మూడు గలభాలు..ఆరు వాయిదాలతో శాసనసభ

Date:15/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం’ అన్నట్టు ఏ చట్టసభ పనితీరు చూసినా ఏమున్నది చెప్పుకునేందుకు? మూడు గలభాలు, ఆరు వాయిదా లు తప్ప… ప్రజాసమస్యలు గాలికి, ప్రజల ఈతిబాధలు నీటిమీద రాతలుగా మారి సామాన్యుడు ఎందుకీ చట్టసభలు అనే స్థితిలో కొనసాగుతున్నాయి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఏ పార్టీ పాలకపక్షంలో ఉన్నా అదే తీరు… అదే హోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము చేసిన గందరగోళాన్ని అధికారంలోకి వచ్చేసరికి సదరుపార్టీ మరిచి నీతులు వల్లిస్తుంది. గతంలో మన్‌మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో ముప్పుతిప్పలు పెట్టిన బీజేపీ నేడు నీతులు చెబుతోంది. కేంద్రంలోని పార్లమెంట్‌గానీ, రాష్ట్రాల్లోని చట్టసభలుగానీ సజావుగా ఒక్క నిమిషం కూడా జరిగిన దాఖలాలు లేవు. గత ఐదో తేదీ నుంచి మొదైలెన పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇంతవరకు ఏ ఒక్క అంశాన్నీ చేపట్టలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిదంటూ తెలుగుదేశం పార్టీ సభ్యులు నిత్యం ఉభయసభల్లోను గందరగోళం సృష్టిస్తుండగా, తెలంగాణలో రిజర్వేషన్ల అంశంపై టీఆర్‌ఎస్, కావేరీ జలాల సమస్యపై తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకె సభ్యులు, బ్యాంకుల కుంభకోణంపై తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ సభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకోవడంతో రెండుసభలూ ఒక్క అంశాన్ని కూడా చేపట్టలేక వాయిదాలు పడుతూనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రాల స్థాయిలో చట్టసభల్లో ప్రజాప్రతినిధుల ప్రవర్తన మరింత జుగుప్సాకరంగా ఉంటోంది. సోమవారం తెలంగాణ అసెంబ్లీలో జరిగిన గందరగోళం, విధ్వంసం సభ్య సమాజాన్ని విస్తుగొలిపింది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ఈవీఎల్ నరసింహన్ ప్రసంగం మొదలుపెట్టగానే  కాంగ్రెస్ సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టిస్తూ పేపర్లను చింపి విసిరేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే యత్నంలో ఘర్షణ వాతావరణాన్ని కల్పించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌పైకి కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరినట్టుగా చెబుతున్న హెడ్‌ఫోన్స్ తగిలి శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో ఆగ్రహించి జానారెడ్డి సహా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, గీతారెడ్డి, డికె అరుణ తదితర 11మందిని బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్‌చేస్తూ మంగళవారం అసెంబ్లీ తీర్మానించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దుచేస్తున్నట్టు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. మండలి చైర్మన్‌పై తాము దాడిచేయలేదని, తమ వాదన వినకుండానే చర్యలు తీసుకున్నారంటూ కాంగ్రెస్ ప్రతిదాడి చేస్తోంది. సభలో ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీసే హ క్కును ప్రతిపక్షం ఎందుకిలా పోగొట్టుకుంటోంది? ప్రభుత్వానికీ కావలసింది ఇదే. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏదోలా విపక్షాన్ని రెచ్చగొట్టి సభాకార్యక్రమాలను వాయిదా వేయించడం పరిపాటిగా మారింది. దీంతో ప్రజాసమస్యలు గాలికి కొట్టుకుపోతున్నాయి. 15వ లోక్‌సభ సమావేశాల్లో దాదాపు 92 గంటల పాటు సభాకార్యక్రమాలు స్తంభించాయి. పార్లమెంట్ ఉభయసభల నిర్వహణకు నిమిషానికి రెండున్నర లక్షల రూపాయల ప్రజాధనం వ్యయమవుతోంది. ప్రభుత్వ విధానాలపై  ప్రజల భాగస్వామ్యంతో రాజకీయ పక్షాలు నిరసనోద్య మాలు చేపట్టడం మాని ప్రజాసమస్యలపై సమగ్రంగా చర్చించి విధానాలను రూపొందించవలసిన చట్టసభల్లో కెమెరాల ముందు వీరంగం వేయడంపై కేంద్రీ కరిస్తున్నాయి. దాంతో చట్టసభలు ధర్నాచౌక్‌లుగా, నిరసన ప్రదేశాలుగా మారిపోయాయి.ప్రజాసమస్యలను లేవనెత్తే అంశాన్ని ప్రతిపక్షం ఆలోచించదు…ప్రజాసమస్యలపై తగురీతిలో స్పందిద్దామని ప్రభుత్వమూ యోచించదు. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారివి. చట్టసభలు మొదలవుతున్నాయనగానే ప్రజలు చప్పరించే స్థాయికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధుల తీరుచూసిన తరువాత చట్టసభల సమావేశాల వల్ల ఒరిగేదేమిటన్నది వేయి డాలర్ల ప్రశ్నగా తొలుస్తుంటుంది. ప్రతిపక్షం ఇచ్చిన ఏ ఒక్క వాయిదా తీర్మానాన్నీ చట్టసభల్లో చర్చకు తీసుకోరు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలైపె చర్చకు ప్రతిపక్షం అంగీకరించదు. ఎవరి ఇగోలు వారివి. ఎవరి పట్టుదలలు వారివి. ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలన్న మొండిైవెఖరి తప్ప! తీరుమార్చుకోలేని ప్రజాప్రతినిధుల వైఖరితో ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న ఆశలు ఆవిరి అవుతున్నాయి.
Tags: Three options are available

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *