కడప ముచ్చట్లు:
కడప జిల్లా పత్తూరు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కోసం అడవిలోకి చొరబడుతున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్సు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్సు ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ. శ్రీనివాస్ అధ్వర్యంలో ఆర్ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఐలు కే.సురేష్ బాబు, విష్ణువర్ధన్ కుమార్ టీమ్ లు ఆదివారం తెల్లవారు జామున కడప జిల్లా ప్రొద్దటూరు రేంజి లోని పత్తూరు అటవీ పరిధిలో కూంబింగ్ చేసుకుంటూ వెళ్లారు. వీరు నాగేశ్వర కోన చేరుకునే సరికి అక్కడ అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారు. వారిని చుట్టుముట్టగా పారిపోయే ప్రయత్నం చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని, విచారించగా వీరి వద్ద రెండు పిడిలేని ఇనుప గొడ్డళ్లు లభించాయి. వీరిని ప్రశ్నించగా ఎర్రచందనం కోసం అడవుల్లోకి వెళుతున్నట్లు అంగీకరించారు. వీరిని తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. వీరిని తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషనుకు తరలించి కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్సు సీఐ ఎం.సురేష్ కుమార్ విచారించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Tags;Three arrested for trespassing into the forest for red sandalwood