దేవినేని మల్లికార్జునరావుకు మూడు పార్టీల ఆఫర్

Three parties offer Deviine Mallikarjuna Rao

Three parties offer Deviine Mallikarjuna Rao

Date:12/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న దేవినేని మ‌ల్లిఖార్జున‌రావుకు రాజ‌కీయంగా ద‌శ తిర‌గ‌నుంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయ‌న‌కు ఇప్పుడు ప్ర‌ధానంగా మూడు పార్టీల నుంచి ఆఫ‌ర్లు వ‌చ్చిప‌డుతున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా కీల‌క‌మైన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోఆయ‌న‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. వేమూరు, రేప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న మ‌ద్ద‌తు ఇచ్చిన వారు గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌బావుటా ఎగుర‌వేశారు. వీరిలో వేమూరు ఎమ్మెల్యే న‌క్కాఆనంద‌బాబు మంత్రిగా కూడా ఉన్నారు. అదేవిధం గా కృష్ణాజిల్లా అవ‌నిగ‌డ్డ‌లోనూ దేవినేని మ‌ల్లిఖార్జున‌రావుకు మంచి ప‌ట్టు, ఫాలోయింగ్ రెండూ ఉండ‌డం గ‌మ‌నార్హం.
మొద‌ట్లో కాంగ్రెస్‌లో ఉన్న మ‌ల్లిఖార్జున‌రావు.. వైఎస్‌కు అనుచ‌రుడిగా గుర్తింపు పొందారు.2004లో ఆయ‌న రేప‌ల్లె నుంచి పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే, 2009 నాటికి ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో 2014లో రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆయ‌న టీడీపీలోకి జంప్ చేశారు. పార్టీ ఏదైనా ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో ఉన్న ఆద‌ర‌ణ మాత్రం ఏమాత్ర‌మూ త‌గ్గ‌లేదు. ఆస‌మ‌యంలోనే ఆయ‌న రేప‌ల్లె టికెట్ ఇవ్వాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబును కోరారు.
అయితే, అప్ప‌టికి ఉన్న స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో టికెట్ ఇవ్వ‌ని చంద్ర‌బాబు.. పార్టీ అధికారంలోకి రాగానే ఏదైనా మంచి ప‌దవి ఇస్తాన‌ని మాట ఇచ్చారు. అంతేకాదు, రేప‌ల్లె, వేమూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోని త‌మ్ముళ్లకు సాయం చేయాల‌ని, వారి గెలుపున‌కు కృషి చేయాల‌ని కోరారు. దీంతో అభ్యర్థుల‌క‌న్నా ఎక్కువ‌గా మ‌ల్లిఖార్జున‌రావు నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగి ప్ర‌జ‌ల‌ను టీడీపీ వైపు మ‌ళ్లించారు. ఫ‌లితంగా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లోనూ టీడీపీ విజ‌యబావుటా ఎగుర‌వేసింది.టీడీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక త‌న‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని, కీల‌క‌మైన బాధ్య‌త‌లు, ప‌ద‌వి ద‌క్కుతాయ‌ని భావించిన దేవినేనికి చంద్ర‌బాబు నుంచి మొండి చేయే ల‌భించింది. దీంతో ఆయ‌న తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు.
అయినా కూడా త‌న‌ప‌ని తాను చేసుకుపోతున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకోవ‌డం, త‌న ఓటు బ్యాంకును కాపాడుకోవ‌డంలోను ఆయ‌న ముందున్నారు. దీంతో రేప‌ల్లెలో ఆయ‌న పేరు మార్మోగుతోంది. అయితే, త‌న‌ను గెలిపించిన రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ మాత్రం దేవినేనిని దూరం చేసుకున్నారు. అయినా కూడా దేవినేని ప్ర‌జ‌ల‌ను మాత్రం విడిచి పెట్ట‌లేదు. టికెట్ ఇస్తే .. భారీ మెజారిటీతో గెలుపొంద‌డం ఖాయంగానే ఆయ‌న రాజ‌కీయాలు చేస్తున్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబు ఈయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేద‌ని టాక్‌. దీంతో తాను ఏంచేయాల‌నే విష‌యంపై ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిలో దేవినేని ఉన్నారు.
ఇదిలావుంటే, మ‌ల్లిఖార్జున‌రావు హ‌వాను, ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న ఫాలోయింగ్‌ను ప‌సిగ‌ట్టిన టీడీపీ అధినేత‌.. ఎక్క‌డ ఆయ‌న జారిపోతారో అని అనుకుంటున్నారో ఏమో ఇటీవ‌ల వేమూరు ప‌ర్య‌ట‌న‌లో పాల్లోనాల‌ని సీఎంవో నుంచి ఆహ్వానం పంపారు. మ‌ల్లిఖార్జున రావును బుజ్జ‌గించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదేస‌మ‌యంలో టీడీపీలో దేవినేని అసంతృప్తితో ఉన్నార‌ని తెలుసుకున్న వైసీపీ అదినేత జ‌గ‌న్‌.. కూడా ఈయ‌న‌ను త‌న పార్టీలో చేర్చుకునేందుకు పావులు క‌దుపుతున్నారు. అయితే, రేప‌ల్లె టికెట్ మాత్రం ఇచ్చేందుకు ఆయ‌న వెనుకాడుతున్నారు. ఇక్క‌డ వైసీపీకి మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ ఉండ‌డంతో వైసీపీ అధికారంలోకి వ‌స్తే.. ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇస్తున్నారు.
ఒక‌సారి చంద్ర‌బాబు మాట విని.. ఆగిపోవ‌డం, ఆ మాట నెర‌వేర‌క పోవ‌డంతో దేవినేని ఇప్పుడు వైసీపీలోకి వెళ్లాలా వ‌ద్దా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. మ‌రోప‌క్క‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న‌సేన నుంచి కూడా ఆహ్వానం అందింది. ప‌వ‌న్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. రేప‌ల్లె టికెట్ ఇస్తాన‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు దేవినేని మ‌ల్లిఖార్జున రావు ఎప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా ప్ర‌జాభిమానం, ప్ర‌జ‌ల ఫాలోయింగ్ మెండుగా ఉన్న దేవినేని ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నాఓకే అంటున్నారు ప్ర‌జ‌లు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:Three parties offer Deviine Mallikarjuna Rao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *