సిక్కోలులో మూడు గొడవలు…ఆరు గ్రూపులు

శ్రీకాకుళం ముచ్చట్లు:

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. 2019 ఎన్నికల్లో జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 చోట్ల వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం కేబినెట్‌లో ఇద్దరు మంత్రులతోపాటు అసెంబ్లీ స్పీకర్‌ కూడా ఇక్కడి వారే. ఈ మూడేళ్ల కాలంలో జిల్లా వైసీపీ నేతలకు మరిన్ని కీలక పదవులు లభించాయి. అధికారపార్టీ ఇచ్చిన ప్రాధాన్యంతో నేతలంతా ఫుల్ హ్యాపీస్‌. వచ్చే ఎన్నికల్లో జిల్లాను క్లీన్‌ స్వీప్‌ చేస్తారని పార్టీ పెద్దలు ఆశిస్తుంటే.. ఎమ్మెల్యేల తీరు మాత్రం రివర్స్‌. నియోజకవర్గాల్లో పొలిటికల్ సీన్లూ మారిపోతున్నాయ్‌. నిన్న మొన్నటి వరకు ఎలక్షన్‌ టు ఎలక్షన్‌ రాజకీయాలు నడిస్తే.. ఇప్పుడు ప్రతి చిన్న అంశాన్నీ పెద్ద సమస్యగా చిత్రీకరిస్తున్నారు. అందులోనే రాజకీయ లబ్ధి ఆశించే వర్గాలు పెరిగిపోయాయి.శ్రీకాకుళం అసెంబ్లీని మినహాయిస్తే.. వైసీపీ గెలిచిన మిగిలిన నియోజకవర్గాల్లో వందశాతం గ్రూపు రాజకీయాలు వాడీవేడీగా ఉన్నాయి.

 

 

 

అసంతృప్తులను.. అసమ్మతి నేతలను సెట్‌ చేయడంలో ఎమ్మెల్యేలు.. అక్కడి పార్టీ నేతలు చేతులు ఎత్తేయడం కేడర్‌ను కలవరపెడుతోందట. గత ఎన్నికల్లో వైసీపీకి చిక్కని ఇచ్ఛాపురం, టెక్కలిలో అయితే వైసీపీ మూడు గ్రూపులుగా చీలిపోయింది. స్పీకర్‌ తమ్మినేని సీతారాం గెలిచిన ఆమదాలవలసలోనూ మూడు గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఉన్నచోట వారితో విభేదిస్తూ.. రోడ్డెక్కి మాట్లాడేస్తున్నారు నాయకులు. ఎచ్చెర్ల, పాతపట్నం, నరసన్నపేట, పలాసల్లో ఏకంగా ప్రెస్‌మీట్లే పెట్టేశారు. కీలకమైన నాలుగు నియోజకవర్గాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరడం.. ఒకరినొకరు హేళనగా మాట్లాడుకోవడంతో పార్టీ బలహీన పడుతోందని అధిష్ఠానం గుర్తించిందట.మంత్రి సీదిరి అప్పలరాజు గెలిచిన పలాస, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ ఎమ్మెల్యేగా ఉన్న నరసన్నపేటలో రెబల్స్‌ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నారు. ఇంత వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ రెండుచోట్లా.. పార్టీ ప్లీనరీల వేదికగా అసంతృప్తి బయటపడింది. పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాటలను పార్టీ నేతలు లెక్క చేయడం లేదట.

 

 

 

అక్కడ పార్టీ కార్యక్రమాలు బోసిపోతున్నాయని పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పార్టీ నేత పేరాడ తిలక్‌లకు పడటం లేదు. మధ్యలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి టెక్కలిలో పాగా వేయడానికి చూస్తున్నారు. పాతపట్నం, నరసన్నపేట, పలాసల్లో వైసీపీ తాజా పరిస్థితి.. ఎమ్మెల్యేల పనితీరులపై ఒక నివేదిక పార్టీ పెద్దలకు చేరిందట. ఆ సర్వే ఆధారంగా చర్యలు ఉంటాయని చర్చ జరుగుతోంది.నియోజకవర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని.. వర్గపోరును.. తీవ్రత.. అతి తీవ్రత అని లెక్కలు కట్టడానికి.. కొలమానాలు కూడా సరిపోవడం లేదని కొందరు వైసీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారట. రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారాలు, ఇసుక తదితర ఆదాయ మార్గాలు.. విభేదాలకు దారితీసి.. పార్టీ నేతల మధ్య గ్యాప్‌ తీసుకొచ్చాయట. లెక్కలు తేడా కొట్టి ఒకరినొకరు శత్రువులుగా చూసుకుంటున్నారట. ఎన్నికల మూడ్‌ క్రమేపీ బలపడుతున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా వైసీపీలో నెలకొన్న విభేదాలను సెట్‌ చేయకపోతే మొదటికే మోసం రావొచ్చని హెచ్చరిస్తున్నారట. మా ఎమ్మెల్యే ఓడిపోతే ఓడిపోవచ్చు.. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ సర్కారే వస్తుందని అసమ్మతి నేతలు చేస్తున్న ప్రకటనలు గుబులు రేపుతున్నాయట. మరి.. ఈ సమస్య శ్రుతిమించకుండా పార్టీ పెద్దలు ఎలాంటి మంత్రం వేస్తారో చూడాలి.

 

Tags: Three fights in sickos…six groups

Leave A Reply

Your email address will not be published.