ముగ్గురూ… ముగ్గురే

-తెలంగాణలో ఆసక్తకరంగా రాజకీయం

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

చాలాకాలంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసును విమర్శించడం మానేసింది. బలహీనపడిన పార్టీతో తలపడుతుంటే తనకే అవమానంగా భావించింది. పైపెచ్చు మరోవైపు బీజేపీ విజృంభించడం మొదలు పెట్టింది. దీంతో ముఖాముఖి పోరు బీజేపీ, టీఆర్ఎస్ ల మధ్యనే అన్న రాజకీయ భావన వ్యాపించింది. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చే అంశమే. మోడీ కరిష్మా, మత పరమైన అజెండా కలగలిసి సున్నితమైన సమయాల్లో తీవ్రమైన ప్రబావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అది కమలం పార్టీకి పొలిటికల్ గెయిన్ గా మారుతుంది. కాంగ్రెసుతో అటువంటి పరిస్థితి తలెత్తదు. ఆ పార్టీ సెన్సిటివ్ అజెండాను తలపైకి ఎత్తుకోదు. అందువల్ల సులభంగానే తిప్పికొట్టవచ్చు. అందుకే కాంగ్రెసు పార్టీయే రాష్ట్రంలో తనకు ప్రదాన ప్రత్యర్థిగా ఉండాలని టీఆర్ఎస్ కోరుకుంటోంది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ కొరత తీరుతున్నట్లే కనిపిస్తోంది.తిట్టడానికైనా, కొట్టడానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. కాంగ్రెసు పార్టీని తిట్టడంలో తొలి నాళ్ల నాటి ఉత్సాహం టీఆర్ఎస్ లో లోపించింది. బీజేపీని తిడితే ఆ పార్టీ రోజురోజుకీ పెరిగిపోతుంది. ప్రధాన ప్రత్యర్థిగా ఆవిర్భవిస్తుంది. ఈ డైలమాలో అధికార పార్టీ చాలా కాలంగా తెలంగాణలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

 

 

 

 

దీనిని సాకుగా చేసుకుని కీలక నేతలు , ఎంపీలు బండి సంజయ్ , అరవింద్ వంటివారు రెచ్చగొడుతున్నారు. దారుణమైన పదజాలంతో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఆయా విమర్శలకు కేసీఆర్ స్పందించలేదు. కేటీఆర్, హరీశ్ వంటి వారే బదులిచ్చారు. ముఖ్యమంత్రి స్పందిస్తే బీజేపీకి అనవసర ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందనే ఉద్దేశంతోనే మౌనం వహించారు. రేవంత్ రాక తో కాక పెరిగింది. ఆయన కూడా ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తున్నారు. పీసీసీకి జోష్ వచ్చింది కాబట్టి కాంగ్రెసును తిట్టడానికి టీఆర్ఎస్ కు కూడా చాన్సు వచ్చింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షునిపై ఓటుకు నోటు కేసు వంటి ఆరోపణలున్నాయి. పైపెచ్చు చంద్రబాబుకు సన్నిహితుడనే విమర్శలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఎంత పోరాటం చేసినా టీఆర్ఎస్ కు దీటుగా పార్టీని నిలబెట్లలేడనే ధీమా అధికార పార్టీలో కనిపిస్తోంది. కమలం పార్టీని కంట్రోల్ చేయడానికి పీసీసీ నేతపై బాణాలు ఎక్కుపెడితే సరిపోతుందని బావిస్తోంది. తద్వారా పోటీ కాంగ్రెసు, టీఆర్ఎస్ ల మధ్యే అన్న భావనను ఉద్ధృతం చేయవచ్చని భావిస్తున్నారు.ఏదేమైనా గడచిన కొన్ని రోజులుగా బీజేపీ జోరు తగ్గింది. ఇందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి హుజూరాబాద్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈటల రాక వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ను పటిష్ఠం చేసుకోవాలని కమల నాథులు భావిస్తున్నారు.

 

 

 

 

 

తెలివిగా టీఆర్ఎస్ ను రెచ్చగొట్టకుండా తమ పని తాము చేసుకుపోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ పాదయాత్రలో జిల్లాల వారీ అంశాల ద్వారా పకడ్బందీగా దాడి చేయాలనేది మరో ఆలోచన. అందుకే కొత్త పీసీసీ నేత నియామకం తర్వాత బీజేపీ దూకుడు తగ్గించింది. కేసీఆర్ ను వ్యక్తిగతంగా తీవ్రంగా దూషించే రేవంత్ కారణంగా పీసీసీ డ్యామేజ్ కావడం ఖాయమని కమలం పార్టీ అగ్రనాయకులు సైతం అంచనా వేస్తున్నారు. ఓటుకు నోటు కేసు విచారణ క్రమేపీ కీలక దశకు చేరుకుంటోంది. టీఆర్ఎస్ , కాంగ్రెసులను కలిసి కట్టుగా లక్ష్యం చేసుకోవాలనేది బీజేపీ యోచన. ఇద్దరు ప్రత్యర్థులతో పోరాడుతున్న భావనను ప్రజల్లోకి పంపాలనుకుంటున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ మూడు పార్టీలకు కీలకంగా మారింది. అక్కడ ఓటమి ఎదురైతే టీఆర్ఎస్ కు సవాల్ విసరడమనేది బీజేపీకి సాధ్యం కాదు. బలమైన అభ్యర్థి ఉండి కూడా గెయిన్ చేయలేకపోతే పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ప్రజల్లో విశ్వాసం సడలిపోతుంది. 2019 ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ లాభపడింది. దానిని కాపాడుకోవడానికి కొత్త ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.2018లో కాంగ్రెసు, టీడీపీ పొత్తు రాష్ట్రంలో వికటించింది. నిజానికి అప్పట్నుంచే నైతికంగా తెలంగాణలో కాంగ్రెసు పతనం ప్రారంభమైందని చెప్పాలి.

 

 

 

 

కార్యకర్తల్లోనూ, ,ద్వితీయ శ్రేణి నాయకత్వంలోనూ కాంగ్రెసు ఇక అధికారంలోకి రాదనే అపనమ్మకం ఏర్పడిపోయింది. సైకిల్ తో పొత్తు వద్దని అనేకమంది మొరపెట్టుకున్నా అధిష్ఠానం లెక్క చేయలేదు. గతంలో తెలంగాణలో టీడీపీకి గట్టి ఓటు బ్యాంకు ఉండేది. అది చెల్లాచెదురై పోయింది. టీఆర్ఎస్ బాగా లాభపడింది. బీజేపీ కూడా కొంత వరకూ గుంజుకుంది. కాంగ్రెసుకు రేవంత్; సీతక్క వంటి వారు మినహా పెద్దగా క్యాడర్ వచ్చి పడినది లేదు. కానీ టీడీపీ కార్యకర్తల్లో ఇంకా రేవంత్ పట్ట సానుకూలత ఉంది. హుజూరాబాద్ లో మంచి ఫలితం సాధించాలనేది పీసీసీ నేత తక్షణ లక్ష్యం. మాజీ టీడీపీ నాయకుడు పెద్ది రెడ్డి వంటివారు బీజేపీ పట్ల విసుగుతో కాంగ్రెసుకు సహకరించవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో కాంగ్రెసు, టీడీపీ పొత్తు రివర్ష్ అయినప్పటికీ ఇప్పుడు లాభించే సూచనలున్నాయని రాజకీయ పరిశీలకులు బావిస్తున్నారు. కానీ బహిరంగంగా చెట్టపట్టాలు వేసుకునే సాహసం చేయకపోవచ్చు. ఏం జరిగినా తనకు అనుకూలంగా మలచుకోగల నేర్పు కేసీఆర్ కు ఉంది. జోరు మీదున్న బీజేపీ ‘బండి’కి రేవంత్ ను అడ్డు గోడగా పెట్టి తాను అనుకున్నది సాధించే అవకాశం చిక్కింది. టీఆర్ఎస్ కు పీసీసీ అధ్యక్షుడి రూపంలో ప్రియమైన శత్రువు లభించాడు.

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags: Three … three

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *