రం అదాయానికి మించిన ఆస్తులు ఈ ఏడాది కాలంలోనే కూడబెట్టినట్లు తెలుస్తోంది.
జిల్లాలో ఇప్పటివరకు పంపిణీ చేసిన గొర్రెల యూనిట్లలో అధికారుల లెక్కల ప్రకారమే 40 శాతం యూనిట్లు కనిపించటం లేదు.ఉన్నతాధికారుల తనిఖీల సమయంలో కొందరు లబ్ధిదారులు ఇతరుల యూనిట్లు తమవే అన్నట్లు చూపిస్తున్నారని  సమాచారం. గొర్రెలు పంపిణీ చేసిన తర్వాత తిరిగి వాటిని లబ్ధిదారులు పెంచుకుంటున్నారా.. లేదా అమ్ముకొంటున్నారా అన్నదానిపై ఒక్క అధికారి కూడా పూర్తిస్థాయి తనిఖీ చేసిన పాపాన పోలేదు.
దళారుల దంధాకు, వారితో కుమ్మక్కైన అధికారులకు ఇదే వరంలా మారింది. గొర్రెల యూనిట్ల కొనుగోలు సమయంలో లబ్ధిదారులు సంఘం ప్రతినిధులు మొదలుకొని అధికారుల వరకు ముడుపులు చెల్లించడం తప్పనిసరిగా మారింది. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు.. గొర్రెల కొనుగోలు కోసం కడప, అనంతపురం జిల్లాల పరిధిలో మూఠాలుగా ఏర్పడిన దళారులను ఆశ్రయిస్తున్నారు.
వీరు చూపించినవాటినే అధికారులు తమను ఒప్పించి కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దళారులు చూపించిన గొర్రెలను అధికారులు, లబ్ధిదారులు కిమ్మనకుండా కొనుగోలు చేస్తున్నందుకుగాను భారీగా ముడుపులు చేతులు మారుతున్నట్టు సమాచారం.
ఈ తతంగమంతా ఇటీవలే బయటపడింది. అలంపూరు నియోజకవర్గ లబ్ధిదారులు కొందరు గొర్రెల కొనుగోలు కోసం కడప జిల్లాకు వెళ్లగా.. వారి కళ్లెదుటే ఆరోగ్యంగా లేని గొర్రెల కొనుగోలు కోసం ఒప్పందాలు చేసుకుంటున్న వైనం గమనించి వారు ఎదురుతిరిగినట్లు సమాచారం.
ఇక కర్ణాటకలోని రాయచూరు కేంద్రంగా పనిచేస్తున్న గొర్రెల కొనుగోలు మూఠా ధరూరు, కేటీదొడ్డితోపాటు పలు మండలాల పరిధిలో దళారులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా అధికారుల అండతో లబ్ధిదారుల వద్ద ఉన్న గొర్రెలను రాత్రికి రాత్రే కొనుగోలు చేయటం.. మేత కోసం అన్నట్లుగా లబ్ధిదారుల ద్వారానే సరిహద్దు దాటించటం, అక్కడి నుంచి రాయచూరుకు తరలించటం చేస్తున్నారు.
గొర్రెల పథకంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని మొదటివిడత అమల్లో చురుగ్గా వ్యవహరించిన ఒకరిద్దరు అధికారులు ఏడాదికాలంలోనే రూ. కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం. తెలంగాణలో ఆస్తులు కొనుగోలు చేస్తే ఏసీబీ కన్ను పడుతుందనే భయంతో వీరు కర్నూలు కేంద్రంగా భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సొంత శాఖలోనే కిందిస్థాయి ఉద్యోగుల నుంచి వినవస్తోంది.
ఇపుడు రెండోవిడతలోనూ ఓ అధికారి పాత పద్ధతిని ఇప్పటికే మళ్లీ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలాంటి కొందరు అధికారులపై ప్రాథమిక సమాచారంతో ఏసీబీ కన్నేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
Tags:This is the scheme of Dalit (Mahabubnagar)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *