భద్రాచలంలో మూడు ముక్కలాట

ఖమ్మం ముచ్చట్లు:

రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం(హాట్రిక్) చేపట్టడం ఖాయం అనుకుంటున్న టీఆర్ఎస్ నాయకులు భద్రాచలం అసెంబ్లీ సీటు కోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. భద్రాచలంలో టీఆర్ఎస్ జెండా ఎగిరితేతప్ప కాలు మోపనని కేసీఆర్ భీష్మించుకున్నట్లుగా ఆ పార్టీ శ్రేణుల్లో గుసగసలు వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి ఎలాగైనా టీఆర్ఎస్‌ను గెలిపించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు నాయకులంతా పట్టుదలతో ఉన్నారు. సరైన అభ్యర్థి కోసం ఓవైపు నిఘావర్గాలు, మరోవైపు సర్వే బృందాలు, ఇంకోవైపు పార్టీ యంత్రాంగం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నోట ముందస్తు ఎన్నికల మాట వెలువడిన నేపథ్యంలో ఆశావహులు అధిష్టానం ఆశీస్సుల కోసం మరింత దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో వామపక్షాలతో టీఆర్ఎస్ జతకడితే భద్రాచలం సీటు లెఫ్ట్ పార్టీలకు వదిలేయక తప్పదనే భావన ఉన్నప్పటికీ, పోటీ చేయాలనుకునే అభిలాష ఉన్న టీఆర్ఎస్ నాయకులు లాబీయింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. గ్రూపులకు నిలయమైన భద్రాచలంలో ఈసారి టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రధానంగా ముగ్గురు పోటీపడుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి తెరపై కనిపించే ఈ ముగ్గురే కాకుండా తెరవెనుక మరికొందరు గిరిజన నాయకులు, వారి మద్దతుదారులు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

 

 

టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం సీటు రేసులో ముందు వరుసలో ఉన్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడైన వెంకట్రావు 2014లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి మహబూబాబాద్ ఎంపీ స్థానానికి, 2018లో టీఆర్ఎస్ నుంచి భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ పార్టీలో సముచితస్థానం లభించడం గమనార్హం. ఈసారి కూడా సీటు తనకే వస్తుందని ఆశిస్తున్నారు. గ్రూపు గొడవలే తన ఓటమికి ప్రధాన కారణమని మథనపడుతున్న వెంకట్రావు గతంకంటే నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలం పెరగడంతోపాటు ఈసారి సానుభూతి ఓట్లు కూడా లభిస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. పొంగులేటి అండదండలతో మరోమారు ఆయన తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. భద్రాచలం నియోజకవర్గంలో పొంగులేటి వర్గం బలంగా లేకపోవడం, వైద్యుడైన వెంకట్రావు తన ప్రైవేటు ఆసుపత్రికి ఇచ్చే ప్రాధాన్యత పార్టీకి ఇవ్వడంలేదనే అపవాదు, కోఆర్డినేషన్ లీడర్ షిప్ లోపం ఆయన బలహీనతలుగా పార్టీలో చెప్పుకొంటున్నారు.అవకాశం వస్తే ఈసారి భద్రాచలం నుంచి పోటీ చేయాలని టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి మానె రామకృష్ణ ఉవ్విళ్ళూరుతున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి విధేయుడైన రామకృష్ణ భద్రాచలం రాజకీయంలో చక్రం తిప్పగల నాయకుడు రసూల్‌కు కుడి భుజంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారుడైన మానె రామకృష్ణ 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా భద్రాచలం బరిలో నిలిచి 8728 ఓట్లు ( 5.26 శాతం ) సాధించారు. భద్రాచలంలో ఆనాడు ఉద్యమ ప్రభావం అంతగా లేకపోవడంతో అప్పట్లో అవి పార్టీ ఓట్లు అనడం కంటె రామకృష్ణ తన వ్యక్తిగతంగా సాధించిన ఓట్లుగానే పరిశీలకులు అంచనా వేశారు. 2018లో మారిన రాజకీయ పరిస్థితుల్లో మానె రామకృష్ణకి సీటు రాలేదు. అయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈసారి టిక్కట్ కోసం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే శ్రీనివాసరాజుపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే రామకృష్ణకి బీజేపీ వారు గాలం వేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురై తెలంగాణ ఉద్యమకారుల కోరిక మేరకు సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళిన రామకృష్ణ 2018 నుంచి పార్టీలో యాక్టీవ్‌గా లేకపోవడం కొంత మైనస్‌గా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

 

 

 

మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణని నమ్ముకొని రాజకీయ అడుగులు వేసే చర్ల ఏఎంసీ మాజీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య (వాజేడు) భద్రాచలం సీటు రేసులో ఉన్నారు. గతంలో వాజేడు మండలంలో పార్టీ అధ్యక్ష పదవి, జెడ్పీటీసీ. ఎంపీపీ పదవులు చేపట్టిన ఆయన అనంతరం వరుసగా రెండుసార్లు చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భద్రాచలం టిక్కెట్ ఆశిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించినా పోటీచేసే అవకాశం రాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా వస్తుందని ఆశపడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన బాలసానితోనే తన రాజకీయ ప్రయాణం అని చెప్పే బుచ్చయ్య భద్రాచలం సీటు విషయంలో కూడా బాలసానినే నమ్ముకున్నారు. ఆయన బలం, భరోసా బాలసాని. అయితే జనంలోకి చొచ్చుకొనిపోయే తత్వంలేదనే అభిప్రాయం బుచ్చయ్యకు మైనస్‌గా భావిస్తున్నారు.ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య వంటి ప్రముఖులు కూడా పార్టీ అవకాశం కల్పిస్తే భద్రాచలం నుంచి పోటీచేసి టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఉన్నట్లుగా పార్టీలో ప్రచారం లేకపోలేదు. ఇప్పటివరకు చేసిన సర్వేల రిపోర్టులను బట్టి భద్రాచలం సీటు టీఆర్ఎస్ గెలిచే జాబితాలో లేదనే వార్తలు వినిపిస్తున్నా, అభ్యర్థిని బట్టి భద్రాచలం సీటు సునాయాసంగా గెలవొచ్చనే అభిప్రాయం గులాబీ క్యాడర్‌లో బలంగా వినిపిస్తోంది. అందుకే ఈసారి గెలుపు గుర్రానికే టిక్కట్ ఇచ్చి భద్రాచలంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పార్టీ అధిష్టానం ఆలోచనగా తెలుస్తోంది. అయితే గ్రూపులకు నిలయమై పార్టీలో ఆధిపత్యం కోసం నాయకులు పోట్లాడుకుంటున్న నేపథ్యంలో ఒక వర్గానికి టిక్కెట్ ఇస్తే మిగిలిన వారు సరిగా పనిచేస్తారా? లేక గతంలో మాదిరిగా క్రాస్ ఓటింగ్ చేసి పార్టీని ఓడిస్తారా? అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

 

Tags: Three pieces in Bhadrachalam

Natyam ad