ఆ ఆరుగురు… డిప్యూటీపై కన్ను

హైదరాబాద్ ముచ్చట్లు:

 

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 64 సీట్లు సాధించి అధికార పగ్గాలు చేపట్టనుంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో తెలనుంది. ఈరోజే ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే సీఎం రేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం రేసులో కూడా ఏకంగా ఆరుగురు నేతల మధ్య పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారిగా డిప్యూటీ సీఎంలను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఖరారైన తర్వాతే డిప్యూటీ సీఎంను ఎంపిక చేయనున్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ఏక వాఖ్య తీర్మానం చేశారు. అనంతంరం ఈ తీర్మానాన్ని తుమ్మల నాగేశ్వర్‌ రావు బలపరిచారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏఐసీసీ నిర్ణయమే ఫైనల్ కానుంది. అయితే డిప్యూటీ సీఎం రేసులో ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, వరంగల్‌ నుంచి సీతక్క, నల్గొండ నుంచి ఉత్తమ్, కరీనంగర్ నుంచి పొన్నం ప్రభాకర్, మెదక్ నుంచి దామోజర రాజనర్సింహ, నల్గొండ నుంచి అద్దంకి దయాకర్‌ రేసులో ఉన్నారు.

భట్టి విక్రమార్క
భట్టి విక్రమార్క అంటే రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. బలమైన నేతగా కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. మాదిక సామాజిక వర్గానికి చెందిన ఈయన ఒకసారి ఎమ్మెల్సీతో పాటు.. నాలుగోసారి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో ఈయనకు చీఫ్‌ విప్, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గత శాసనసభలో సీఎల్పీ నేతగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా భట్టి పాదయాత్ర చేసి ప్రజల నుంచి మంచి ఆధరణ పొందారు. ప్రస్తుతం సీఎం రేసులోనూ ఉన్నారు. అలాగే ఈయన పార్టీకి విధేయుడు కావడంతో సీనియర్ల మద్దతు కూడా ఉంది. అందుకే ఈయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈయన కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరుగని నేతగా బలమైన నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. 2018లో ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఎంపీగా కొనసాగారు. ఈయన కూడా పార్టీకి విధేయుడుగ పేరు తెచ్చున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఫ్యామిలీకి సన్నిహితుడు. ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటే ఉత్తమ్‌కు ఈ పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది.
సీతక్క
సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో మంచి ఫాలోయింగ్ ఉంది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీతక్క రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు. గతంలో మావోయిస్టుగా పని చేశారు. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డికి హోం మంత్రి పదవి అప్పగించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. దీంతో రేవంత్ కు ప్రధాన అనుచరురాలైన సీతక్కకు హోం మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న విశ్లేషణ జోరుగా సాగుతోంది.

 

పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఉద్యమకారుడిగా పొన్నం ప్రభాకర్‌కు మంచి పేరుంది. గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. బలమైన బీసీ నేతగా పేరు సంపాదించుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు ఈయన పార్టీకి విధేయుడు. మరో కీలక నేత మధుయాస్కి గౌడ్ ఓడిపోవడంతో పొన్నంకు లైన్ క్లీయర్ అయ్యిందన్న చర్చ ఉంది. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటే.. పొన్నం ప్రభాకర్‌కు ఈ పదవి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
దామోదర్ రాజనరసింహ
కేసీఆర్ సొంత జిల్లా అయినా ఉమ్మడి మెదక్‌లో అందోలు నియోజకవర్గం నుంచి దామోదర్ రాజనరసింహ గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈయనకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉంది. అధిష్ఠానం నుంచి ఈయనకు మంచి పలుకుబడి ఉంది. ఈసారి ఎన్నికల్లో దామోదర్… పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు కూడా మార్పించారంటే హైకమాండ్‌ వద్ద ఈయనకు ఎంత పలుకుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయనకు మరో సారి డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఒక వేళ ఈ పదవి మిస్ అయ్యే స్పీకర్ పోస్టుకు కూడా దామోదర్ పేరును పరిశీలించే అవకాశం ఉంది.
అద్దంకి దయాకర్

 

ఈసారి జరిగిన ఎన్నికల్లో పోటీ చేయని అద్దంకి దయాకర్‌కు కూడా రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్న నేత. అంబేద్కరిస్టుగా పేరు సంపాదించుకున్న ఈయన సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 2014 నుంచి అద్దంకి దయాకర్‌ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. అలాగే పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాడు. అంతేకాదు అధిష్ఠానం నిర్ణయాన్ని ఏకీభవించి పోటీ నుంచి తప్పుకుని పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడ్డారు. పోటీ నుంచి తప్పుకున్న నాటి నుంచి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దయాకర్ కు మంచి పదవి దక్కుతుందన్న ప్రచారం సాగింది. సీఎం కాబోతున్న రేవంత్ కు నమ్మకస్తుడైన దయాకర్ కు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం పోస్టు దక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

 

Tags: Those six… eyes on the deputy

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *