వరల్డ్ కప్ టీమ్ ఇదే

This is the World Cup Team
Date:15/04/2019
ముంబై ముచ్చట్లు :
ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రారంభంకానున్న ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత సెలక్టర్లు ఈరోజు జట్టుని ప్రకటించారు. గత ఆరునెలలుగా భారత క్రికెటర్ల ఆటతీరుని నిశితంగా పరిశీలించిన సెలక్టర్లు.. అనుభవం, ప్రదర్శన ఆధారంగా 15 మందితో కూడిన టీమ్‌ని ఎంపిక చేశారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రితో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ టీమ్‌ని ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచకప్ కోసం జట్టుని ప్రకటించే గడువు ఈ నెల 23 వరకూ ఐసీసీ ఇచ్చింది. కానీ వారం ముందే భారత్ ప్రకటించడం విశేషం. గడువులోపు ఐసీసీ అనుమతి లేకుండానే జట్టులో మార్పులు చేసుకునే సౌలభ్యం ఉంది. విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ (మూడో ఓపెనర్), విజయ్ శంకర్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (రెండో వికెట్ కీపర్), చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ ప్రపంచకప్ షెడ్యూల్‌లో భాగంగా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్ జట్టు.. ఆ తర్వాత 9న ఆస్ట్రేలియాతో, 13న న్యూజిలాండ్‌తో, 16న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఢీకొట్టనుంది.
అయితే.. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ.. కొంత మంది భారత మాజీ క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడి వారిని ఓడించి అమర జవాన్లకి ఘనమైన నివాళి ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ పాక్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరిస్తే.. అప్పుడు పాక్‌ను విజేతగా ప్రకటించి వారికి రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఇప్పటి వరకూ ప్రపంచకప్‌లో ఒక్కసారి కూడా పాక్ చేతిలో భారత్ ఓడిపోలేదు. 1983లో కపిల్‌దేవ్ కెప్టెన్సీలో తొలిసారి ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టు.. ఆ తర్వాత 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2011లో రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సిక్స్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తిచేసిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే..!! ఇంగ్లాండ్‌లోని కఠిన పిచ్‌లపై ప్రపంచకప్ జరగనుండటంతో.. అనుభవానికే సెలక్టర్లు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ ఛాన్స్ దక్కించుకోగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లి ఆడనున్నాడు.
Tags:This is the World Cup Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *