మక్తల్ లో మూడు ముక్కలాట
మహబూబ్ నగర్ ముచ్చట్లు:
నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఆయన.. 2018లో అధికారపార్టీ టికెట్‌పైనే పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పోటీ చేస్తారా లేక కొత్త వారు బరిలో ఉంటారా? అనే ప్రశ్న చుట్టూనే మక్తల్ గులాబీ శిబిరంలో వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో రామ్మోహన్‌రెడ్డి భార్య సుచరితారెడ్డి పేరు రేస్‌లోకి రావడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికలకు ముందు కూడా సుచరిత ప్రగతి భవన్‌కు వెళ్లి టికెట్ అడిగినట్టుగా ప్రచారం జరిగింది.భర్త రామ్మోహన్‌రెడ్డితో కలిసి సుచరిత కూడా పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కంటే ఆమె మాటే పవర్ఫుల్ అని పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటాయి. ప్రభుత్వ యంత్రాంగం.. టీఆర్ఎస్ ద్వితీయశ్రేణి నాయకత్వం సైతం మేడమ్తోనే టచ్‌లో ఉంటాయట. సుచరిత చొరవ చూశాక.. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో ఉంటారేమోనని కేడర్ భావిస్తోందట. ఇదే సమయంలో మక్తల్ రాజకీయ పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు నియోజకవర్గానికి చెందిన మరికొందరు టీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారు. చిట్టెం కుటుంబానికి టికెట్ నిరాకరిస్తే.. తన్నుకుపోవాలని చూస్తున్నారట నాయకులు. ఈక్వేషన్ మారితే అదృష్టం తలుపు తట్టక మానదు అనేట్టుగా ఆశావహులు ఎదురు చూపులు ఉన్నాయి.
డీసీసీబీ ఛైర్మన్ నిజాంపాషా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. పార్టీ పెద్దలతోపాటు జిల్లా పార్టీ నాయకులతో ఎప్పటికిప్పుడు మంచిచెడ్డల గురించి మాట్లాడుతున్నారట. ఇక సేవా కార్యక్రమాల ద్వారా మరో నాయకుడు కూడా రేస్‌లో ఉన్నానని అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. టీఆర్ఎస్లో తమకు పరిచయం ఉన్న పార్టీ పెద్దలతో లాబీయింగ్ చేస్తున్నారటమక్తల్లో టీఆర్ఎస్ శిబిరంలో బీజేపీ గుబులు పట్టుకుందట. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయి. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో మక్తల్ మున్సిపాలిటీని కైవశం చేసుకుంది. గతంలో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలో దిగిన జలందర్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడంతో సమీకరణాలు మారుతున్నాయి. ఇది చిట్టెం క్యాంప్‌ను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ కూడా పుంజుకోవడానికి చూస్తోంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న దయాకర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని అనుకుంటున్నారట. దీంతో టీఆర్ఎస్లో ఇంటిపోరు.. సత్తా చాటేందుకు చూస్తున్న బీజేపీ.. కాంగ్రెస్ దూకుడు వచ్చే ఎన్నికల్లో మక్తల్ పోరును రసవత్తరంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి.. పరిస్థితులను అనుకూలంగా మలుచుకునేందుకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఏం చేస్తారో? పార్టీ దిశానిర్దేశాలేంటో చూడాలి.

Tags: Three pieces in Maktal
